logo

సడలని పట్టు... వీడని పోరు!

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి  అరెస్టును వ్యతిరేకిస్తూ అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

Updated : 27 Sep 2023 04:51 IST

చంద్రబాబు అరెస్టుపై కొనసాగుతున్న తెదేపా శ్రేణుల ఆందోళనలు
ఈనాడు, కడప, న్యూస్‌టుడే బృందం

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి  అరెస్టును వ్యతిరేకిస్తూ అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పలుచోట్ల రిలే నిరాహార దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టయినప్పుడు నుంచి మొదలైన ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఆలయాల్లో పూజలు, రిలే నిరాహార దీక్షలు, నిరసనలతో తెదేపా శ్రేణులు   హోరెత్తిస్తున్నారు. బాబు విడుదలయ్యే వరకు నిరసనలకు విరామం ప్రకటించేది లేదంటూ కదం తొక్కుతున్నారు. చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకొస్తారని ఆశాభావంతో ఉన్నారు.

ప్రొద్దుటూరులో శివాలయం కూడలిలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. అన్న క్యాంటీన్‌ ఆవరణలో రాష్ట్ర నాయకులు సురేష్‌నాయుడు ఆధ్వర్యంలో దీక్ష కొనసాగింది. తెదేపా కార్యాలయం వద్ద నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. జమ్మల మడుగులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గీయులు దీక్షలో పాల్గొని మద్దతు పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి సంఘీభావం ప్రకటించారు. పులివెందులలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. బద్వేలు, కడపలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కడప నగరంలోని 44వ డివిజన్‌లో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాధవీరెడ్డి ‘చంద్రన్నకు తోడు’గా కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సుధా అంకిరెడ్డి మృతికి సంతాప సూచకంగా కమలాపురంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన చిత్రపటానికి నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పాల్గొని అంకిరెడ్డి పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. మైదుకూరులో ఎస్సీ విభాగం నేతలు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. నందలూరులో తెదేపా నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలతో చెయ్యేరు నదిలోని ఇసుకలో పీకల్లోతు మునిగి తమ నిరసన తెలిపారు. పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో పార్టీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వినూత్నంగా నిరసన చేపట్టారు. తెలుగుయువత ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా ఆందోళన నిర్వహించారు. రాజంపేటలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. రాజంపేట మండల అధ్యక్షుడు సుబ్బనరసయ్యనాయుడు ఆధ్వర్యంలో కోల్లావారిపల్లి, మేకవారిపల్లి నుంచి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. రైల్వేకోడూరులో పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మా శివ ఆధ్వర్యంలో దీక్ష జరగ్గా, జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర, వెంకటసుబ్బయ్య పాల్గొని మద్దతు ప్రకటించారు. రాజంపేటలో  పార్టీ సీనియర్‌ నేత చమర్తి జగన్‌మోహన్‌రాజు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. భవానినగర్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చంద్రబాబుకు త్వరగా బెయిల్‌ మంజూరు కావాలని ప్రార్థించారు.


అండగా ఉంటాం

తెదేపా అధినేత చంద్రబాబుకు అండగా నిలుస్తామని పార్టీ కడప పరిశీలకులు రామ్మోహన్‌చౌదరి, కడప నియోజకవర్గ బాధ్యురాలు మాధవిరెడ్డి, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌ స్పష్టం చేశారు. కడప నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు.


రాక్షస పాలనకు చరమగీతం పాడతాం

రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడతామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు శివాలయం కూడలిలో తెదేపా నాయకులు,
కార్యకర్తలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు.


సమష్టిగా సంఘీభావం

మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా శ్రేణులకు సంఘీభావం ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పాల్గొన్న జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యుడు భూపేష్‌రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు


ఆందోళనల హోరు

మైదుకూరులో రిలే నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా ఎస్సీ విభాగ కమిటీ ప్రతినిధులు. తమ అధినేత చంద్రబాబును విడుదల చేయాలంటూ పెద్దఎత్తున ఆందోళన చేశారు.  


ముందుంటాం... మద్దతిస్తాం

తెదేపా ఆందోళనకు ముందుంటామని పులివెందులలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి), నాయకులు, కార్యకర్తలు


నిరసనల జోరు

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బద్వేలు పట్టణంలో కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు


పోరాటం ఆపేది లేదు

తెదేపా అధినేత చంద్రబాబు విడుదలయ్యే వరకు తమ పోరాటం ఆపేది లేదంటూ ప్రొద్దుటూరు పట్టణంలో రిలే  నిరాహార నిరసన దీక్షలో పాల్గొన్న తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులు


తెదేపా అధినేతకు అండగా సైకిల్‌ యాత్ర

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంటకు చెందిన సతీష్‌కుమార్‌ రాజమహేంద్రవరానికి చేపట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం మధ్యాహ్నం కమలాపురం నియోజకవర్గం వీరపునాయునిపల్లెకు చేరుకుంది. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ ఎలాంటి తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి వేధించడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని