logo

రాయితీల్లో కోత.. కేంద్రాల మూత

రైతులకు సేవలు అందించడంతోపాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు గత ప్రభుత్వం  ఆగ్రోస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతోపాటు ఆధునిక యంత్రాలను రైతులకు అందిస్తున్నారు.

Published : 12 Jun 2024 02:58 IST

ఆగ్రోస్‌ దుస్థితి

ఆగ్రోస్‌ కేంద్రాలకు సరఫరా అయిన ఎరువు

న్యూస్‌టుడే, రాంనగర్‌ : రైతులకు సేవలు అందించడంతోపాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు గత ప్రభుత్వం  ఆగ్రోస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతోపాటు ఆధునిక యంత్రాలను రైతులకు అందిస్తున్నారు. ప్రారంభంలో ఆయా కేంద్రాలకు వచ్చిన కోటాలో 20శాతం ఆగ్రోస్‌కు, 40శాతం మార్క్‌ఫెడ్, మిగిలిన 40శాతం ప్రైవేట్‌ వ్యాపారులతో విక్రయించేలా చర్యలు తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత రాయితీల్లో కోత పెట్టడంతోపాటు ఎరువుల కోటాను సైతం ఎత్తేయడంతో ప్రైవేట్‌ వ్యాపారుల మాదిరిగానే ఆగ్రోస్‌ నిర్వాహకులు విక్రయించాల్సి రావడంతో చాలామంది యువకులు కేంద్రాలను మూసేయడానికి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో 160 ఆగ్రోస్‌ కేంద్రాలు ఏర్పాటు కాగా ప్రస్తుతం 83 మాత్రమే పని చేస్తున్నాయి. గతంలో ఒక్కో మండలానికి మూడు చొప్పున కేంద్రాలను ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. జనరల్‌ అభ్యర్థులు రూ.3 లక్షలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.1.50 లక్షలు డిపాజిట్‌ చేయాలని షరతు విధించింది. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. మండల కేంద్రాలతోపాటు ఎక్కవ జనాభా ఉన్న ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం నెలవారీ కోటాలో 20 శాతం కేంద్రాలకు కేటాయించడంతోపాటు రవాణా ఛార్జీలు లేకుండా నేరుగా సరఫరా చేసేది. దీనివల్ల ఎమ్మార్పీ ధరతోనే రైతులకు ఎరువులు అందేవి. పురుగుమందులు, ఇతర వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచి ప్రభుత్వానికి, రైతులకు వారధిలాగా పనిచేశాయి. గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రాలకు కోటా నిలిపేయడంతో మూసుకునే పరిస్థితి నెలకొంది. ఎరువుల కేటాయింపులో 20శాతం సరఫరాను తొలగించడంతో మార్క్‌ఫెడ్‌ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రవాణా ఛార్జీలు ఆగ్రోస్‌ కేంద్రాలే భరించాల్సి రావడంతో ఈ భారం రైతులపైనే వేయాల్సి వస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కేంద్రాల నిర్వహణలో నష్టం వస్తుండటంతో మూసేయడానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. చెల్లించిన డిపాజిట్‌ను వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రోత్సహిస్తే మేలు

రైతులకు సేవలందించే ఆగ్రోస్‌ కేంద్రాలను ప్రోత్సహిస్తే.. అన్నదాతలకు మేలు జరగడంతో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కేంద్రాలకు రవాణా ఛార్జీలు భరించి ఎరువులు సరఫరా చేయాలని కోరుతున్నారు. వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక పరికరాలను, విత్తనాలు, పురుగు మందులు సైతం ఆగ్రోస్‌ కేంద్రాల ద్వారా రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాల నిర్వాహకులు కోరుతున్నారు.

ఈ విషయమై ఆగ్రోస్‌ రీజినల్‌ మేనేజర్‌ ప్రసాద్‌ను వివరణ కోరగా, జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కేంద్రాల మూసివేసేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారని అన్నారు. వీటి నిర్వహణ తదితర వాటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని