logo

ఉపాధ్యాయుడి దారుణ హత్య

పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది హత్య చేసిన ఘటన గాదిగూడ మండలంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని ఉట్నూరు డీఎస్పీ నాగేందర్, సీఐ రహీంపాషాలు పరిశీలించి వివరాలు వెల్లడించారు.

Updated : 13 Jun 2024 04:09 IST

గాదిగూడ మండలంలో ఘటన

మృతదేహం వద్ద డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు, చిత్రంలో ఉట్నూరు డీఎస్పీ నాగేందర్, నార్నూర్‌ సీఐ రహీం పాషా (అంతర చిత్రంలో) జాదవ్‌ గజానంద్‌

నార్నూర్‌(గాదిగూడ), జైనథ్, న్యూస్‌టుడే : పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది హత్య చేసిన ఘటన గాదిగూడ మండలంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని ఉట్నూరు డీఎస్పీ నాగేందర్, సీఐ రహీంపాషాలు పరిశీలించి వివరాలు వెల్లడించారు. నార్నూర్‌ మండలం నాగల్‌కొండకు చెందిన జాదవ్‌ గజానంద్‌(40) జైనథ్‌ మండలం కెనాల్‌ మేడిగూడ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. ఆదిలాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడి నుంచి జైనథ్‌ మండలంలోని పాఠశాలకు వెళ్తుండేవారు. వేసవి సెలవులు కావడంతో 40 రోజుల కిందట స్వగ్రామం నాగల్‌కొండకు కుటుంబంతో సహా వచ్చారు. బుధవారం పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉదయం 7.30 ద్విచక్ర వాహనంపై పాఠశాలకు గాదిగూడ మండలం లోకారి గుండా వెళ్తున్నారు. అర్జునీ గ్రామ సమీపంలో సిడాం రాజుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ప్రధాన రహదారి నుంచి 150 మీటర్ల దూరంలో గుర్తుతెలియని వ్యక్తులు లాకెళ్లి బండరాళ్లతో కొట్టి చంపారు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం డాగ్‌స్క్వాడ్, వేలిముద్ర శాఖ సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీ, సీఐలు మృతుడి తండ్రి జాదవ్‌ బిక్కుతో మాట్లాడారు.  గజానంద్‌ పాఠశాలకు చేరుకున్నాడో లేదోనని కోడలు విజయలక్ష్మి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని భయపడిన ఆమె  అనికేత్‌(గజానంద్‌ అన్న కుమారుడి)తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. మార్గమధ్యలో గజానంద్‌ వాహనం కనిపించింది. సమీపంలో అతడి మృతదేహం కనిపించిందని బిక్కు పోలీసులకు వివరించారు. డీఎస్పీ, సీఐలు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దుండగులను పట్టుకుంటామని వారు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని