logo

ఆ నలుగురిదే హస్తం

పులివెందులలో సంచలనం రేపిన భూ కుంభకోణం వ్యవహారాన్ని ఎట్టకేలకు పోలీసులు తేల్చారు. కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ, నకిలీ నిరభ్యంతర పత్రాల తయారీలో పాత్ర ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Published : 27 Sep 2023 04:32 IST

పులివెందుల భూకుంభకోణంలో ఇద్దరు సర్వేయర్లు, వీఆర్వో, స్థిరాస్తి వ్యాపారి అరెస్టు
ఎన్‌వోసీ పత్రాల తయారీకి ఉపయోగించిన సామగ్రి స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న పులివెందుల అర్బన్‌ సీఐ రాజు, పక్కన అధికారులు

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందులలో సంచలనం రేపిన భూ కుంభకోణం వ్యవహారాన్ని ఎట్టకేలకు పోలీసులు తేల్చారు. కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ, నకిలీ నిరభ్యంతర పత్రాల తయారీలో పాత్ర ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తేలిన విషయాలను పులివెందుల అర్బన్‌ సీఐ రాజు మంగళవారం విలేకరులకు వెల్లడించారు. డీకేటీ, చుక్కల భూముల క్రయవిక్రయాలకు వీలుగా ఎన్‌వోసీ పత్రాలు తెప్పిస్తామని నమ్మించి నకిలీ పత్రాలను అందజేసి మోసం చేశారంటూ లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన ఊటుకూరు విద్యానంద్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. సర్వే నంబరు 99/3, 99/1, 2/2ఎ, 45/2, 135/2, 58/2, 48/3, 220/2, మరో రెండు సర్వే నంబర్లలోని 35 ఎకరాలకు సంబంధించి ఎన్‌వోసీలు తయారు చేసి ఇస్తామని ఆ భూముల యజమానులతో నిందితులు వీఆర్వో గూడూరు కళానందరెడ్డి, సర్వేయర్లు అంకిరెడ్డిపల్లె సందీప్‌రెడ్డి, చీపాటి వాసుదేవరెడ్డి, స్థిరాస్తి వ్యాపారి శ్రీపతి శ్రీనివాసులు ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. వీరు భూయజమానుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారని, చివరకు నకిలీ ఎన్‌వోసీ పత్రాలు సృష్టించి కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి అందజేశారన్నారు. ఈ నేపథ్యంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నకిలీ ఎన్‌వోసీ పత్రాలు తయారు చేసేందుకు ఉపయోగించిన కంప్యూటరు మానిటర్‌, సీపీయూ, ప్రింటర్‌, ఇతరత్రా పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్‌.ఐ.సత్యనారాయణ, ఎ.ఎస్‌.ఐ.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని