logo

రుచి చూసేద్దామా!

ఫిష్‌ ఫ్రై.. ప్రాన్‌ బిర్యానీ.. ఫిష్‌ పకోడి.. ప్రాన్‌ పకోడి.. ఫిష్‌ కట్‌లెట్స్‌.. ఫిష్‌ ఫింగర్‌.. అపోలో ఫిష్‌.. చదివితేనే నోరూరుతుంది కదూ.. వీటితో పాటు మరెన్నో చేపల వంటకాలు రుచి చూసేందుకు వీలుగా ప్రభుత్వం మూడు రోజుల పాటు ఫిష్‌ ఫుడ్‌ పెస్టివల్‌ నిర్వహిస్తోంది..

Published : 08 Jun 2023 03:32 IST

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి చేపల వంటకాల ప్రదర్శన

న్యూస్‌టుడే, రాంనగర్‌: ఫిష్‌ ఫ్రై.. ప్రాన్‌ బిర్యానీ.. ఫిష్‌ పకోడి.. ప్రాన్‌ పకోడి.. ఫిష్‌ కట్‌లెట్స్‌.. ఫిష్‌ ఫింగర్‌.. అపోలో ఫిష్‌.. చదివితేనే నోరూరుతుంది కదూ.. వీటితో పాటు మరెన్నో చేపల వంటకాలు రుచి చూసేందుకు వీలుగా ప్రభుత్వం మూడు రోజుల పాటు ఫిష్‌ ఫుడ్‌ పెస్టివల్‌ నిర్వహిస్తోంది.. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు(జూన్‌ 8, 9, 10) చేపల ఆహార దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేపలు, రొయ్యలతో నోరూరించే వంటకాలను జిల్లావాసులకు పరిచయం చేయనున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో ఏటా 10 కోట్లకు పైగా చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా వదులుతోంది. అవి పెద్దయ్యాక మత్స్యకారులు పట్టుకొని విక్రయించి లబ్ధి పొందుతున్నారు. చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదిలి మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు ఇప్పటికే ఆసక్తి గల మహిళా సంఘాల్లోని మహిళలు, మత్స్యకార కుటుంబాల్లోని మహిళలకు చేపలు, రొయ్యలతో తయారు చేసే పలు వంటకాలపై శిక్షణ ఇచ్చారు. చేపలతో అనేక రకాల వంటకాలు చేయవచ్చనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు.  

శిక్షణ పొందిన సభ్యులతో..

శిక్షణ తీసుకున్న వారితోనే ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇలా చేయడంతో సంఘ సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు చేపలు, రొయ్యలకు సంబంధించిన ఆహార పదార్థాలు అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుంది. మాంసం ధరలు పెరిగిపోవడంతో ఆరోగ్యానికి మేలు చేసే చేపలు, రొయ్యల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచితే, స్థానిక మార్కెట్లో చేపలకు డిమాండ్‌ పెరుగుతుందని అధికారులు తెలిపారు.

డిమాండ్‌ ఎక్కువ..

ఏటా 30 వేల మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తి ఉంటుందని అంచనా. తాజాగా చేపలు, రొయ్యలతో తయారయ్యే ఆహార పదార్థాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో వాటితో తయారు చేసే పలు రకాల చేపలు, రొయ్యల బిర్యానీ, ఫిష్‌ మంచూరియా, ఫ్రైస్‌, పికిల్స్‌, చిల్లిఫిష్‌, ప్రాన్‌ ఆమ్లెట్‌, ఇలా వందల రకాల ఆహార పదార్థాలను విక్రయించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా మొదటిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ఇప్పటికే ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా ఇప్పటికే సంచార వాహనాలను రాయితీపై ఇచ్చారు. చేపలను నిల్వ చేసుకోవడంతో పాటు ఆహార పదార్థాలను ఉంచేందుకు వీలుగా వాహనాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు.


  ఆరోగ్యానికి మేలు
 - వై.సాంబశివ్‌రావు, మత్స్యశాఖ అధికారి, ఆదిలాబాద్‌

చేపలు మంచి పోషకాహారం వీటిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలు. చేపలు, రొయ్యలతో అనేక రకాల వంటకాలు చేసే అవకాశం ఉంది. వీటి తయారీపై మహిళా సంఘాల సభ్యుల్లోని కొంత మంది మహిళలకు శిక్షణ ఇప్పించాం. వినియోగదారులతో పాటు మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు చేపల ఆహార దినోత్సవం నిర్వహిస్తున్నాం.


చెరువులు : 1,609
జలాశయాలు : 15
నీటిలో వదిలే చేప పిల్లలు : 10.40 కోట్లు
మత్స్యకార సంఘాలు : 530
సభ్యులు : 25,167
చేపల ఉత్పత్తి : 30 వేల మెట్రిక్‌ టన్నులు


ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ జరిగే ప్రాంతాలు
ఆదిలాబాద్‌ : రెవెన్యూ గార్డెన్‌
నిర్మల్‌    :  ఎన్టీఆర్‌ స్టేడియం
మంచిర్యాల : జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో
కుమురం భీం : ఆదివాసీ భవన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని