logo

నిధులు నామమాత్రం.. సేవలు భారం

ఇక్కడ కనిపిస్తున్నది ఉట్నూరు గ్రామీణ మండలం హస్నాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆసుపత్రిలో సక్రమంగా మూత్రశాలలు, తాగునీటి సరఫరా, కిటికీలకు తలుపులు లేక వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రసవాలకు సంబంధించిన భవనం వర్షం పడితే ఊరుస్తుండటంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

Updated : 13 Jun 2024 04:07 IST

పనిచేయని ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు
న్యూస్‌టుడే, తలమడుగు, ఉట్నూరు గ్రామీణం

ఇక్కడ కనిపిస్తున్నది ఉట్నూరు గ్రామీణ మండలం హస్నాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆసుపత్రిలో సక్రమంగా మూత్రశాలలు, తాగునీటి సరఫరా, కిటికీలకు తలుపులు లేక వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రసవాలకు సంబంధించిన భవనం వర్షం పడితే ఊరుస్తుండటంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఈ చిత్రం తలమడుగు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనిది. ఇటీవల కురిసిన వర్షానికి రోగులు పడుకునే బెడ్‌పైన వర్షపు నీరు ఊరుస్తోంది. పాత భవనం కావడం పెచ్చులూడిపోవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందని భయంతో బిక్కుబిక్కుమంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆసుపత్రి ఆవరణ, పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో పాటు దుర్వాసనతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు రాక సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

సుపత్రులకు వచ్చే రోగులకు స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించడంతోపాటు దవాఖానాను మెరుగ్గా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు(హెచ్‌డీఎస్‌)లు జిల్లాలో పనిచేయడం లేదు. స్థానిక ఎంపీపీలు ఆసుపత్రులకు ఛైర్మన్లుగా వ్యవహరిస్తారు. వారి పదవీ కాలం సైతం ఈ నెలతో పూర్తవుతుంది. చాలీచాలని నిధులు విడుదల అవుతుండటంతో ఆసుపత్రుల్లో ఏ పని చేయలేని దుస్థితి నెలకొంది. రాబోయేది వర్షాకాలం.. వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది. ఆసుపత్రులు మాత్రం నామమాత్రంగా మారాయి.

జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి రూ.24,25,000 మంజూరయ్యాయి. మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాలి. కానీ ఎక్కడా అలా జరగడం లేదు. ఆసుపత్రుల్లో సమస్యలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం ప్రసవాలకు వచ్చే రోగులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు, నీరు, తాగునీరు, ఫ్యాన్లు లేవు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో పాత భవనాలు కావడంతో పెచ్చులూడుతున్నాయి. వర్షాకాలంలో వర్షం నీరు రోగులు పడుకునే పడకలపై ఊరుస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులకు సమస్యలను విన్నవించినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు మంజూరు కాకపోవడంతోనే సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయా ఆసుపత్రుల వైద్యాధికారులు, కమిటీ ఛైర్మన్లు చెబుతున్నారు. వాస్తవానికి మూడు నెలలకోసారి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలి. జిల్లాలో ఎక్కడ కూడా సమావేశాలు నిర్వహించడం లేదు. సమస్యలను గుర్తించడం లేదు. సామాజిక ఆసుపత్రులకు ఎమ్మెల్యేలు, జిల్లా ఆసుపత్రులకు పాలనాధికారి, జడ్పీ ఛైర్మన్లు అధ్యక్షత వహిస్తారు. పీహెచ్‌సీలకు ఏటా రెండు పర్యాయాలు కలిపి రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షలు మంజూరవుతాయి. వీటి అభివృద్ధి కమిటీ ఆమోదం మేరకు సౌకర్యాల కల్పనకు వాడుకోవాలి. కొన్ని పీహెచ్‌సీలలో సమావేశాలు జరుగుతున్నా మిగత వాటిల్లో సమావేశాలే జరగడం లేదు.


ప్రతిపాదనలు పంపాం

సాధన, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

జిల్లాలోని పలుఆసుపత్రుల్లో నిధుల కొరతతో ఆయా ప్రాంతాల్లో సమస్యలు నెలకొన్న మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కొన్నిచోట్ల కొత్త ఆసుపత్రులు నిర్మించేందుకు సైతం ప్రణాళికలు రూపొందించాం. నిధులు మంజూరైన వెంటనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అభివృద్ధి కమిటీలకు రూ.1.50 లక్షలు మాత్రమే రావడంతో చిన్నపాటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని