logo

జరిమానాల జోరు.. మారని తీరు

మంచిర్యాల జిల్లాలో రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ను (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం ఏటా కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి రైస్‌ మిల్లర్లకు అప్పగిస్తున్నారు.

Updated : 12 Jun 2024 05:36 IST

నాలుగేళ్లల్లో రూ.56.29 కోట్ల సీఎంఆర్‌ బకాయిలు

మందమర్రిలోని రైస్‌ మిల్లు

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే : మంచిర్యాల జిల్లాలో రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ను (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం ఏటా కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి రైస్‌ మిల్లర్లకు అప్పగిస్తున్నారు. వాటిని సకాలంలో ప్రభుత్వానికి తిరిగి అప్పగించకుండా ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. జిల్లా అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెచ్చినప్పుడల్లా సగం బియ్యం సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. నాలుగేళ్లలో బకాయిలు ఎంత ఉన్నాయో.. అదే స్థాయిలో అధికారులు జరిమానా విధించారు. అయినా మిల్లర్లలో మార్పు రావడం లేదు. 

జిల్లాలో 19 బాయిల్డ్, 32 రా-రైస్‌ మిల్లులు ఉన్నాయి. అయితే వీరు ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లో వచ్చే వడ్లను ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారే తప్ప సీఎంఆర్‌ అప్పగింతలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ బియ్యాన్ని అక్రమంగా ప్రైవేట్‌ వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముకుని వచ్చిన డబ్బులను బ్యాంకు రుణాలు, ఇంటి అవసరాలకు వాడుతున్నారు. ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన ఆ బియ్యం ప్రతి ఏటా సగం పెండింగ్‌ పెడుతున్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి భారీగా బకాయి ఉండటంతో జిల్లా పాలనాధికారి బదావత్‌ సంతోష్, అదనపు పాలనాధికారి మోతీలాల్‌ రైస్‌ మిల్లులు తనిఖీలు చేసి గడువులోపు అప్పగించాలని ఆదేశాలిచ్చినా రైస్‌మిల్లుల యజమానులు పట్టించుకోవడం లేదు.  

అధికారుల నిర్లక్ష్యంతో..

మంచిర్యాల జిల్లాలోని 41 రైస్‌ మిల్లుల యజమానులు 2019 నుంచి 2024 వరకు రూ.28.15 కోట్ల విలువైన 8,798 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు, ప్రభుత్వానికి బకాయి ఉన్నారు. వీరు గడువులోపు చెల్లించనందుకు అదనంగా అదేస్థాయిలో రూ.28.14 కోట్ల విలువైన 8,794 మెట్రిక్‌ టన్నుల బియ్యం అప్పగించాలని జరిమానా విధించారు. దీంతో రూ.56.29 కోట్ల విలువైన 17,593 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ప్రభుత్వానికి బకాయి ఉన్నారు. బకాయి సీఎంఆర్‌ వసూలులో పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ప్రభుత్వానికి ఏటా భారీ నష్టం వాటిల్లుతోంది.

సీఎంఆర్‌ అప్పగింతలో నిర్లక్ష్యం చేసినందుకు గత నెల 29న జైపూర్‌ మండలంలోని ఇందారంలో శివసాయి రైస్‌ మిల్లును పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్‌ చేశారు. 2022 నుంచి 2024 వరకు రూ.1.29 కోట్ల విలువైన సీఎంఆర్‌ బకాయిలు ఉన్నందున యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 

గడువులోపు అప్పగించకుంటే కఠిన చర్యలు 

మోతీలాల్, జిల్లా అదనపు పాలనాధికారి, మంచిర్యాల

జిల్లాలో సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉన్న రైస్‌ మిల్‌ యజమానులకు వెంటనే సరఫరా చేయాలని నోటీసులు ఇచ్చాం. రెండు, మూడ్రోజుల్లో మరో మూడు రైస్‌ మిల్లులను సీజ్‌ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గడువులోపు లక్ష్యం ప్రకారం అప్పగించకుంటే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని