logo

సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలి

వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్యేలు హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, పాలనాధికారి వెంకటేష్‌ దోత్రే, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా, అదనపు పాలనాధికారులు దీపక్‌తివారీ, వేణు పాల్గొన్నారు.

Updated : 13 Jun 2024 04:13 IST

అధికారులకు మంత్రి సీతక్క దిశానిర్దేశం

కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క. చిత్రంలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, జడ్పీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు పాలనాధికారి దీపక్‌ తివారీ, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్‌

ఈనాడు, ఆసిఫాబాద్‌: వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్యేలు హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, పాలనాధికారి వెంకటేష్‌ దోత్రే, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా, అదనపు పాలనాధికారులు దీపక్‌తివారీ, వేణు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. వానాకాలం సీజన్‌లో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా, ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా, ప్రతి పల్లెలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ ఆయా అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని, ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే, డీఎఫ్‌ఓల మధ్య వాగ్వాదం

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే కాగజ్‌నగర్‌ మండలం అంకుసాపూర్‌లో 700 ఎకరాలకు పట్టాలు అందించారని, 50ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టాదారులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని, ఇదెక్కడి దౌర్జన్యమని ఎమ్మెల్యే హరీశ్‌బాబు పేర్కొంటూ.. రైతులకిచ్చిన పట్టాలను మంత్రికి అందించారు. కొండపల్లి, ఇటికలపహాడ్, దానాపూర్‌ తదితర గ్రామాల్లో రైతులను సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వీరికి ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలా అని ప్రశ్నించారు. పోడు రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని, రైతులతో కలిసి, కలెక్టరేట్ వద్ద ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. డీఎఫ్‌ఓ మాట్లాడుతూ.. 20-30 ఎకరాల అటవీ భూములున్న వారివే కొంత వరకు తీసుకుంటున్నామన్నారు. దీంతో ఇది పూర్తిగా అబద్ధమని, రైతులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని, వాస్తవంగా అటవీ అధికారులపైనే క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి ఇద్దరికి సర్దిచెప్పారు.

సమావేశానికి హాజరైన అధికారులు 

  • అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు రావడం లేదని, ఇవి రాకపోతే గుత్తేదారులు బడులకు తాళాలు వేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కై కుట్రపూరితంగా క్వింటాలుకు 5-6 కిలోల తరుగు తీశారని ఎమ్మెల్యే హరీశ్‌బాబు ఆరోపించారు. పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ నర్సింహరావు మాట్లాడుతూ.. కొందరు ధాన్యాన్ని కావాలనే తడిపి తెచ్చారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో సిబ్బంది, ఆపరేషన్‌ థియేటర్‌ ఉన్నా ఒక్క శస్త్రచికిత్స చేయడం లేదని, అందరిని మంచిర్యాలకు పంపిస్తున్నారని ఎమ్మెల్యే పాల్వాయి దుయ్యబట్టారు. వైద్యకళాశాలలో 32 మంది తాత్కాలిక సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల వారిని నియమించారన్నారు. రూ.862 విలువైన పత్తి విత్తనాల సంచిని రూ.1000 వరకు డీలర్లు విక్రయిస్తున్నారని మంత్రి దృష్టికి తేగా.. అటువంటి వారిని గుర్తించి పీడీ యాక్టు నమోదు చేయాలని మంత్రి పాలనాధికారిని ఆదేశించారు.
  • జిల్లాలోని వివిధ వంతెనలు, రహదారులకు సంబంధించి రూ.12 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున గుత్తేదారులు పనులు పూర్తి చేయడం లేదని ఆర్‌అండ్‌బీ ఈఈ పెద్దన్న మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఏ పనిచేయలేని పరిస్థితి నెలకొందని, ఆర్‌అండ్‌బీలో కేవలం ఇద్దరు ఏఈలతో నెట్టుకొస్తున్నామని, ప్రత్యేక అలవెన్స్‌లు ఇచ్చినా జిల్లాలో పనిచేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చిన అధికారులను తప్పనిసరిగా మూడు, నాలుగేళ్లు పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.
  • అంతకు ముందు మంత్రి సీతక్క జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్‌ నిర్మాణానికి భూమి చేసి, భవన నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తరువాత అప్పపెల్లి వంతెన పనులు పరిశీలించి వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రూ.6.20 లక్షలతో వాడిగూడలో నిర్మించిన నూతన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వరావు, ఎంపీపీ మల్లికార్జున్, నేతలు శ్యాంనాయక్, చరణ్, బాలేష్‌గౌడ్, మల్లేష్, తదితరులున్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు