logo

పాలనా సౌలభ్యం.. సమస్యలకు పరిష్కారం

పరిపాలనా సౌలభ్యం, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated : 21 Jun 2024 04:47 IST

భైంసా డివిజన్‌కు సబ్‌ కలెక్టర్‌ పోస్టు మంజూరు

భైంసా ఆర్డీవో కార్యాలయం 
నిర్మల్, న్యూస్‌టుడే : పరిపాలనా సౌలభ్యం, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ డివిజన్‌లకు ఐఏఎస్‌ క్యాడర్‌కు సంబంధించి సబ్‌ కలెక్టర్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో డివిజన్‌ కేంద్రంగా ఉన్న భైంసాకు కొత్తగా సబ్‌ కలెక్టర్‌ను నియమించనున్నారు. స్థానికంగా నెలకొన్న రెవెన్యూ, ఇతరత్రా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం లభించనుంది. ఈ మేరకు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. 

భైంసా డివిజన్‌ పరిధిలో భైంసా పట్టణంతోపాటు భైంసా, ముథోల్, బాసర, కుభీరు, కుంటాల, లోకేశ్వరం, తానూరు మండలాలు ఉన్నాయి. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్టు వరద నీటితో గుండేగాం గ్రామం ముంపునకు గురవుతుంది. కొన్నేళ్ల నుంచి వీరికి పునరావాసం కల్పించకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి వరద వచ్చిన ప్రతీ సారి గ్రామస్థులు భైంసా పట్టణానికి వచ్చి తాత్కాలికంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

  •  గడ్డెన్నవాగు ప్రాజెక్టు పునరావాస గ్రామాలైన వాయి, లింగి, టాక్లీ, చుచుంద్, కుంబి, నిగ్వలలో బ్యాక్‌వాటర్‌ వస్తుండటంతో ఆయా ప్రాంతవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పల్లెల్లో తాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే. రహదారులు, మురుగుకాలువలు అధ్వానంగా ఉన్నాయి. రైతులు సాగు చేసే భూముల్లోకి వరద రావడంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయి. ఇప్పటికీ చాలా మంది అన్నదాతలకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. కొంతమంది రైతుల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో ఉండటంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. రైతు భరోసా, రైతుబీమా వంటి పథకాలకు వీరు దూరమయ్యారు. 14 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న గడ్డెన్నవాగు ప్రధాన కాలువ పనులు పూర్తికాకపోవడంతో చివరికి నీరందని పరిస్థితులు ఏర్పడ్డాయి. బాసర సరస్వతీ క్షేత్రం, ఆర్జీయూకేటీ విద్యాలయం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. లోకేశ్వరం మండలంలో డీ-1 భూముల సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. 
  •  భారీ వర్షాలు, అనుకోకుండా ఏర్పడిన విపత్తుల నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకునే అధికారం ఆర్డీవోలకు లేకపోవడం, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. ఇప్పుడు భైంసా డివిజన్‌కు ఐఎస్‌ఎస్‌ క్యాడర్‌కు సంబంధించి సబ్‌ కలెక్టర్‌ను నియమించనుండటంతో సమస్యలకు వెనువెంటనే పరిష్కారం లభించనుంది. దీంతోపాటు ఏదైనా విపత్తు వచ్చిన సమయంలో సత్వర నిర్ణయం తీసుకునే అధికారం ఉండటంతో ఎంతో ప్రయోజనం కలగనుంది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని