logo

బడి గంట.. మోగేనంట..

సర్కారు బడులు ఈసారి విద్యార్థులకు సౌకర్యాలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

Published : 12 Jun 2024 03:04 IST

నేటి నుంచి ప్రారంభం 

న్యూస్‌టుడే, పాలనాప్రాంగణం: సర్కారు బడులు ఈసారి విద్యార్థులకు సౌకర్యాలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బడిబాట పేరిట వివిధ కార్యక్రమాలు చేస్తున్న విద్యాశాఖ తరగతుల ప్రారంభం ఓ వేడుకగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాప్రతినిధులతోపాటు అధికారగణం ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

వేధిస్తున్న బోధకుల కొరత

సౌకర్యాలు, పుస్తకాలు వంటివి విద్యార్థుల దరి చేరినా అసలైన బోధకుల కొరత వేధించనుంది. జిల్లాలో మొత్తం 3,028 పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 2,467 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 516 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే మరో 500 మందిపైనే బోధకుల అవసరమున్నది. పదోన్నతుల ప్రక్రియ సజావుగా సాగితే పదోతరగతి విద్యార్థులకు ఈసారి బోధకుల కొరత ఉండకపోవచ్చు. 

ఆ బడులకు ముహూర్తం బాగోలేదట

ప్రైవేటు బడులను బుధవారం పునఃప్రారంభించడం లేదు. ఇందుకు ముహూర్తం బాగో లేదనే వాదన యాజమాన్యాల నుంచి వినిపిస్తోంది. ప్రవేశాల ప్రక్రియను నెలరోజులు ముందుగానే కొనసాగిస్తున్న యాజమాన్యాలు ప్రారంభానికి తమకు అనుకూల రోజుల కోసం వేచిచూడటం చర్చనీయాంశంగా మారింది.

ప్రజాప్రతినిధులకు ఆహ్వానం 

పండగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలల ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆయా కార్యక్రమాలకు అతిథులుగా ప్రజాప్రతినిధులను, జిల్లా ఉన్నతాధికారులకు ఆహ్వానం పలికారు. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ, హమీద్‌పుర, ఆర్పీఎల్, దుర్గానగర్‌ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని మంగళవారం ఎంపీ గోడం నగేష్‌ను ఇంటికెళ్లి డీఈవో ప్రణీత ఆహ్వానించారు.

ముందస్తుగానే ఏకరూపం

గతం కంటే భిన్నంగా ఈసారి పాఠశాలల్లో ఉచితంగా అందించే ఏకరూప దుస్తులు ముందుస్తుగానే విద్యార్థులకు అందజేస్తున్నారు.  పాలనాధికారి రాజర్షిషా ఇచ్చోడ మండలం జామిడి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు వాటిని అందజేశారు.  

మొత్తం విద్యార్థులు : 67,418
ఏకరూప దుస్తులు కుట్టినవి : 63,920

చేరుతున్న పుస్తకాలు 

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తున్న అధికారులు 6నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు రాత పుస్తకాలనూ ఇస్తున్నారు. ఇప్పటివరకు 85 శాతం మేర పాఠ్య పుస్తకాలు, 80 శాతం నోటు పుస్తకాల పంపిణీ పూర్తయినట్లు పుస్తక పంపిణీ విభాగ మేనేజరు నూటెంకి సత్యనారాయణ తెలిపారు.

మొత్తం పాఠ్యపుస్తకాలు : 4,57,717
పంపిణీ చేసినవి : 3,30,278

నోటుపుస్తకాలు : 3,20,288  
పంపిణీ చేసినవి : 2,32,328

సమకూరుతున్న వసతులు  

గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం కింద కొన్ని పాఠశాలలకే పరిమితం చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పాఠశాలలో తాగునీరు, విద్యుత్తు, ఫ్యాన్లు, ఫర్నిచర్, మరుగుదొడ్డి వంటి సౌకర్యాలతోపాటు మరమ్మతు పనులు చేయిస్తోంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు చేసి అన్ని బాధ్యతలు స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో పనులను తుదిదశకు చేరాయి. పెయింటింగ్, ఫర్నిచర్‌ మినహా మరమ్మతు పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

ఎంపిక చేసిన పాఠశాలలు : 664
పనులు పూర్తయిన బడులు : 437
వెచ్చించిన నిధులు : రూ. 20 కోట్లు

అంతా సిద్ధం చేశాం 

టి.ప్రణీత, డీఈవో

ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేశాం. పుస్తకాలు, దుస్తులు ఇప్పటికే ఇచ్చాం. మిగిలిన వాటిని తొలిరోజునే అందజేస్తాం. ఈ నెల 20లోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయిస్తాం. ఈ నెల 20వ తేదీకల్లా పదోన్నతి, బదిలీల ప్రక్రియ పూర్తవుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బోధకుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు