logo

చేపపిల్లల పంపిణీపై నీలినీడలు

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గత భారాస ప్రభుత్వం ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ చేసింది. ఎనిమిదేళ్లుగా పైసా ఖర్చు లేకుండా మత్స్యకారులు చెరువుల్లో ఎదిగిన చేపలను విక్రయించుకోవడం జీవనోపాధిగా మార్చుకున్నారు.

Updated : 12 Jun 2024 02:45 IST

నేటికీ ఖరారు కాని కార్యాచరణ

చేపలు పడుతున్న మత్స్యకారులు (పాతచిత్రం) 

నిర్మల్, న్యూస్‌టుడే: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గత భారాస ప్రభుత్వం ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ చేసింది. ఎనిమిదేళ్లుగా పైసా ఖర్చు లేకుండా మత్స్యకారులు చెరువుల్లో ఎదిగిన చేపలను విక్రయించుకోవడం జీవనోపాధిగా మార్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం అమలుపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో దీన్ని కొనసాగిస్తారా.. నిలిపివేస్తారా అనేది సందిగ్ధంగా మారింది. చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకోవడంతో జిల్లా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

సమయం మించుతున్నా ఖరారుకాని టెండర్లు

ఏటా చేప పిల్లలు పంపిణీ చేయడానికి ఏప్రిల్‌ నెలాఖరున టెండరు ప్రకటన విడుదల చేసి మే నెల రెండో వారంలో ఖరారు ప్రక్రియ పూర్తి చేసేవారు. జూన్‌లో 11 రోజులు గడిచినా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ ఖరారు చేయకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది చేప పిల్లలు పంపిణీ చేసిన గుత్తేదారులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆలస్యమైతే ఎదుగుదలపై ప్రభావం

కిలో సైజు చేప పెరగాలంటే.. కనీసం ఆర్నెళ్ల సమయం పడుతుంది. జులై, ఆగస్టు మాసంలో వదిలితే డిసెంబరు, జనవరి నుంచి చేపలు పట్టుకుని విక్రయించుకునే అవకాశం ఉంటుంది. చేప పిల్లలను ఆలస్యంగా వదిలితే ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. సెప్టెంబరులో వదిలితే అవి కిలో సైజుకు ఎదగడానికి ఫిబ్రవరి వస్తుంది. ఇంకా పెరగాలంటే ఏప్రిల్, మే వచ్చేస్తుంది. ఎండల కారణంగా నీరు తగ్గి చేపలు చనిపోయే అవకాశం ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. టెండర్ల నిర్వహణ ఆలస్యమైతే గుత్తేదార్లు చేప పిల్లలను నాసిరకంగా పంపిణీ చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చేప పిల్లల పంపిణీ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు.

రెండు రకాలుగా..

  • పూర్తినీటితో నిండిన చెరువుల్లో 45 రోజుల వయసుతో ఉండి 35-40 మి.మీ. పొడవుగా ఉన్న చేపలు పెంచుతారు. 
  • ఏడాది మొత్తం నీరుండే ప్రాజెక్టులు, పెద్ద చెరువుల్లో 75 రోజుల వయసు కలిగిన 80-100 మి.మీ. పొడవు చేపలు వదిలి పెంచుతారు.

నగదు బదిలీ పథకం అమలు చేయాలి: 

జింక సూరి, మత్స్యకార్మిక సంఘ నాయకుడు

ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఉంటుందా.. లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు. ఇప్పటికే చేప పిల్లల పంపిణీ టెండరు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. జులైలో చెరువుల్లో చేప పిల్లలను వదిలిపెడితే ఆర్నెళ్లలో కిలో సైజు చేపగా మారుతుంది. జూన్‌ మాసం 11 రోజులు గడిచినా చేప పిల్లల పంపిణీపై ఊసేలేదు. ఈ సంవత్సరం చేప పిల్లల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేప పిల్లలను మత్స్యకారులే కొనుగోలు చేసేందుకు వీలుగా నగదు బదిలీ పథకం అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. 

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు: 

మధుసూదన్, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్‌

ఉచిత చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. గతంలో తరహాలోనే చేప పిల్లల పంపిణీ కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం. నిబంధనలకు అనుగుణంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని