logo

హరిత లక్ష్యం 20 లక్షల మొక్కలు

జిల్లాలో హరితహారం లక్ష్యం ఖరారైంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 20లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 311 పంచాయతీల్లో నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన హరితహారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ కొనసాగిస్తోంది.

Updated : 13 Jun 2024 04:12 IST

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే

చెన్నూరు మండలంలోని అక్కెపల్లి నర్సరీలో పెంచుతున్న మొక్కలు

జిల్లాలో హరితహారం లక్ష్యం ఖరారైంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 20లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 311 పంచాయతీల్లో నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన హరితహారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ కొనసాగిస్తోంది.

జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఒక్కో నర్సరీని ఏర్పాటు చేసి 10వేల మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో లక్ష్యానికి అవసరమైన వివిధ రకాల మొక్కలను హరితహారంలో నాటేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రతతో మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పడుతున్నారు. నర్సరీలపై గ్రీన్‌ నెట్‌ షెడ్లను ఇదివరకే ఏర్పాటు చేశారు. పెరిగిన మొక్కలను జులై మొదటివారంలో నాటేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ పొలం గట్లు, చెరువు కట్టలు, పశుపక్ష్యాదులు, కోతులు, ప్రజలు తినేందుకు అవసరమైన పండ్ల మొక్కలు, ఇళ్లలో పెంచే వివిధ రకాల పూల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు.

విద్యుత్తు తీగలకింద నాటడంతో..

గత తొమ్మిదేళ్ల నుంచి జిల్లాలో సుమారు 2 కోట్లకుపైగా మొక్కలు నాటారు. వీటిని నాటే సమయంలో భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. సంరక్షించలేని ప్రాంతాల్లో మొక్కలను నాటడంతో ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. విద్యుత్తు తీగలు ఉన్న ప్రాంతాల్లో వాటి కింద మొక్కలు నాటుతున్నారు. అవి పెరిగిన తర్వాత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మొక్కలు పెరిగి తీగలకు తగలడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాటిని నరికేస్తున్నారు. కొన్నిచోట్ల లక్ష్యం మేర మొక్కలను నాటి చేతులు దులుపుకుంటున్నారే తప్ప వాటిని సంరక్షించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.  


పకడ్బందీగా చేపడతాం

కిషన్, డీఆర్డీవో, మంచిర్యాల

జిల్లాలో హరితహారం పథకాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామాల్లో మొక్కలు నాటే స్థలాలను పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది ముందస్తుగా ఎంపిక చేసేలా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని