logo

వైద్య సేవలపై అప్రమత్తంగా ఉన్నాం

జిల్లాలో వానాకాలం వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ఏటా డెంగీ, మలేరియా, అతిసారం, టైఫాయిడ్‌ జ్వరాలతో గ్రామాలు మంచాన పడుతున్నాయి.

Updated : 21 Jun 2024 05:39 IST

 గర్భిణులను వారం ముందే ఆసుపత్రులకు చేరుస్తాం

‘ఈనాడు - ఈటీవీ’ ముఖాముఖిలో డీఎంహెచ్‌వో నరేందర్‌ రాఠోడ్‌   

ఈటీవీ - ఆదిలాబాద్‌: జిల్లాలో వానాకాలం వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ఏటా డెంగీ, మలేరియా, అతిసారం, టైఫాయిడ్‌ జ్వరాలతో గ్రామాలు మంచాన పడుతున్నాయి. ఇప్పటికే డెంగీ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకుంటే రోగుల ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఈ అంశాలపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా.నరేందర్‌ రాఠోడ్‌తో ‘ఈనాడు- ఈటీవీ’ ముఖాముఖి.
ఈనాడు : వర్షాకాలంలో తరచూ వ్యాధులు ప్రబలుతుంతాయి, మీ శాఖ తరఫున ముందస్తు ప్రణాళిక ఏమిటి?
డీఎంహెచ్‌వో : వర్షాకాలంలో రెండు రకాల వ్యాధులు ప్రబలే అవకాశముందని గుర్తించాం. అందులో మొదటివి నీటి జనిత వ్యాధులు కాగా.. రెండోవి కీటక జనిత రోగాలు. గతేడాది తలెత్తిన పరిణామాల రీత్యా డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాం. వీటి నియంత్రణ కోసం క్షేత్రస్థాయిలో మా సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రజలు కూడా నివాసిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు తలెత్తవు. అందులో భాగంగా ఫ్రైడే - డ్రై డే అని, జులైలో ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే అనే కార్యక్రమానికి రూపకల్పన చేశాం.
ఈ : కమ్యూనిటీ, ఏరియా ఆసుపత్రులతోపాటు పీహెచ్‌సీల్లో మందుల కొరత ఉంటోంది. వర్షాకాలంలో పాముకాటుకు గురైతే వినియోగించే ఇంజెక్షన్లు అందుబాటులో లేకుంటే ప్రాణాలకే ముప్పు  కదా?
డీఎం : మందుల కొరత లేకుండా ఏర్పాట్లు చేశాం. అవసరమైన మందులతో పాటు పాముకాటుకు ఉపయోగించే ఇంజెక్షన్లను అన్ని చోట్ల అందుబాటులో ఉంచాం.  అత్యవసరమనుకుంటే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశాం.
ఈ : వ్యాధి తీవ్రత ప్రాంతాలు ఎన్ని అనేవి గుర్తించారా? పీహెచ్‌సీలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా?
డీఎం: లేదు. జిల్లాలోని 165 గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ పరిధిలోని మరో 49 నివాసాలను వ్యాధి కారక ప్రాంతాలుగా గుర్తించాం. ఇందులో ప్రధానంగా నిల్వ ఉండే మురుగుతో పరిసరాలు కలుషితమయ్యేవి కొన్నయితే, నివాసిత ప్రాంతాల్లో చెత్తాచెదారంతో కూడిన అపరిశుభ్రత, కొబ్బరి బోండాలు, టైర్లు, పూలమొక్కల్లో నీటిని శుభ్రం చేయకపోవటంతో తలెత్తివి మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ విభాగం, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలతో పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ, మెప్మా సిబ్బందితో సర్వేలు చేయించాం. ప్రతి పీహెచ్‌సీలో ఓ మెడికల్‌ ఆఫీసర్‌ సహా ఇతర సిబ్బందిని సర్దుబాటులో భాగంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. 
ఈ : వర్షాకాలంలో భారీ వరదలు పోటెత్తినా, కాలువలు, వాగులు పొంగినా మారుమూల గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించటం కష్టంగా ఉంటుంది. వాటిపై మీ కార్యాచరణ ఏమిటి?
డీఎం : ఇది చాలా ముఖ్యమైన అంశం. రవాణా సౌకర్యం సరిగా లేని ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. జూన్, జులై, ఆగస్టు మాసాల్లో ప్రసవాలు జరిగే గర్భిణుల ఎక్స్‌పెక్టెడ్‌ డెలివరీ డేట్‌(ఈడీడీ) జాబితాను సిద్ధం చేశాం. వారిని వారం రోజల ముందుగానే సమీపంలో ఉండే నార్నూర్, ఉట్నూర్, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, నేరడిగొండ, బజార్‌హత్నూర్, బోథ్‌ ఆసుపత్రుల్లో చేరుస్తాం. సకాలంలో వైద్యం అందిస్తూ మాతా శిశు మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని