logo

వేధింపులు అధికం.. చైతన్యం అవసరం

సింగరేణి సంస్థలో రోజురోజుకూ మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉండగా, అదే స్థాయిలో వారిపై వేధింపులూ అధికమవుతున్నాయి.

Updated : 21 Jun 2024 04:35 IST

సింగరేణిలో మహిళలపై ఆగడాలు 

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే : సింగరేణి సంస్థలో రోజురోజుకూ మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉండగా, అదే స్థాయిలో వారిపై వేధింపులూ అధికమవుతున్నాయి. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత చదువులు చదివిన యువతులు సైతం సింగరేణిలో బదిలీ వర్కర్లుగా, జనరల్‌ మజ్దూర్లుగా పనిచేస్తున్నారు. కారుణ్య నియామకాల ద్వారా నెలనెలా ఉద్యోగంలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అల్లుడికి బదులుగా కూతురుకి ఉద్యోగం ఇస్తే, ఆమెకు ఆర్థిక స్వేచ్ఛతోపాటు, సామాజిక భద్రత లభిస్తుందనే ఉద్దేశంతో తండ్రులు తమ కూతుళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో దాదాపు రెండువేల మంది వరకు మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా.

మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో దాదాపు ఆరువందల మందికిపైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడు, నాలుగేళ్లకింద కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి జీఎం కార్యాలయాలు, ఏరియా స్టోర్స్, ఏరియా వర్క్‌షాపుల్లాంటి ఉపరితల విభాగాల్లో మహిళా ఉద్యోగులకు అవకాశం కల్పించారు. ఉపరితల విభాగాల్లో మహిళా ఉద్యోగులను సర్దుబాటు చేయలేక, భూగర్భ గనులపై ఉపరితలంలో పనిచేసేలా యాజమాన్యం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం భూగర్భ గనులు, ఉపరితల గనులు, సీహెచ్‌పీల్లోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అదేస్థాయిలో వారిపై వేధింపులూ పెరుగుతున్నాయి. 

  • మందమర్రి ఏరియా స్టోర్స్‌లో అధికారి వేధింపులు భరించలేక 2016 బ్యాచ్‌కు చెందిన ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ గతంలో ఆత్మహత్య చేసుకుంది. 
  • బెల్లంపల్లి (గోలేటి) ఏరియా స్టోర్స్‌లో పనిచేసే ఒక ఇంజినీర్‌ మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. 
  • మందమర్రిలోని కేకే-5 గనిలో ఆఫీస్‌ సూపరింటెండెంట్, మహిళా ఉద్యోగినితో బూట్లు, సాక్సులు ఉతికించుకున్న ఘటన జరిగింది. 

తాజాగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న మందమర్రి ఏరియా పరిధిలోని శాంతిఖని గనిలో పనిచేసే మహిళా ఉద్యోగిని పట్ల అనుచితంగా వ్యవహరించిన ఘటన వెలుగు చూసింది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నప్పటికీ అధికారులపై ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగదనో, కుటుంబాల్లో కలహాలు ఏర్పడతాయనో, బయటకు తెలిస్తే తాము నలుగురిలో చులకన అవుతామనే ఉద్దేశంతో అనేక మంది తమలో తామే కుంగిపోతున్నారు. ఒకవేళ ఫిర్యాదు చేయాలని ఉన్నా, ఎవరికి చేయాలి, ఎలా తమ బాధను వెల్లడించాలనే విషయంపై సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు కనీస అవగాహన కల్పించకపోవడంతో రోజురోజుకూ ఆగడాలు పెరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో బాధిత మహిళలు బహిరంగంగా తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేసిన ఘటనలూ ఉన్నాయి. ఒకవేళ ఫిర్యాదు చేసినా, తమను విచారించేదీ తోటి అధికారులే కావడంతో మీరు ఏమీ చేయలేరంటూ కొందరు అధికారులు మహిళా ఉద్యోగులను బెదిరిస్తున్నారు.

ఏరియా స్థాయి కమిటీలున్నా పనితీరు సున్నా..

పని స్థలాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి చట్ట ప్రకారం యాజమాన్యం వారి హక్కులను వివరించే హ్యాండ్‌ బుక్‌ అందుబాటులో ఉంచాలి. 2013 నాటి లైంగిక వేధింపుల చట్టం ప్రకారం పదిమంది కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతీ కార్యాలయంలో, ఫిర్యాదుల పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. కాగితాల్లో చూపడానికి యాజమాన్యం ఏరియాకు ఒకటి చొప్పున అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించినప్పటికీ వాటికి ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. సింగరేణి యాజమాన్యం మహిళల హక్కుల పరిరక్షణ కోసం, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ఏరియాల్లో లైజన్‌ అధికారులను నియమించింది. ఆయా ఏరియాల్లోని కమిటీలు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారైనా సమావేశమైన దాఖలాలు లేవు. మహిళా ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారిని చైతన్యవంతం చేసిన సంఘటన ఒక్కటీ లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని