logo

Adilabad: అలుపెరగలేదు ఒక్కటితో ఆగలేదు.. అయిదు ప్రభుత్వ కొలువులు సాధించిన రాజురా యువకుడు

ఒక్క ప్రభుత్వ కొలువు కోసం వేలాది మంది పోటీ పడే రోజులివి.. సర్కారు కొలువు దక్కక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రోజుల్లో నిరుద్యోగ యువతకు లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన నల్ల సికిందర్‌ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Updated : 11 Jul 2024 07:01 IST

భార్య లావణ్య, పిల్లలు హంశిక, దీక్షితలతో నల్ల సికిందర్‌ 

లోకేశ్వరం, న్యూస్‌టుడే: ఒక్క ప్రభుత్వ కొలువు కోసం వేలాది మంది పోటీ పడే రోజులివి.. సర్కారు కొలువు దక్కక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రోజుల్లో నిరుద్యోగ యువతకు లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన నల్ల సికిందర్‌ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నల్ల ముత్తవ్వ-పెద్ద బక్కన్నల ఏకైక కుమారుడు సికిందర్‌. తల్లి ముత్తవ్వ ఆయన నాలుగేళ్ల ప్రాయంలో మరణించారు. తండ్రి మానసిక స్థితి బాగాలేక అనారోగ్యంతో బాధపడుతూ 2012లో చనిపోయారు. సికిందర్‌ ఏడో తరగతి వరకు రాజురాలో, పదో తరగతి వరకు మన్మద్‌లో, ఇంటర్‌ నిర్మల్‌లోని ప్రైవేటు కళాశాలలో చదివారు. నిర్మల్‌లో డిగ్రీ చదివిన సికిందర్‌ 2008లో బీఎడ్‌ పూర్తి చేశారు. 2010లో ఎంఎస్సీ చదివి 2019లో ఓయూ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఎంఎస్సీ పూర్తి అయిన నాటి నుంచి సర్కారు కొలువు వేటలో పడ్డ సికిందర్‌ 2013లో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇన్‌ ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ కొలువు కొద్దిలో చేజార్చుకున్నారు. అయినా నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించారు. 2018లో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాన్ని దక్కించుకుని అందులో చేరినా బోధనపై మక్కువతో మళ్లీ తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ ఏడాది ఫలితాలు ప్రకటించిన గురుకుల జూనియర్, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు సాధించారు. ఇటీవల ఫలితాలు ప్రకటించిన గ్రూపు-4లో మంచి మార్కులు సాధించిన ఆయన, తాజాగా రెండు రోజుల కింద ఫలితాలు వెల్లడైన టీఎస్‌పీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు, మల్టీజోన్‌ పరిధిలో 3వ ర్యాంకు దక్కించుకున్నారు. అలుపెరగకుండా పోరాటం చేసిన సికిందర్‌ ఇప్పుడు తన లక్ష్యమైన అధ్యాపక వృత్తిలో చేరేందుకు సిద్ధమయ్యారు. 

లక్ష్యం నిర్దేశించుకొని శ్రమించాలి: సికిందర్‌

తల్లిదండ్రులు ఎంత భారమైనా కష్టపడి తమ పిల్లలను చదివిస్తారు. వారి కష్టానికి ప్రతిఫలం చూపించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకొని శ్రమించాలి. తల్లిని, తండ్రిని కోల్పోయినా వారికి పేరు తీసుకొచ్చేలా కష్టపడ్డాను. ఇన్ని ఉద్యోగాలు సాధించడానికి గురువులు, బంధువులు, కుటుంబీకులు అందించిన ప్రోత్సాహమే కారణం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని