logo

కుంగుతున్న పిల్లర్లు.. కూలుతున్న వంతెనలు..

ప్రాజెక్టులు, వంతెనల సమీపంలో అక్రమార్కులు జోరుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో పిల్లర్లు కూలిపోయి, వంతెనలు కుంగుతున్నాయి. అయినా అరికట్టాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడంతో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది.  

Published : 12 Jun 2024 04:19 IST

ఇసుక అక్రమ తవ్వకాల దుష్ఫలితం..

ఇసుక తవ్వకాలతో దెబ్బతిన్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు ఆఫ్రాన్‌ 

కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రాజెక్టులు, వంతెనల సమీపంలో అక్రమార్కులు జోరుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో పిల్లర్లు కూలిపోయి, వంతెనలు కుంగుతున్నాయి. అయినా అరికట్టాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడంతో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది.  సంబంధిత అధికారులు కొన్ని సార్లు ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేసినప్పటికీ ప్రాజెక్టులు, వంతెనల వద్ద ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. 

 జిల్లాలోని పెద్దవాగు వంతెన, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు వద్ద ఇసుక తవ్వకాలు చేపట్టడంతో అందవెల్లి సమీపంలోని పెద్దవాగు వంతెన కుంగిపోయి మూడు పిల్లర్లు నేలమట్టంకాగా జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు ఆఫ్రాన్‌ దెబ్బతింది. వంజీరి సమీపంలోని పెద్దవాగు వంతెన వద్ద విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణ పనులు ప్రారంభమైన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నేటి వరకు పూర్తి కాలేదు. రూ.244.66 కోట్ల అంచనా వ్యయంతో 15 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే ఆశయంతో చేపట్టిన ప్రాజెక్టు 19 ఏళ్లు గడిచినా నిర్మాణ దశ వీడలేదు. ఈ పనులను చేపట్టిన ఓ కంపెనీకి సకాలంలో బిల్లులు రానందున 2020 సంవత్సరంలో ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు స్థలంలో ఎలాంటి కాపలా లేకుండా పోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని స్థానిక ఇసుక అక్రమార్కులు ప్రాజెక్టు నిర్మిత స్థలంలో నిత్యం పదుల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ పాటికే ఇసుక తవ్వకాలతో ప్రాజెక్టు ఆఫ్రాన్‌ ధ్వంసమైంది. ఇలాగే కొనసాగితే బ్యారేజీ పిల్లర్లు కూడా నేలమట్టమయ్యే ప్రమాదం పొంచి ఉంది. 

ఆఫ్రాన్‌ వద్దే ఇసుకను ట్రాక్టర్లలో నింపుతున్న కూలీలు 

అందవెల్లి వంతెన సైతం..

అందవెల్లి సమీపంలోని పెద్దవాగు వంతెన 2022లో నేలమట్టం కావడానికి ప్రధానంగా పిల్లర్ల సమీపంలో ఇసుక తవ్వకాలే కారణమని ఇంజినీరింగ్‌ నిపుణులు నిర్ధారించారు. ఫలితంగా మూడు మండలాల్లోని 54 గ్రామాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా తాత్కాలిక వంతెన చేపట్టడంతో ప్రస్తుతం రాకపోకలు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో వంతెన మరమ్మతులు పూర్తి కానున్నాయి. 

  • ఓ వైపు ఇసుక తవ్వకాలతో వంతెనలకు ప్రమాదం వాటిల్లుతుండగా వంజీరి సమీపంలోని పెద్దవాగు వంతెన వద్ద ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. వంజీరి నుంచి ట్రాక్టర్లలో ఇసుక కాగజ్‌నగర్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ ముందు నుంచే కాగజ్‌నగర్‌కు రవాణా చేస్తున్నా.. పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. తాము ఒక్కో ట్రాక్టర్‌కు పోలీసులకు నెలకు రూ.2 వేల చొప్పున డబ్బులు ఇస్తున్నామని ఓ ఇసుక అక్రమ రవాణాదారుడు పేర్కొనడం గమనార్హం. 
  • ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్‌ కిరణ్‌ కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా సిబ్బంది కొరత కారణంగా అరికట్టలేకపోతున్నామని తెలిపారు. 

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం 

తిరుపతి, నీటిపారుదలశాఖ డీఈఈ

జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు వద్ద తవ్వకాలు చేపట్టడంతో ఆఫ్రాన్‌ దెబ్బతింది. ఎవరైనా ప్రాజెక్టు సమీపంలో ఇసుక తవ్వకాలు చేపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఈ విషయంలో రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు