logo

కార్మిక వారసులపై ‘కారుణ్యం’

వయసు పైబడటంతో ఉద్యోగాలు పొందలేని కార్మిక వారసులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకునే కార్మికుల వారసుల గరిష్ఠ వయసును 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 12 Jun 2024 05:34 IST

ఉద్యోగ అర్హత వయసు 40 ఏళ్లకు పెంపు 

శ్రీరాంపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : వయసు పైబడటంతో ఉద్యోగాలు పొందలేని కార్మిక వారసులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకునే కార్మికుల వారసుల గరిష్ఠ వయసును 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు కనిష్ఠంగా 18 నుంచి గరిష్ఠంగా 35 ఏళ్ల లోపు ఉన్న వారసులు కారుణ్య నియామకాలు పొందేందుకు అర్హులు. ఇకపై అర్హత వయసు 40 ఏళ్లకు పెంచడంతో కార్మికులు, వారి వారసులు, కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి హామీతో..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 441 మంది కార్మిక వారసులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఆ సమయంలో ఉద్యోగ అర్హత వయసుతో చాలా మంది వారసులు ఇబ్బంది పడుతున్న విషయం ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన వయో పరిమితిని 40 పెంచుతామని హామీ ఇచ్చారు. దీనిపై యాజమాన్యం స్పందించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సంస్థ డైరెక్టర్ల సమావేశంలో సానుకూల స్పందన రావడంతో అర్హత వయసు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో ఉత్తర్వులు విడుదల చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.

నిరీక్షణకు తెర..

సంస్థలో పని చేస్తూ ఉద్యోగి చనిపోతే, మెడికల్‌ బోర్డులో అనారోగ్య రీత్యా ఉద్యోగి ఉద్యోగానికి అనర్హత పొందితే అతని స్థానంలో వారసుడికి ఉద్యోగాన్ని కల్పిస్తారు. కరోనా సమయంలో, అసెంబ్లీ, సింగరేణి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయాల్లో మెడికల్‌ బోర్డు నిర్వహించలేదు. ఈ జాప్యంతో చాలామంది వారసుల గరిష్ఠ అర్హత వయసు 35 ఏళ్లు దాటింది. వారి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కార్మిక సంఘాలు అర్హత వయసు పెంచాలని యాజమాన్యాన్ని పలుమార్లు కోరాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికల సమయంలో సంఘాలు దీనిపై హామీలు ఇచ్చారు. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో సుమారు 300 మంది వారసులకు లబ్ధి చేకూరనుంది. 

2018 మార్చి 9 నుంచి అమలు

ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం ఈ పథకం 2018 మార్చి 9 నుంచి అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి 35 ఏళ్ల వయసు దాటి 40 ఏళ్ల లోపు ఉన్న వారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉద్యోగానికి బదులు ఏక మొత్తంలో డబ్బులు తీసుకున్న వారు, కుటుంబంలో వయసురీత్యా అర్హుడైన మరో వారసుడు ఉద్యోగం పొందితే ఈ పథకం వర్తించదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు పాత గరిష్ఠ వయోపరిమితి నిబంధన ప్రకారం ఉద్యోగం పొందలేని, ఎలాంటి సెటిల్‌మెంట్‌ జరగని కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు