logo

కల నెరవేరిన వేళ

ఏ తండ్రైనా తన పిల్లలు ఉన్నత చదువులు చదివి, జీవితంలో స్థిరపడితే చూడాలని కోరుకుంటారు. కానీ ఆ తండ్రి ఆశయాన్ని గుర్తించి ఆయన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించే పిల్లలు కొందరే ఉంటారు.

Published : 12 Jun 2024 02:48 IST

తండ్రి లక్ష్యాన్ని సాధించిన ముగ్గురు సంతానం

నీట్‌లో ర్యాంకు సాధించిన కుమారుడు  సాయిఆకాశ్‌కు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు గోలి గంగామణి-సాయన్న

లోకేశ్వరం, న్యూస్‌టుడే: ఏ తండ్రైనా తన పిల్లలు ఉన్నత చదువులు చదివి, జీవితంలో స్థిరపడితే చూడాలని కోరుకుంటారు. కానీ ఆ తండ్రి ఆశయాన్ని గుర్తించి ఆయన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించే పిల్లలు కొందరే ఉంటారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం వెల్మల్‌ గ్రామానికి చెందిన గోలి గంగామణి-సాయన్నల సంతానం ఆ కోవలోకి వస్తారు. తన పిల్లలు ముగ్గురు వైద్య వృత్తి ఎంచుకోవాలి.. ఆ దిశలో వారు మంచి మార్కులు సాధించి సీటు దక్కించుకోవాలి.. వైద్య వృత్తిలో స్థిరపడి సేవలందించాలని తపన పడిన ఆ తండ్రి కలను నెరవేర్చే అడుగులలో సఫలీకృతులయ్యారు ఆ ముగ్గురు పిల్లలు. తండ్రి ఆశయం.. పిల్లల కష్టానికి దక్కిన ఫలితంపై కథనం.

తల్లిదండ్రుల అనారోగ్యమే ఆలోచనకు బీజమైంది

సోన్‌ మండలం వెల్మల్‌ గ్రామానికి చెందిన గోలి నర్సవ్వ-గంగన్నలది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు సాయన్న వ్యవసాయంలో తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూశారు. అందుకే ఉన్నత చదువు(ఎంఏ-టీపీటీ) చదివి ఉపాధ్యాయ వృత్తికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సాయన్న లోకేశ్వరం మండలం రాయపూర్‌కాండ్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేస్తున్నారు. సాయన్న భార్య గంగామణి సైతం మామడలోని విద్యావనరుల కేంద్రంలో సీఆర్పీగా పని చేస్తున్నారు. 2006లో సాయన్న తల్లి నర్సవ్వ క్యాన్సర్‌ బారిన, తండ్రి గంగన్న పక్షవాతం బారిన పడడంతో ఇద్దరినీ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో 40 రోజుల పాటు అక్కడే ఉన్న సాయన్న రోగులకు వైద్యులు అందించే సేవలను కళ్లారా చూశారు. నిరుపేదలు వ్యాధుల బారిన పడ్డ సమయంలో వారికి సేవలు అందించాలంటే వైద్య వృత్తి ఒక్కటే ఉత్తమ మార్గమని ఆలోచించారు. అదే ఆలోచనను తన ముగ్గురు పిల్లల (సాయి వెన్నెల, అక్షరసాయి, సాయిఆకాశ్‌)కు గుర్తు చేసేవారు. ఆ ప్రయత్నంలో ముగ్గురినీ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోనే ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు చదివించారు. తండ్రి ఆశయాన్ని గుర్తించిన పిల్లలు ముగ్గురు ఆయన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. పెద్ద కూతురు సాయి వెన్నెల 2020లో నీట్‌లో మంచి మార్కులు సాధించి నిజామాబాద్‌లోని దంత వైద్య కళాశాలలో సీటు దక్కించుకుని ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్నారు. రెండో కూతురు అక్షర సాయి గతేడాది నీట్‌లో 442 మార్కులు సాధించి జగిత్యాల వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కుమారుడు సాయి ఆకాశ్‌ ఇటీవల ప్రకటించిన నీట్‌ ఫలితాలలో 500 మార్కులు సాధించి తల్లిదండ్రుల ఆశయానికి ఫలితం కనబరిచారు. తన ముగ్గురు సంతానం ఆశయ సాధనలో భాగంగా కష్టపడి చదివినందుకు సంతోషంగా ఉందని, వారు వైద్య వృత్తిలో స్థిరపడి నిరుపేదలకు సేవలందిస్తే అంతకన్నా సంతోషం ఏముంటుందని సాయన్న పేర్కొంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని