logo

ఆటలు పాటలు చదువులు!

‘బాల్యం అమూల్యం’ అన్న పెద్దల మాటలను గుర్తించిన ఐటీడీఏ అధికారులు చిన్న పిల్లల విలువైన బాల్యాన్ని సరైన మార్గంలో పెట్టడంపై దృష్టి సారించారు. ప్రత్యేకంగా వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసి పిల్లలు బడికి కష్టంగా కాకుండా ఇష్టంగా వెళ్లేలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

Updated : 13 Jun 2024 04:10 IST

గిరిజన చిన్నారుల్లో ఆనందోత్సాహం
అలరిస్తున్న ‘పిల్లల సందడి’
న్యూస్‌టుడే, ఉట్నూరు

కాగితపు బొమ్మలు తయారు చేస్తున్న చిన్నారులు

‘బాల్యం అమూల్యం’ అన్న పెద్దల మాటలను గుర్తించిన ఐటీడీఏ అధికారులు చిన్న పిల్లల విలువైన బాల్యాన్ని సరైన మార్గంలో పెట్టడంపై దృష్టి సారించారు. ప్రత్యేకంగా వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసి పిల్లలు బడికి కష్టంగా కాకుండా ఇష్టంగా వెళ్లేలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చదువుతోపాటు చిత్రలేఖనం, నృత్యం, పాటలు పాడటం వంటి వివిధ కళల్లో ఆసక్తిని పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్న ఈ శిబిరంపై ప్రత్యేక కథనం.

ఏజెన్సీలోని గిరిజన బాలబాలికలు వేసవిలో మండుటెండల్లో తిరుగుతున్నారు. పాఠశాలలకు సెలవులు ఉండటంతో ఇళ్ల వద్ద ఉండకుండా బయటకు వెళ్లడం, ప్రమాదాల బారినపడటం, చదువులపై ఆసక్తి చూపకపోవడం వంటి అలవాట్ల బారినపడుతున్నారని తెలుసుకున్న సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పీవో ఖుష్బూ గుప్తా పిల్లల కోసం వేసవి సెలవుల్లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ‘భారత్‌ దేఖో’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గత నెల 27న ‘పిల్లల సందడి’ పేరుతో ఉట్నూరులోని వికాసం పాఠశాలలో 108 మంది బాలబాలికలతో వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏసీఎంవో జగన్, హెచ్‌ఎం వికాస్, పీఎమ్మార్సీ రిసోర్స్‌పర్సన్ల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

చిన్నారులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా

పిల్లల్లో అమితాసక్తి..

స్వచ్ఛంద సంస్థ నియమించిన వాలంటీర్లు ప్రతి రోజు ఉదయం చిన్నారులతో యోగాను చేయిస్తున్నారు. ఆ తరువాత పరుగు పందెం పోటీలు, ఆటలు ఆడిస్తున్నారు. పిల్లల్లో పోటీతత్వం పెంపొందిస్తున్నారు. పిల్లలకు పాఠశాలపై నెలకొన్న భయాందోళలను పారదోలేలా ఆసక్తిని పెంచేలా వినూత్న కార్యక్రమాలతో వారికి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. పాలు, పండ్లు, రుచికరమైన అల్పాహారం, భోజనం వడ్డిస్తున్నారు. రంగురంగుల పెన్నులతో చిత్రలేఖనం నేర్పిస్తున్నారు. వారితో బొమ్మలు వేయిస్తున్నారు. వీటితోపాటు కాగితపు ముక్కలతో పలు రకాల బొమ్మలు తయారు చేయిస్తున్నారు. పిల్లలకు నచ్చిన పాటలు పాడించడం, నచ్చిన పాటలపై డ్యాన్సు చేయిస్తూ వారిలో ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. హాస్యం, నీతి కథలు చెబుతూ వారిలో ఆసక్తిని పెంపొందిస్తున్నారు. సామూహికంగా తెలుగు పద్యాలు పాడటం, లెక్కలు చదవడం వంటివి నేర్పిస్తున్నారు.

బాలికల నృత్యం


ఉత్తేజపరుస్తోంది

ఖుష్బూగుప్తా, ఐటీడీఏ పీవో

చిన్నపిల్లల్లో బడి అంటే భయాన్ని పారదోలేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. పిల్లల స్పందన బాగుంది. ప్రతి రోజు యోగా నుంచి మొదలుకొని ఆటలు ఆడతూ.. పాటలు పాడుతూ.. పద్యాలు చదువుతూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. చిత్రలేఖనం, కాగితపు బొమ్మలు ఇష్టంగా తయారు చేస్తున్నారు. చదువొక్కటే కాకుండా అన్ని రంగాలలో పిల్లలను ఉత్తేజపరుస్తోంది. 


జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుడి ఎంపిక

అక్షయ్‌

నిర్మల్‌ అర్బన్, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా కేంద్రంలోని ఈద్గాం ప్రాంతానికి చెందిన ద్యాయత్‌ అక్షయ్‌ ఎంపికయ్యారు. అండర్‌ 30 కేటగిరీలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ నెల 29న ఒడిశాలో నిర్వహించబోయే నేషనల్‌ టోర్నీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని