logo

సహజహితం.. వారి అభిమతం

సొంత ఊరి కోసం ఏదైనా చేయాలనే తపనతో రూ.లక్షలు విలువ చేసే భూములను విరాళంగా ఇచ్చారు. పుట్టిన ఊరిని విడిచి పెట్టి ఏళ్లు గడిచినా సొంత ఊరిపై మమకారం మాత్రం తగ్గలేదు. సమాజ హితం కోసం ప్రజల అవసరాలు తీర్చే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated : 13 Jun 2024 04:10 IST

పుట్టిన ఊరి కోసం సొంత స్థలాలు విరాళం
ఆదర్శం మూడు తరాల వీరి జీవితం
న్యూస్‌టుడే, జైనథ్‌

సొంత ఊరి కోసం ఏదైనా చేయాలనే తపనతో రూ.లక్షలు విలువ చేసే భూములను విరాళంగా ఇచ్చారు. పుట్టిన ఊరిని విడిచి పెట్టి ఏళ్లు గడిచినా సొంత ఊరిపై మమకారం మాత్రం తగ్గలేదు. సమాజ హితం కోసం ప్రజల అవసరాలు తీర్చే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకున్న దాంట్లోనే సంతృప్తి చెందుతూ ఇతరులను నొప్పించకుండా తమదైన శైలిలో పాఠశాల, వసతి గృహం, ఆరోగ్యకేంద్రం, పశువైద్యశాల, రైతువేదికతో పాటు శ్మశానవాటిక కోసం స్థలాలను ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల భూదాతలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


తండ్రికి తగ్గ తనయుడు..

గిమ్మలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 

తండ్రి నాలం రాములు ఆశయాలకు అనుగుణంగా ఊరి కోసం తనవంతు సహాయం అందించాలనుకున్నాడు నాలం వామన్‌. 25 ఏళ్ల కిందట రెండెకరాల భూమిని గిమ్మ గ్రామానికి విరాళంగా ఇచ్చారు. అదే స్థలంలో ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు. ఇప్పుడు పేద ప్రజల రోగులకు ఈ ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతోంది. దళితులకు శ్మశానవాటిక నిర్మాణం కోసం అర ఎకరం స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.

నాలం వామన్‌


ఆస్తిపాస్తులే కాదు.. ఆశయాల్లోనూ ముందే..

నాలం రాములు ఇచ్చిన స్థలంలో నిర్మించిన జడ్పీ ఉన్నత పాఠశాల

వారసత్వం అంటే ఆస్తిపాస్తులే కాదు. ఆశయాల్లోనూ పాలు పంచుకోవడమని నిరూపించారు ఒకే కుటుంబానికి చెందిన నాలం రాములు, నాలం వామన్, నాలం అనిల్‌. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 30 ఏళ్లు  నాలం రాములు సర్పంచిగా ఉన్నారు. స్వగ్రామం గిమ్మపై ఆయనకు అంతులేని మమకారం. ఊరి బాగు కోసం 47 ఏళ్ల కిందట గిమ్మలో అయిదెకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థలంలోనే ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల కొనసాగుతోంది. ఆయన ఇచ్చిన స్థలంలోనే పాఠశాల పక్కన వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం నిర్మించారు. పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అప్పట్లో గ్రామానికి రహదారి నిర్మాణం కోసం అర కిలోమీటరు పొడవు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. రోడ్డుకు పక్కన ఉన్న పశువైద్యశాల స్థలం సైతం ఈయన ఇచ్చిందే.

నాలం రాములు


వారి బాటలోనే.. 

రైతు వేదిక

తాత, తండ్రి బాటలోనే మనవడు నాలం అనిల్‌ పయనిస్తున్నారు. ఆదిలాబాద్‌లో స్థిర పడినా సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ఏడాదిన్నర కిందట నిర్మించిన రైతువేదిక భవన స్థలం నాలం అనిల్‌ ఇచ్చిందే. గిమ్మలోని ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా రూ.25 వేలు, తను చేసే వ్యాపార సంస్థ ద్వారా మరో రూ.25 వేలు అందజేశారు. నాలం రాములు 1978లో, నాలం వామన్‌ 2006లో మరణించారు. వారి ఆశయాల జ్ఞాపకాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి.   

నాలం అనిల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు