logo

Pulivendula: పులివెందుల వరకూ అవినీతి ఊడలు!

నకిలీ సంతకాలు, పత్రాల పోకడలు వైయస్‌ఆర్‌ జిల్లా అంతటా చుట్టుకుని చివరకు ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందుల వరకు చేరాయి.

Updated : 26 Sep 2023 08:56 IST

రెవెన్యూలో అంతులేని అక్రమాలు
కలెక్టర్‌ సంతకమే ఫోర్జరీ చేసేసి...
అంత ధైర్యం ఎక్కడిదంటూ చర్చ

పులివెందులలో అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగిన భూమి ఇదే

నకిలీ సంతకాలు, పత్రాల పోకడలు వైయస్‌ఆర్‌ జిల్లా అంతటా చుట్టుకుని చివరకు ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందుల వరకు చేరాయి. ఇప్పటివరకు వీఆర్వోలు, తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేయగా, పులివెందుల వరకు అక్రమం చేరే సరికి ఏకంగా కలెక్టర్‌ సంతకమే ఫోర్జరీ చేయడంతో నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీˆ) అచ్చం అధికారికంగా రూపొందించినట్లు జారీ అయిపోయాయి. గతంలో చోటుచేసుకున్న ఘటనలు రాజకీయం చుట్టూ తిరగడం, వీటిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో చివరకు వ్యవహారం పులివెందుల వరకు చేరి పెద్ద వ్యవహారమై కూర్చుంది. ఈ విషయం తెలిసి కలెక్టర్‌ విజయరామరాజు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కఠిన చర్యలకు ఉపక్రమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వ్యవహారం పోలీసుల చేతికెళ్లడంతో ఎంత వరకు తేల్చుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఈనాడు, కడప: లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన వైకాపా కీలక నేత ఊటుకూరు విద్యానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై శ్రీపతి శ్రీనివాసులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలు తయారు చేసి చుక్కల భూముల రిజిస్ట్రేషన్‌కు అందించారనే అభియోగాలు మోపారు. సీఎం సమీప బంధువులు సైతం కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి.  సమగ్ర ఆధారాలతో సహా ఆర్డీవో వెంకటేశ్వర్లు శనివారం ఇచ్చిన నివేదికతోపాటు విద్యానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కలిపి కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వ్యవహారంపై పులివెందుల ఆర్డీవో వెంకటేశులు, తహసీˆల్దార్‌ మాధవ కృష్ణారెడ్డిని కలెక్టర్‌ కడపకు పిలిపించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణ పురోగతిపై సమీక్షించారు.

కలెక్టర్‌ కార్యాలయం నుంచే వెలుగులోకి... : ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఎన్‌వోసీ ద్వారా చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇలాంటి పత్రాలు తాను జారీ చేయలేదని తెలుసుకున్న కలెక్టర్‌ విజయరామరాజు అంతర్గతంగా సమగ్ర విచారణ జరిపించగా 12 ఎన్‌వోసీలు బయటపడ్డాయి. వీటితోనే కె.వెలమవారిపల్లెలో సర్వే నంబరు 99/3లో 2.98 ఎకరాలు, 99/1లో 4.26 ఎకరాలు, 98/1లో 1.07 ఎకరాలు, అహోబిలపురంలో 2/2ఎలో 4.55 ఎకరాలు, 45/2లో 4.8 ఎకరాలు, యర్రగుడిపల్లెలో 135/2లో మూడెకరాలు, 135/2లో 3.87 ఎకరాలు, బాకరాపురంలో 58/2లో 4.91 ఎకరాలు, బ్రాహ్మణపల్లెలో 48/3లో 1.41 ఎకరాలు, చిన్నరంగాపురంలో 220/2లో 3.51 ఎకరాల చొప్పున 34.36 ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలింది. వీటి వెనుక శ్రీపతి శ్రీనివాసులు హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఈయనకు సాయం చేసిన రెవెన్యూ అధికారులు ఎవరన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న నకిలీ ఎన్‌వోసీలు జారీ అయ్యాయి. అనంతరం రిజిస్ట్రేషన్లు జరిగాయి. పులివెందుల చుట్టూ కొత్తగా నిర్మించిన బాహ్య వలయ రహదారి సమీపంలో కె.వెలమవారిపల్లె, అహోబిలపురం, యర్రగుడిపల్లె, బాకరాపురం, బ్రాహ్మణపల్లె, చిన్నరంగాపురం తదితర గ్రామాల్లో చుక్కల భూములున్నాయి. వీటికి రిజిస్ట్రేషన్‌ జరగడంతో పట్టా భూములుగా మారిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. వైకాపా నేత విద్యానందరెడ్డి రెండెకరాలు కొనుగోలు చేశారు. నకిలీ వ్యవహారం బయటపడడంతో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్లు జరిగిన భూముల్లో వెంచర్లు వేయడంతోపాటు ఎలాంటి అనుమతుల్లేకుండా చాలా వరకు భవన నిర్మాణాలు జరిగిపోయాయి. పులివెందులలో నకిలీ పత్రాల ఆధారంగా భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన నేపథ్యంలో పులివెందుల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రమేయంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇంత పెద్దఎత్తున దందా సామాన్యులు చేయగలరా..? పెద్దల హస్తం లేనిదే.. ఇంత వ్యవహారం నడుస్తుందా..? అందులోనూ సీఎం ఇలాకాలో వేలుపెట్టడం అంత సులభమా...? తదితర ప్రశ్నలకు మాత్రం ఇప్పటివరకు సమాధానాలు దొరకలేదు. ఇంత పెద్ద వ్యవహారం విషయంలో పోలీసు విచారణ మందగమనంగా జరుగుతుండడంతో శ్రీపతి శ్రీనివాసుల వరకే కేసును పరిమితం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.  


పోలీసుల అదుపులో ఆ నలుగురు

ఫోర్జరీ సంతకాలు, నకిలీ ఎన్‌వోసీల తయారీలో పాత్ర ఉన్నట్లు అనుమానిస్తూ నలుగురిని పులివెందుల పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో దళారీగా ఉన్న శ్రీపతి శ్రీనివాస్‌, వీఆర్వో కళానంద్‌రెడ్డి, సర్వేయర్లు సందీప్‌రెడ్డి, వాసుదేవరెడ్డిలు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇద్దరు రూ.కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేయడం, పులివెందులలో హోటల్‌ నెలకొల్పడం వంటి లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం.  రెవెన్యూ విభాగానికి చెందిన ముగ్గురు దీర్ఘకాలంగా పులివెందులలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని