logo

అంతర్రాష్ట్ర మృత్యుదారి

అంతర్రాష్ట్ర రహదారికి ఇరువైపులా విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఉండటంతో తాగిన మైకంలో వాహనదారులు అతివేగంగా, ఇష్టారీతిన వాహనాలను నడుపుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోక ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోవడం సర్వసాధారణమైంది.

Published : 12 Jun 2024 03:01 IST

ఏడాదిలో 20 మందికిపైగా దుర్మరణం
యథేచ్ఛగా మద్యం గొలుసు దుకాణాలు

తాంసి మండలం హస్నాపూర్‌ సమీపంలో తీవ్రంగా గాయపడిన మహారాష్ట్ర వాహనదారులు  

న్యూస్‌టుడే, తాంసి: అంతర్రాష్ట్ర రహదారికి ఇరువైపులా విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఉండటంతో తాగిన మైకంలో వాహనదారులు అతివేగంగా, ఇష్టారీతిన వాహనాలను నడుపుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోక ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోవడం సర్వసాధారణమైంది. ఆదిలాబాద్‌ నుంచి తాంసి, తలమడుగు మండలాల మీదుగా మహారాష్ట్రలోని మాండ్వి, కిన్వట్, మహోర్‌ వైపు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దారి పొడవునా అనుమతి లేని మద్యం, కల్తీ తెల్లకల్లు దుకాణాలే కనిపిస్తుండటం ఇందుకు ఒక కారణంగా తెలుస్తోంది.

ఆదిలాబాద్‌నుంచి మహారాష్ట్ర సరిహద్దున ఉన్న లక్ష్మీపూర్‌ వరకు ఉన్న 22కిలోమీటర్ల అంతర్రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాద్‌ మండలం రాంపూర్, తాంసి మండలం పొన్నారి, హస్నాపూర్, తలమడుగు మండలం ఖోడద్, ఉమ్‌డం, సుంకిడి గ్రామాల సమీపాల్లో పాన్‌ టేలాలు, హోటళ్లు, కిరాణా దుకాణాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు విచ్చలవిడిగా అక్రమ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. కల్తీ తెల్లకల్లు అమ్మకాలు సైతం రోడ్డుపైనే కొనసాగుతుండటంతో యువకులు, మద్యంప్రియులు తాగిన మైకంలో ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలా ఏడాది కాలంలో 20 మందికిపైగా మృతి చెందారు. 

ప్రాణాలు తీస్తున్న అతివేగం 

అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపుతుండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల్లో గాయాలతో బయటపడిన వారు చాలా మందే ఉన్నారు. సంబంధిత అధికారులు వేగ నియంత్రణకు వాహనాల తనిఖీతోపాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు, వేగ నిరోధకాలు ఏర్పాటు చేయకపోవడం, మద్యం అమ్మకాలను నియంత్రించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. 

  • ఇటీవల తాంసి మండలం పొన్నారికి చెందిన రెవెన్యూ ఉద్యోగి మలపతి స్వామి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. 
  • పది రోజుల కిందట మహారాష్ట్రలోని పిప్పల్‌గావ్‌ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న బెండరి గోపాల్, అంకుష్, ఈశ్వర్‌ను సుంకిడి సమీపంలో ఓ వాహనం ఢీకొనడంతో గోపాల్‌ మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 
  • ఆరు నెలల వ్యవధిలో అట్నాంగూడకు చెందిన యువకుడు యశ్వంత్, తలమడుగు మండలం మాందగూడకు చెందిన మరో యువకుడు విజయ్‌ సుంకిడి సమీపంలో ఎదురుగా వచ్చిన ఎడ్లబండిని ఢీకొని మృతి చెందారు. 
  • హస్నాపూర్‌కు చెందిన ఉపాధి హామీ సిబ్బంది మహేశ్‌ ఉమ్‌డం సమీపంలో మద్యం మత్తులో వాహనాన్ని ఢీకొని తలకు తీవ్రగాయాలై మృతి చెందారు.
  • వామన్‌నగర్‌కు చెందిన యువకుడు లక్ష్మణ్, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు నారాయణ, సృజిత్‌రాం, మనీషా, సంస్కార్‌ హస్నాపూర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 

రోజూ తనిఖీ చేస్తున్నాం

శివరాం, తాంసి ఎస్‌ఐ 

అంతర్రాష్ట్ర రహదారిపై తాంసి, తలమడుగు మండలాలతోపాటు మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు కూడా చేస్తున్నాం. త్వరలో వేగ నిరోధకాల ఏర్పాటుకు చర్యలు తీసుకుని ప్రమాదాలను నియంత్రిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు