logo

అస్తవ్యస్తంగా బల్దియా నిర్వహణ

పట్టణ ప్రగతిలో పురపాలక సంఘం పాత్ర కీలకం. పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలి. కానీ, నిర్మల్‌లో మాత్రం ఇది అస్తవ్యస్తంగా మారింది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

Updated : 13 Jun 2024 05:25 IST

ఇష్టారీతిన విధుల కేటాయింప్చు
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

మున్సిపల్‌ కార్యాలయం

పట్టణ ప్రగతిలో పురపాలక సంఘం పాత్ర కీలకం. పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలి. కానీ, నిర్మల్‌లో మాత్రం ఇది అస్తవ్యస్తంగా మారింది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే బల్దియా పనితీరు పలు అంశాల్లో అభాసుపాలై రాష్ట్రస్థాయిలో విమర్శలు మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నాణ్యమైన సేవలందేలా ఉద్యోగులకు బాధ్యతలు పంచాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఫలితంగా నిర్వహణ నీరుగారిపోతోంది. పట్టణవాసులకు అవస్థలు మిగులుతున్నాయి.

అర్హత లేకపోయినా.. వసూళ్లు

పట్టణ పరిధిలో ట్రేడ్‌ లైసెన్సులు, ఆస్తిపన్ను, నల్లా పన్ను.. తదితర బిల్లుల వసూళ్లకు ప్రత్యేకంగా బిల్‌ కలెక్టర్లు ఉండటం సహజం. ఇక్కడ ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ బిల్‌ కలెక్టర్లు ఉండటం అధికారులకు కలిసొచ్చినట్లయింది. ప్రధానంగా.. ఎలాంటి అర్హత లేని ఓ వ్యక్తి బిల్లుల వసూళ్లలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌ ఉద్యోగి కాకపోయినా బాధ్యతలు ఎలా అప్పగించారనేది అంతుచిక్కని ప్రశ్న. క్షేత్రస్థాయిలో బిల్లులు వసూలైనా, వాటికి సంబంధించిన లెక్కలు అయినా పారదర్శకంగా ఉంటాయా అనేది అనుమానమే. ఒకవేళ ఏవైనా పొరపాట్లు జరిగితే బాధ్యులెవరు, చర్యలు ఎవరిపై ఉంటాయనేది చెప్పలేం. ప్రధానమైన, విలువైన పనిని అనధికార వ్యక్తి బాహాటంగా నిర్వహిస్తుంటే పట్టించుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగినట్లు చూస్తుండిపోవడం అనుమానాలకు తావిస్తోంది.

నిబంధనలున్నా..

పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులకు బిల్లుల వసూళ్లు, రసీదుల జారీ లాంటి అంశాల్లో ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని, ఒకవేళ ఉంటే ఉన్నపళంగా తీసేయాలని పురపాలకశాఖ రాష్ట్ర సంచాలకుల నుంచి కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీఅయ్యాయి. అయినా ఇక్కడ అది సక్రమంగా అమలుకావడం లేదు. సిబ్బంది కొరత పేరిట అర్హత లేకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన బాధ్యతలు అప్పగిస్తున్నారు.

తమవారికే..

నిబంధనలకు విరుద్ధంగా తమవారికి నచ్చిన చోట్ల విధులను కేటాయిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల అర్హత ఉన్న ఇతర ఉద్యోగులు నష్టపోతున్నారు. తమస్థాయికి తగిన బాధ్యతలు చేపట్టలేకపోతున్నారు. పైరవీలతో, పలుకుబడితో వచ్చిన సిబ్బంది విధి నిర్వహణలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఏ పనిచేయాలన్నా ఎంతోకొంత ముట్టజెప్పాల్సిందేనన్న భావన వ్యక్తమవుతోంది. లేకపోతే పనులు సకాలంలో జరగవు. ఇదంతా అధికారులకు, పాలకవర్గానికి తెలిసినా.. కొందరికి ఎంతోకొంత వాటా వస్తుండటంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. పరోక్షంగా సమర్థిస్తూ సహకారం అందిస్తున్నారు.

కార్యాలయంలో.. వార్డుస్థాయి సిబ్బంది

కొద్దినెలల క్రితం సర్దుబాటు ప్రక్రియలో భాగంగా అయిదుగురు వీఆర్‌ఏలను మున్సిపాలిటీకి కేటాయించారు. వీరిని ప్రత్యేకంగా వార్డుస్థాయి అధికారులుగా పేర్కొంటున్నారు. అయితే.. వీరిలో మెజార్టీ ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు. పలువురు క్లరికల్‌ పనులు నిర్వహిస్తున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధం. వారంతా జాబ్‌ ఛార్ట్‌ ప్రకారం కార్యాలయం బయటి పనులే చేపట్టాలి. కానీ, కొందరు అధికారులు తమకు అనుకూలంగా వారిని తమకు నచ్చిన స్థానాల్లో నియమించి బాధ్యతలు అప్పగిస్తున్నారు.

వార్డుస్థాయి అధికారుల జాబ్‌ఛార్ట్‌ పరిశీలిస్తే..

  • శానిటరీ, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్ల పనిని పర్యవేక్షించాలి.
  • ఇంటింటికీ చెత్త సేకరణ పర్యవేక్షణ, మూల ప్రాంతంలో వ్యర్థాలు వేరు చేయడం పరిశీలించాలి.
  • క్రమం తప్పకుండా రహదారులు ఊడ్చడం, మురుగుకాలువలు, ప్రజా మూత్రశాలలు- మరుగుదొడ్లు శుభ్రం చేయడం జరిగేలా చూడాలి.
  • అంటువ్యాధుల నివారణ, నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలి.
  • ప్రభుత్వ- ప్రైవేటు మార్కెట్లు, మటన్‌- చికెన్‌ స్టాల్స్, స్లాటర్‌ హౌస్‌లలో పారిశుద్ధ్య నిర్ధరణ చేయాలి.
  • సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం సమర్థంగా అమలుచేయాలి.
  • ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి.
  • హరితహారం కార్యకలాపాలు, కనీసం 85 శాతం మనుగడతో పచ్చదనం, అభివృద్ధి, నిర్వహణ జరగాలి.
  • వీధిదీపాల పర్యవేక్షణ, నీటి సరఫరా, పింఛన్లు (సామాజిక భద్రత పథకాలు), పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఇతర సంక్షేమ పథకాల అమలు జరిగేలా చూడాలి.

ఆదేశాలకు అనుగుణంగా చర్యలు

సి.వి.ఎన్‌.రాజు, మున్సిపల్‌ కమిషనర్, నిర్మల్‌

రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే బిల్లుల వసూళ్లు, రసీదుల పంపిణీ తదితర పనుల్లో బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. పొరుగుసేవల, ఒప్పంద ఉద్యోగులను నియమించడం లేదు. వార్డు అధికారులుగా అయిదుగురు కొత్తగా వచ్చారు. వీరు జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వారు. పట్టణంలో ఉన్న 42 వార్డులకు వీరు సరిపోరు. అందుకే, మిగతా ఉద్యోగులను సైతం వార్డు అధికారులుగా నియమించాం. వీరు ఈ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని