logo

విత్తనంపై డీలర్ల పెత్తనం!

విత్తనాల అమ్మకాలపై ప్రభుత్వం నిబంధనలు విధించింది. చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ కూడా చేసింది. ఈ నేపథ్యంలో విత్తనాల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లాస్థాయి పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సైతం విస్తృతంగా దుకాణాలను తనిఖీ చేయడం, డీలర్లకు సూచనలు జారీ చేశారు.

Updated : 13 Jun 2024 05:21 IST

ధర పెంచి విక్రయిస్తున్న వైనం
కౌటాల, దహెగాం, న్యూస్‌టుడే

మార్కెట్లో వివిధ రకాల పత్తి విత్తనాల ప్యాకెట్లు

విత్తనాల అమ్మకాలపై ప్రభుత్వం నిబంధనలు విధించింది. చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ కూడా చేసింది. ఈ నేపథ్యంలో విత్తనాల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లాస్థాయి పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సైతం విస్తృతంగా దుకాణాలను తనిఖీ చేయడం, డీలర్లకు సూచనలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదు. జిల్లాలో లైసెన్సు పొందిన డీలర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి దోచుకుంటున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచక విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వానకాలం మొదలైంది. చిరుజల్లులు పడుతున్నాయి. రైతులు పంటలు సాగుచేసేందుకు సమాయత్తం అవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రధానంగా వరి, పత్తి, తదితర పంటలు సాగు చేస్తారు. అయితే భూమి స్వభావం రీత్యా పత్తి ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఏటా సుమారు రెండు లక్షల ఎకరాల్లో పండిస్తారు. మండలాల వారీగా కోట్లాది రూపాయల పత్తి వ్యాపారం జరుగుతోంది. దీంతో పత్తి విత్తన కంపెనీల దృష్టి జిల్లాపై పడింది. కొన్నేళ్లుగా బీటీ-3 పత్తి నకిలీ విత్తనాలు భారీ ఎత్తున పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. 

పత్తి విత్తనాల ఒక ప్యాకెట్‌ ధర రూ.864కి విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లో పలు ప్రముఖ బ్రాండ్ల పేర్లతో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రభుత్వ ఆమోదిత ధ్రువీకరణ కూడా ఉంటుంది. వీటినే విత్తనాల కంపెనీలు డీలర్ల ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఆయా ప్రాంతాలలో భూమి స్వభావం రీత్యా కొన్ని బ్రాండ్ల విత్తనాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. గతేడాది పంట దిగుబడి ఎక్కువగా వచ్చిన విత్తనాన్ని రైతు సాగు చేయడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో డిమాండ్‌ ఎక్కువ. దీన్ని ఆసరాగా చేసుకున్న కంపెనీలు, డీలర్లు.. సదరు విత్తనాల అడ్డగోలుగా ధరలు పెంచి అమ్ముతున్నారు.

బిల్లు తక్కువ.. ధర ఎక్కువ

రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని డీలర్లు బ్లాక్‌లో ఒక్కో ప్యాకెట్‌కు అదనంగా ఎమ్మార్పీకి మించి రూ.300 నుంచి రూ.500 అధికంగా వసూలు చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టినా ఆధారాలు లభ్యం కాకుండా బిల్లు బుక్‌లో ప్రభుత్వ ధరనే రాసి ఇస్తుండటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో యూఎస్‌-7067, రేవంత్, సదానంద్, రాశి పత్తి విత్తనాలకు అధిక డిమాండ్‌ ఉంది. ఈ విత్తనాల కోసం రైతులు ఆసిఫాబాద్, వరంగల్‌ పట్టణాలకు తరలివెళ్తున్నారు.


ఇబ్బందులు పడుతున్నాం..

కొండాజీ, రైతు, వీర్ధండి

పత్తి విత్తనాలు కొందామంటేనే భయమేస్తోంది. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వాటిని కొనుగోలు చేయాలంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధర తగ్గించాలంటే అసలు విత్తన ప్యాకెట్లే లేవంటున్నారు. దీంతో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్‌ పట్టణ ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.


రైతులు ఫిర్యాదు చేయాలి

పాలకుర్తి రాజేష్, వ్యవసాయాధికారి, కౌటాల

విత్తన ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తే రైతులు వెంటనే ఫిర్యాదు చేయాలి. లైసెన్సు పొందిన డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే సమాచారమివ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని