logo

ఉట్నూరుకు మరో ఐఏఎస్‌ అధికారి

పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు మరో ఐఏఎస్‌ అధికారిని నియమించనుంది. రెవెన్యూ శాఖలో కీలకంగా ఉండే ఆర్డీఓల స్థానంలో వీరిని పంపించనున్నారు.

Published : 21 Jun 2024 02:33 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం: పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు మరో ఐఏఎస్‌ అధికారిని నియమించనుంది. రెవెన్యూ శాఖలో కీలకంగా ఉండే ఆర్డీఓల స్థానంలో వీరిని పంపించనున్నారు. ఇందుకు జిల్లాకు ఒక రెవెన్యూ డివిజన్‌ను ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు డివిజన్‌కు త్వరలోనే ఐఏఎస్‌ అధికారి రానుండడంతో ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

సాధారణంగా ఐఏఎస్‌ అధికారి ఉంటే ఎక్కడైనా సరే ఆయన కింద పని చేసే సిబ్బందిలో కాస్త పారదర్శకత కనిపిస్తుంది. ఒకింత భయం ఉంటుంది. ఇటు ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది దోహదపడుతుంది. ఐఏఎస్‌ శిక్షణ పూర్తయిన అధికారులకు నేరుగా ఇక్కడ పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉండటంతో వారిలో ఉండే చురుకుదనం వల్ల ప్రజలకు, ఇటు పాలనకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా రెవెన్యూ సమస్యలే అధికంగా కనిపిస్తున్నాయి. ఆర్డీఓలు ఉన్నా చాలా చోట్ల పదోన్నతులతో వచ్చిన వారితో ఆశించిన ఫలితాలు రావడం లేదనే అభిప్రాయాలు సైతం కొన్ని చోట్ల ఉన్నాయి. తమ సమస్యల కోసం రైతులు, ప్రజలు మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయి ఆర్డీఓను కలిసినా ప్రయోజనం లేకుండా పోతోందనే వాదనలున్నాయి. అదే ఐఏఎస్‌ అధికారి ఉంటే వీటన్నింటికి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్, అడిషనల్‌ కలెక్టర్‌(స్థానిక సంస్థలు), అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ) పోస్టింగ్‌లు కేటాయించారు. ఈ ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు తోడు కొత్తగా మరో ఐఏఎస్‌ అధికారి జత కానున్నారు. పాలనాపరంగానే కాకుండా శాంతిభద్రతలు కాపాడటంలోనూ వీరి భూమిక  ఉండటంతో ఆ రకంగానూ ఉపయోగపడనున్నారు. 

అప్పట్లోనే సబ్‌ కలెక్టర్ల నియామకం

ఉమ్మడి జిల్లాలో గతంలోనే పలు రెవెన్యూ డివిజన్లలో ఐఏఎస్‌ అధికారులు విధులు నిర్వహించారు. ఉట్నూరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడ్డ తర్వాత అక్కడ సైతం సబ్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులు పని చేశారు. ఐటీడీఏ పీఓగా ఐఏఎస్‌ అధికారి ఉండటంతో గిరిజనుల కోసం రెవెన్యూ డివిజన్‌కూ ఐఏఎస్‌ అధికారి ఉండాలని ఈ పోస్టింగ్‌లు ఇచ్చారు. కాకపోతే ఇది కొంతకాలానికే పరిమితమైంది.  తాజాగా ఉట్నూరు ఆర్డీవో కార్యాలయం ఇక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంగా మారనుంది. దీంతో ఇక్కడికి మరో ఐఏఎస్‌ అధికారి రానున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని