logo

బడి.. సన్నద్ధతతో ముడిపడి

వేసవి సెలవులు ముగిశాయి. ఇక బడి గంట మోగనుంది. పుస్తకాలు, చదువులతో కుసీˆ్త పట్టిన పిల్లలంతా సెలవులు రాగానే అమ్మమ్మ, తాతయ్య, బంధువులతో కలిసి ఇప్పటివరకు కాలక్షేపం చేశారు. బడి తలుపులు తెరవడంతో ఇక బడిబాట పట్టనున్నారు.

Published : 12 Jun 2024 02:50 IST

న్యూస్‌టుడే, దండేపల్లి: వేసవి సెలవులు ముగిశాయి. ఇక బడి గంట మోగనుంది. పుస్తకాలు, చదువులతో కుసీˆ్త పట్టిన పిల్లలంతా సెలవులు రాగానే అమ్మమ్మ, తాతయ్య, బంధువులతో కలిసి ఇప్పటివరకు కాలక్షేపం చేశారు. బడి తలుపులు తెరవడంతో ఇక బడిబాట పట్టనున్నారు. సుమారుగా నెలన్నర రోజులు స్నేహితులు, బంధువులు, చరవాణులు, ఆటపాటలతో హాయిగా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా గడిపిన పిల్లలు ఇప్పుడన్నీ వదిలి ఒక్కసారిగా బడికి వెళ్లాలంటే కొంత ఇబ్బందే. ప్రాథమిక స్థాయి పిల్లలైతే ఎంతో బద్ధకంగా ఉంటుంది. ఈ తరుణంలో వీరిని తిరిగి బడికి సన్నద్ధం చేస్తూ.. గాడిన పెట్టాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. కానీ కొంత ఓర్పు, శ్రద్ధతో వారిలో మెల్లమెల్లగా మార్పు తీసుకొస్తూ సన్నద్ధం చేస్తేనే చదువుకునే అవకాశముంది. 

చతుర్విధ ప్రక్రియలు నేర్పుతూ.. 

పాఠశాలకు అలవాటు అయ్యే వరకు ఉపాధ్యాయులు పిల్లలతో ఆటపాటలతో గడపాలి. పాటలు పాడించడం, పదాలతో ఆటలు, పద్యాలు, గణితంలో సరదాగా చతుర్విధ ప్రక్రియలు నేర్పుతూ వారికి ఇష్టం పెరిగేలా చూడాలి. ఇతర విద్యార్థులతో పోల్చకుండా చిన్న జవాబు చెప్పినా మెచ్చుకోవాలి. వీరిలో ఉన్న ప్రతిభను గుర్తించి అందుకు సంబంధించిన విషయాలు చెబితే ఉత్సాహంగా ఉంటారు. కొద్ది రోజుల పాటు హోం వర్కు లేకుండా చూడాలి. ప్రారంభం నుంచే హోంవర్కు ఇస్తే భారంగా అనిపిస్తుంది. 

తల్లిదండ్రులే కీలకం

వేసవి సెలవులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సమయపాలన లేకుండా పిల్లలు బంధువులతో కలిసి తిరగడం లేదా ఫోన్లు, ఆటపాటలకే అంకితమయ్యారు. బడి ఉన్న సమయంలో ఉదయం నిద్రలేచి త్వరగా తయారయ్యేవారు. కానీ సెలవుల్లో అలా కాదు.. ఎప్పుడో రాత్రికి కాని నిద్రించకపోవడం.. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం.. సమయానికి భోజనం చేయకపోవడం ఉండేది.. కానీ తిరిగి బడి సమయానికి అనుకూలంగా అలవాట్లు మార్చుకోవాలంటే తల్లిదండ్రులే కొంతశ్రద్ధ తీసుకోవాలి. వేకువజామునే నిద్ర లేపాలి. వెంటనే త్వరగా లేపకుండా మెల్లమెల్లగా వీరిలో మార్పు తేవాలి. పిల్లలకు కొత్త పుస్తకాలు, కొత్త సంచులు, బూట్లు  ఇతర సామగ్రి కోసం పిల్లలతో కలిసి షాపింగ్‌ చేస్తే ఉత్సాహంతో బడికి పోవడానికి ఇష్టపడతారు. బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత హోంవర్కు కొద్ది రోజుల పాటు తల్లిదండ్రులే దగ్గరుండి సాయం చేస్తే ఆతర్వాత వారే చేసుకుంటారు. 

ఇంటిలో నేర్చుకునేలా..

ఇప్పుడే కొత్తగా బడికి వెళ్లే పిల్లలది మరో సమస్య. మూడేళ్లు నిండితే చాలు పాఠశాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు అమ్మానాన్న, కుటుంబ సభ్యులతో గడిపిన పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే మారాం చేస్తారు. పిల్లలకు ఇష్టం కలిగేలా చూడాలి. అందమైన బొమ్మలతో కూడిన సంచులు, ఆట వస్తువులు ఉండాలి. ఇంటి వద్దనే అక్షరాలు, చిన్న చిన్న పదాలు నేర్పిస్తే హుషారుగా ఉంటారు. వీటితో పాటు రైమ్స్, కథలు, బొమ్మలు చూపిస్తూ పదాలు చెప్పించాలి. ఒకటో తరగతి, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు ఉపయోగకరంగా ఉండే చార్టులు పిల్లల ఎత్తుకు సరిపడేలా ఇంటిలో గోడలకు అంటించాలి. తెలుగు, గణితం, ఆంగ్లం, హిందీకి సంబంధించినవి ఎన్నో బయట లభిస్తున్నాయి. వీటిని చూసి కొంత నేర్చుకుంటే బడిలో ఉత్సాహంగా ఉంటారు. 

ఉత్సాహం నింపాలి 

యాభై రోజుల వరకు పుస్తకాలు, చదువు ఏవీ లేకుండా పిల్లలు హాయిగా గడిపారు. ఒక్కసారిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే చోట.. ఒకే గదిలో కూర్చొని పాఠాలు వినాలంటే ఇబ్బందే. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపాలి. తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు తగిన స్వేచ్ఛ కల్పిస్తూ ఆటపాటలతో సరదాగా బోధించాలి.

- డా.ఏ.విశ్వేశ్వరరావు, మానసిక వైద్య నిపుణులు,మంచిర్యాల 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని