logo

ఏటా తనిఖీలు.. ఆగని అవకతవకలు

పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం సంబంధిత అధికారుల పర్యవేక్షణలేమితో గాడితప్పుతోంది. ఏటా సామాజిక తనిఖీలు జరుగుతున్నా.. పనుల్లో జరిగిన అవకతవకలు గుర్తిస్తున్నా.. మార్పు కనిపించడం లేదు. ఎక్కువగా ఒప్పంద ఉద్యోగులే ఉండటంతో స్వాహాపర్వం ఏటికేడు పెరుగుతోంది.

Updated : 12 Jun 2024 05:32 IST

44 మంది ఉపాధి సిబ్బందికి నోటీసులు

ఈనాడు, ఆసిఫాబాద్‌ : పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం సంబంధిత అధికారుల పర్యవేక్షణలేమితో గాడితప్పుతోంది. ఏటా సామాజిక తనిఖీలు జరుగుతున్నా.. పనుల్లో జరిగిన అవకతవకలు గుర్తిస్తున్నా.. మార్పు కనిపించడం లేదు. ఎక్కువగా ఒప్పంద ఉద్యోగులే ఉండటంతో స్వాహాపర్వం ఏటికేడు పెరుగుతోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు నాలుగు మండలాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. ఇందులో 44 మంది ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు అందచేయగా ఇద్దరు ఫీల్డ్, మరో ఇద్దరు టెక్నికల్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేయనున్నారు. నలుగురు ఉద్యోగుల విధుల నుంచి తప్పించేందుకు పాలనాధికారి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 

జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 15 మండలాల్లో 70 సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో రూ.88.27 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించగా ఇప్పటి వరకు రూ.87.32 లక్షలు రికవరీ చేశారు. ఈ సంవత్సరం చింతలమానేపల్లి, కౌటాల, పెంచికల్‌పేట్, కెరమెరి మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. ఇందులో కెరమెరి మండలంలో 26 మంది సిబ్బంది (సాంకేతిక నిపుణులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, పంచాయతీ కార్యదర్శులు) షోకాజ్‌ నోటీసులు అందించారు. ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేయాలని తనిఖీ అధికారులు కలెక్టర్‌కు సిఫారసు చేశారు. ఈ మండలంలో రూ.3.86 లక్షల వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి. పెంచికల్‌పేట్, కౌటాల, చింతలమానేపల్లి మూడు మండలాల్లో రూ.1,40,400 దుర్వినియోగంకాగా రూ.79,400 జరిమానా విధించారు. 19 మంది సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

కొండను తవ్వి...

జిల్లా ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు అన్ని మండలాల్లో 70 సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఒక్కో తనిఖీకి సుమారు రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే వీటికే ఇప్పటి వరకు రూ.1.05 కోట్లు వెచ్చించారు. గుర్తించిన అవకతవకలు రూ.88 లక్షలు దాటలేదు. ఈ నేపథ్యంలో ఇవి జరిగే తీరుపై సైతం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిధులు పక్కదారి పట్టించిన వ్యక్తులపై సైతం కఠినమైన చర్యలు ఉండడం లేదు. సస్పెండ్‌ చేసినా.. మళ్లీ కొద్ది రోజులకు పోస్టింగ్‌ దక్కించుకుని అవే అక్రమాలను పునరావృతం అయ్యేలా చూస్తున్నారు. ఇకనైనా అధికారులు ఉపాధిహామీ పనులపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. 

అక్రమాలు ఇలా..

చేసిన పనులకు బదులు ఎక్కువగా కొలతలు రికార్డు చేయడం, బినామీ వ్యక్తులకు మస్టర్లు వేయడం, పనులు చేసిన వారికి వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. పనిచేయని వారికి వేతనాల చెల్లింపులు, కూలీలు చేసే చోట, యంత్రాలతో పనులను చేయిస్తున్నట్లు సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి. జాబ్‌కార్డు ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా పని కల్పించాలనే నిబంధన ఉన్నా పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలకు పనులు కల్పించడం లేదు. వీరందరూ స్థానిక ఉపాధిహామీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కెరమెరి మండలంలోని మురికిలంక గ్రామస్థులు పలుమార్లు పని కల్పించాలని అక్కడి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. లింగాపూర్‌ మండల ఏపీఓ నెల రోజుల క్రితం విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో సస్పెండ్‌ అయ్యారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని