logo

మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

కడప ఎన్జీవో కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని చిన్నచౌకు సీఐ నరసింహారెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాలను మంగళవారం చిన్నచౌకు ఠాణాలో జరిగిన సమావేశంలో సీఐ వెల్లడించారు.

Published : 27 Sep 2023 04:32 IST

వివరాలు వెల్లడిస్తున్న చిన్నచౌకు సీఐ నరసింహారెడ్డి, పక్కన ఎస్‌.ఐ.లు రవికుమార్‌ తులసీనాగప్రసాద్‌, సిబ్బంది

చిన్నచౌకు(కడప), న్యూస్‌టుడే: కడప ఎన్జీవో కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని చిన్నచౌకు సీఐ నరసింహారెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాలను మంగళవారం చిన్నచౌకు ఠాణాలో జరిగిన సమావేశంలో సీఐ వెల్లడించారు. కడప ఎన్జీవో కాలనీకి చెందిన తాటిచెర్ల లక్ష్మి(48)కి రెండేళ్ల కిందట భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, వారికి వివాహాలయ్యాయి. లక్ష్మికి జమ్మలమడుగుకు చెందిన రామాంజినేయులుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. రామాంజినేయులకు ఇది వరకే పెళ్లై భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. సహజీవనం విషయం అతని భార్యకు తెలియడంతో వారిద్దరూ గొడవ పడ్డారు. దీంతో రామాంజినేయులు ఇటీవల లక్ష్మి వద్దకు వెళ్లడం లేదు. దీంతో ఆమె ఫోన్‌ చేసి తన వద్దకు రాకపోతే అతని కుటుంబాన్ని బయటికి ఈడ్చుతానని, పోలీసుస్టేషన్‌లో కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఎలాగైనా లక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి అతడు జమ్మలమడుగు నుంచి కడపకు వచ్చాడు. లక్ష్మితో కలసి భోజనం చేశాడు. ఆమె పడుకున్న తరువాత అర్ధరాత్రి రోకలిబండ తీసుకుని తలపై బలంగా కొట్టాడు. తీవ్రగాయాలతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుని గాలింపు కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా రామాంజినేయులు ఆర్టీసీ బస్టాండు వద్ద సంబంధిత ఆర్‌ఐ వద్ద లొంగిపోయినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు రవికుమార్‌, నాగతులసీ ప్రసాద్‌, సిబ్బంది ఉన్నారు.


ఎర్రచందనం స్మగ్లర్లు...

నిందితులను చూపుతున్న ఎఫ్‌ఆర్వో రమణారెడ్డి, పక్కన ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ సుభం, అటవీశాఖ సిబ్బంది

బద్వేలు, న్యూస్‌టుడే: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న అయిదుగురు స్మగ్లర్లను మంగళవారం బద్వేలు అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో మంగళవారం లంకమల అభయారణ్యంలోని రాణిబావి సమీపంలో తనిఖీలు నిర్వహించారు. బ్రహ్మంగారిమఠం మండలం జెడ్‌ కొత్తపల్లెకు చెందిన శేఖర్‌, రాజన్న, బాలస్వామి, సుందర్‌రావు, బాలరాజు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండగా అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విజమూరుకు చెందిన రామనాథ్‌రెడ్డి ప్రధాన సూత్రదారిగా ఉన్నారని వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు