logo

కలివికోడి ఆచూకీకి మరో ప్రాజెక్టు

దేశంలో కొన్ని అరుదైన పక్షులు, వన్యప్రాణులు అంతరించిపోయే దశకు చేరుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇందులో భాగంగా కలివికోడితో పాటు మరో 20 రకాల అరుదైన జీవజాతుల స్థితిగతులను సేకరించేందుకు ‘వన్యప్రాణుల సమగ్ర అభివృద్ది ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టింది.

Published : 27 Sep 2023 04:32 IST

సిద్దవటం, న్యూస్‌టుడే : దేశంలో కొన్ని అరుదైన పక్షులు, వన్యప్రాణులు అంతరించిపోయే దశకు చేరుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇందులో భాగంగా కలివికోడితో పాటు మరో 20 రకాల అరుదైన జీవజాతుల స్థితిగతులను సేకరించేందుకు ‘వన్యప్రాణుల సమగ్ర అభివృద్ది ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టింది. జిల్లాలో అరుదైన కలివికోడి ఆచూకీని కనిపెట్టేందుకు ఇప్పటికే ఏడుగురితో కూడిన పరిశోధన బృందం సిద్దవటం రేంజికి చేరుకుంది.

గతంలో ప్రాజెక్టు : గతంలో కొన్ని దశాబ్దాలపాటు కలివికోడి కనిపించకుండా పోవడంతో దానిని అంతరించిపోయిన పక్షుల జాబితాలోకి చేర్చేందుకు అంతర్జాతీయ పరిశోధక సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా 1986లో సిద్దవటం రేంజిలోని కొండూరు బీటు అటవీ ప్రాంతంలో కనిపించడంతో ఆ జాతిని పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ, పక్షి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేపట్టారు. కొండూరులో 2015లో ప్రత్యేకంగా  పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. 2019లో కేంద్రప్రభుత్వం కలికికోడి పునర్జీవ ప్రాజెక్టును మంజూరు చేసి రూ.5.73 కోట్లు కేటాయించింది. 2019-20 నుంచి 2024-25 వరకు ప్రాజెక్టు కొనసాగించాల్సి ఉండగా కొవిడ్‌ నేపథ్యంలో అవాంతరాలు నెలకొన్నాయి. తర్వాత 2022-23 నుంచి 2026-27 వరకు అయిదేళ్ల పాటు కొనసాగేలా మరో షెడ్యూలు ప్రకటించారు.  శాస్త్రవేత్త రాకపోవడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని భావించారు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత కలివికోడి ఆచూకీకి మరో ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అరుదైన కలివికోడిని గుర్తించాలన్నదే లక్ష్యంగా గాలింపు చర్యలు చేపడతామని ప్రాజెక్టు అసోసియేట్‌ పవిత్ర తెలిపారు. సిద్దవటం రేంజిలో అరుదైన గాలింపు చర్యలకు పీసీసీఎఫ్‌ నుంచి అనుమతులు వచ్చాయని, సిద్దవటం రేంజి అటవీ క్షేత్రాధికారిణి  బి.కళావతి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని