logo

ఎడతెగని ఎదురుచూపులు..

ఎగతెగని పదోన్నతుల ప్రక్రియ కొంతమంది ఉపాధ్యాయుల నిరీక్షణకు పరీక్ష పెడుతుండగా.. బదిలీల కోసం ఎదురుచూస్తున్న మరికొంత మంది ఉపాధ్యాయుల్లో ఉత్కంఠకు దారితీస్తోంది

Published : 21 Jun 2024 02:29 IST

ఎస్జీటీల బదిలీ ప్రక్రియ ప్రారంభం 

న్యూస్‌టుడే, పాలనాప్రాంగణం: ఎగతెగని పదోన్నతుల ప్రక్రియ కొంతమంది ఉపాధ్యాయుల నిరీక్షణకు పరీక్ష పెడుతుండగా.. బదిలీల కోసం ఎదురుచూస్తున్న మరికొంత మంది ఉపాధ్యాయుల్లో ఉత్కంఠకు దారితీస్తోంది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 21, 22 తేదీల్లో ఎస్జీటీలకు బదిలీ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మరో రెండు, మూడు రోజులు ఆలస్యం అనివార్యం కానుంది. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత అక్టోబరులో నిలిచిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెల 8 నుంచి తిరిగి ప్రారంభించారు. తొలుత స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. ఆ తర్వాత ఖాళీల జాబితాను పొందుపరిచారు. అనంతరం ఉపాధ్యాయులు ఐచ్ఛికాలు ఎంచుకున్నారు. ఈ ప్రక్రియలో ఆదినుంచి తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఈ నెల 16న అన్ని క్యాడర్ల ఉపాధ్యాయ పదోన్నతి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉండటం గమనార్హం. గురువారం స్కూల్‌ అసిస్టెంటు సోషల్‌ స్టడీస్‌లో 43 మందికి, బయోసైన్సులో 27 మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. పీఎస్‌హెచ్‌ఎంలుగా 51 మందికి, తెలుగు ఎస్‌ఏలుగా 106 మందికి, ఇంగ్లిష్‌ కేటగిరిలో 16 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ నెల 16 నుంచి వారంతా ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఎస్జీటీల బదిలీల కోసం విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి నుంచి బదిలీ కోసం రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజున 40 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన కేటగిరిల పదోన్నతి ఉత్తర్వుల జారీ అనంతరం ఖాళీలను తేల్చి తొలుత కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లతో సీనియారిటీ జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణ, ఐచ్ఛికాల ఎంపిక, చివరగా బదిలీ ఆర్డర్లను జారీ చేయనున్నారు. దాదాపు 1,000 నుంచి 1,200 మందికి స్థానచలనం కలిగే అవకాశముందని విద్యాశాఖ వర్గాల అంచనా. టెట్ అర్హత విషయమై హైకోర్టులో అప్పీల్‌ విచారణను జులై 2కు వాయిదా వేయడంతో అప్పటి వరకు ఈ ప్రక్రియ మొత్తాన్ని ముగించాలని విద్యాశాఖ భావిస్తోంది. 


దరఖాస్తుల నమోదు 

కొత్తగా బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఉపాధ్యాయుల సమాచారాన్ని కంప్యూటర్‌లో నమోదుచేసే ప్రక్రియ మొదలైంది. తొలిరోజున 40 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు డీఈవో ప్రణీత తెలిపారు.

వీరంతా భాషా పండితులు. మూడు రోజులుగా స్కూల్‌ అసిస్టెంటు తెలుగు విభాగంలో పదోన్నతి ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తున్నారు. విసుగుచెంది గురువారం విద్యాశాఖ కార్యాలయం ఎదుట గుమిగూడి తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం డీఈవో ప్రణీతను కలిసి తమ గోడును వివరించారు. సాంకేతిక సమస్యతో జాప్యం జరుగుతోందని, డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని ఆమె సముదాయించారు. తెలుగులో 106 మంది పదోన్నతులపై గందరగోళం నెలకొంది. ఆర్డర్లకోసం వారు ఎదురుచూస్తున్నారు.

70 మందికి పదోన్నతి ఉత్తర్వులు 

జిల్లాలో గురువారం ఉదయం మరికొంత మందికి పదోన్నతి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఎస్‌ఏ సోషల్‌ స్టడీస్‌ ఉపాధ్యాయులు 43 మంది, బయోసైన్సు టీచర్లు 27 మంది ఉన్నారు. వీరంతా ఆర్డర్లు జారీ కావడమే ఆలస్యం కేటాయించిన పాఠశాలల్లో చేరిపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని