logo

అనాథలపై ఇదేనా వాత్సల్యం?

అనాథ పిల్లలకు చేదోడువాదోడుగా ఉండే ‘మిషన్‌ వాత్సల్య’ పథకం అటకెక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకానికి నిధులు విడుదల చేయడం లేదు.

Published : 21 Sep 2023 05:11 IST

ఆరు నెలలుగా అందని సాయం

లబ్ధిదారుల ఎంపికపై విచారిస్తున్న అధికారులు (పాత చిత్రం)

అనాథ పిల్లలకు చేదోడువాదోడుగా ఉండే ‘మిషన్‌ వాత్సల్య’ పథకం అటకెక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకానికి నిధులు విడుదల చేయడం లేదు. దీంతో లబ్దిదారులకు గత ఆరు నెలలుగా సాయం అందడం లేదు. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులు ఎంతమంది ఉన్నారనేదానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. అసలు పథకం కొనసాగుతుందా? లేదా? అనే అయోమయం లబ్దిదారుల్లో నెలకొంది.

న్యూస్‌టుడే, జిల్లా సచివాలయం


మూడేళ్ల కిందట కరోనా బారిన పడి పలువురు మృతిచెందారు. దీంతో పలువురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ నేపథ్యంలో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ మృతిచెందిన పిల్లలకు ఆర్థికసాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘మిషన్‌ వాత్సల్య’ పథకాన్ని 2022లో ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 501 మంది ‘కొవిడ్‌-19’ బాధిత పిల్లలతో పాటు హెచ్‌ఐవీ బాధిత చిన్నారులు 123 మందికి ఆర్థిక సాయం కింద నెలకు రూ.4 వేలు అందిస్తోంది. ఈ ఏడాది మార్చి వరకు వారికి లబ్ధి చేకూరింది. ఏప్రిల్‌ నుంచి నిధులు విడుదల కాలేదు. దీంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.


పెద్దఎత్తున దరఖాస్తులు

‘మిషన్‌ వాత్సల్య’ పథకంలో అనాథలకే కాకుండా తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారికీ సాయం అందిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాలి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని బాలల సంరక్షణ సమితి ఈ ఏడాది పథకం కింద ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 15,258 దరఖాస్తులు స్వీకరించింది. వీటన్నింటినీ వడపోసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అప్పటి నుంచి ఇంతవరకు వీటికి సంబంధించి ఊసేలేదు. ఎప్పుడు వస్తాయో, ఎవరెవరికి మంజూరయ్యాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ ఇవ్వాలా లేక ఒకరికే అనేది రాష్ట్రప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరింత వడపోసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారు తమ వాటాగా 60 శాతం నిధులను రాష్ట్రానికి మంజూరు చేస్తారు. మిగిలిన 40 శాతం మంజూరు చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకే సరిగా వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. పలు పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ‘మిషన్‌ వాత్సల్య’ పథకానికి నిధులు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  


నిధులు కేటాయిస్తే అందజేస్తాం

నిధులు వచ్చినంత వరకు లబ్ధిదారులకు పంపిణీ చేశాం. మళ్లీ విడుదల కాగానే వారికి అందిస్తాం. కొత్తగా తీసుకున్న దరఖాస్తులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయించాల్సి ఉంది. 

శ్రీలక్ష్మి, పీడీ,  స్త్రీ, శిశుసంక్షేమశాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని