logo

కొంత మోదం.. కొంత ఖేదం

వానాకాలం(2024-25) సీజన్‌లో సాగు చేసే 14 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది.

Updated : 21 Jun 2024 04:32 IST

పంటలకు మద్దతు ధరపై అన్నదాతల మిశ్రమ స్పందన.. 

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం: వానాకాలం(2024-25) సీజన్‌లో సాగు చేసే 14 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలైన పత్తి, కంది పంటలకు క్వింటాలుకు రూ.500లకు పైగా పెంపు ఉండగా, సోయా, వరి పంటలకు తక్కువగా ఉండటం రైతులకు నిరాశను మిగిల్చింది. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పత్తి, కంది పంటల మద్దతు ధరల పెంపుతో జిల్లాలో సాగు చేసే లక్షల మంది రైతులకు కొంత ప్రయోజనం కలగనుంది.    
ఉమ్మడి జిల్లాలో 17.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. అందులో పత్తి పంటనే 11.50 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా. తర్వాత సోయా, కంది, వరి పంటలు సాగు చేస్తారు. జిల్లాలో రైతులు సాగు చేసే ప్రధాన పంటల మద్దతు ధర పెంపుతో రైతులకు మేలు జరుగుతుంది. గత సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్లో ఎక్కువ ధర లభించింది. మద్దతు ధరల పెంపుతో జిల్లాలో పత్తి, కంది సాగు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

 పత్తికి నిరాశే.. 

ఉమ్మడి జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పత్తి పంట ధర గత సీజన్‌లో రైతులను ముంచింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్లో తక్కువ ధర ఉండటంతో రైతులు సీసీఐకి విక్రయించారు. అనేక నిబంధనలను సాకుగా చూపి మద్దతు ధర కూడా లభించని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో తిరిగి పత్తి పంటపైనే ఆశలు పెట్టుకున్న రైతులు ఎక్కువ మొత్తం సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే మద్దతు ధరలో క్వింటాలకు రూ.501 పెంపుతో రైతులకు పత్తి రూ.7,521 లభించే వీలుంది. రైతులు పెరిగిన పెట్టుబడుల మేరకు క్వింటాలకు రూ.10 వేలకు పైగా ఉంటే గిట్టుబాటు అయ్యేదని అంటున్నారు.

 వరికి నామమాత్రం..

వరి సాగు చేసే రైతులకు మద్దతు ధర పెంపు నామమాత్రంగానే ఉంది. వరి సాగుపై గతేడాదిగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. సాగుతోపాటు పండించిన పంటను విక్రయించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి సాగును రాష్ట్రం, కేంద్రం ప్రోత్సహించడం లేదు. ఈ సీజన్‌లో సన్నరకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు సన్నరకాల సాగు వైపు మొగ్గు చూపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ రకాలకు మద్దతు ధర ప్రకటించింది. ఇదే మద్దతు ధరతో సన్నరకాలను కొనుగోలు చేస్తారు. మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటే రైతులు వ్యాపారులకు విక్రయిస్తారు. ఈ ఏడాది సాధారణ వరికి మద్దతు ధరను రూ.117 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. ఈ లెక్కన సాధారణ వరి ధర క్వింటాలుకు రూ.2,300లకు చేరుకుంది. గ్రేడ్‌- ఎ వరి పంట రూ.2,320కి చేరుకుంది. 

 సోయా కొంత మేలు

పత్తి తర్వాత సోయా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఏటా మార్కెట్లో సోయాకు ఎక్కువ ధర ఉంటుంది. అలాంటిది గత సీజన్‌లో మద్దతు కంటే తక్కువగా ఉండటంతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో క్వింటాలుకు రూ.292 పెంపు ఉండటంతో సోయా ధర క్వింటాలకు రూ.4,892కు చేరుకుంది. సోయా విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడం, ధర భారీగా పెరగడంతో పెట్టుబడి పెరిగింది. మద్దతు ధర పెంపుతో కొంత మేలు జరిగే వీలుంది.

 పప్పు, నూనె ధరల్లో పెంపు

వానాకాలం సీజన్‌లో పప్పు, నూనె పంటల సాగును పెంచేందుకు మద్దతు ధరలను పెంచారు. కంది పంట గతేడాది క్వింటాలకు రూ.10 వేలు దాటింది. మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఉండటం, మార్కెట్లో పప్పుల ధరలు పెరగడంతో ప్రభుత్వం పంటల సాగును ప్రోత్సహించేందుకు ధరలను పెంచినట్లుగా అధికారులు తెలిపారు. కంది పంటకు రూ.550, నువ్వులకు రూ.632 పెరుగుదల ఉంది. ఈ లెక్కన కంది, నువ్వుల సాగు పెరిగే అవకాశం ఉంది. 


ఉమ్మడి జిల్లాలో పంట సాగు విస్తీర్ణం (లక్షల ఎకరాల్లో)

వానాకాలం సాగు : 17.50 లక్షల ఎకరాలు
రైతులు : 5.80 లక్షలు
పత్తి : 11.50
సోయా : 1.80 
వరి : 3.50 
కంది : 1.60
పప్పుధాన్యాలు : 1.25
నూనెగింజలు : 1.65 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని