logo

బెల్లంపల్లికి మళ్లీ సబ్‌కలెక్టర్‌

బెల్లంపల్లిలో సబ్‌కలెక్టర్‌ పోస్టు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బెల్లంపల్లిలో సబ్‌కలెక్టర్‌ పోస్టు ఉండేది.

Published : 21 Jun 2024 02:50 IST

భూ ఆక్రమణలపై దృష్టిసారించే అవకాశం

బెల్లంపల్లిలోని సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ అధికారి కార్యాలయం 

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే : బెల్లంపల్లిలో సబ్‌కలెక్టర్‌ పోస్టు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బెల్లంపల్లిలో సబ్‌కలెక్టర్‌ పోస్టు ఉండేది. 2018లో అప్పటి రాష్ట్రప్రభుత్వం సబ్‌కలెక్టర్‌ పోస్టు మంజూరు చేసింది. 2020లో మళ్లీ ఆర్డీఓను నియమించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజన సమయంలో బెల్లంపల్లిలో జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాలను జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం బెల్లంపల్లిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. 2016 అక్టోబరు 10న తొలి ఆర్డీఓగా ఎన్‌.పాండురంగ బాధ్యతలు సీˆ్వకరించారు. బెల్లంపల్లికి ప్రాధాన్యత దృష్ట్యా 2018 జనవరి 4వ తేదీన సబ్‌కలెక్టర్‌ పోస్టును మంజూరు చేసి సబ్‌కలెక్టర్‌గా రాహుల్‌రాజ్‌ను నియమించారు. రెండేళ్లు పనిచేసిన తర్వాత రాహుల్‌రాజ్‌ బదిలీ అయ్యారు. అయిదు రోజుల పాటు స్నేహలత సబ్‌కలెక్టర్‌ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం మరో నాలుగు నెలల పాటు సురేందర్‌రావు ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్‌గా కొనసాగారు. మళ్లీ ఆర్డీఓగా శ్యామలదేవిని ప్రభుత్వం నియమించింది. ఈమె రెండేళ్లపాటు పనిచేశారు. మూడు నెలలపాటు కాసబోయిన సురేష్‌ ఆర్డీఓగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆర్డీఓగా గత ఏడాది నవంబర్‌నుంచి హరికృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్రమణలు ఉన్నచోట ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెల్లంపల్లికి సబ్‌కలెక్టర్‌ పోస్టును మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఈ నెల 13వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. 

కబ్జాలకు అడ్డుకట్ట 

అయిదేళ్లలో బెల్లంపల్లి పట్టణంతో పాటు మండలంలో ఆక్రమణల జోరు కొనసాగింది. ఎక్కడ ఏ భూమి ఆక్రమణకు గురైందో ఇప్పటికీ రెవెన్యూ అధికారులకు సమాచారం లేదు. ఏకంగా రెవెన్యూ అధికారులే అక్రమార్కులకు వంత పాడడంతో ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ గెలిచినప్పటి నుంచి భూఆక్రమణల విషయంలో అంత సీˆరియస్‌గా లేకున్నప్పటికీ తెరవెనుక వీటిని అరికట్టేందుకు పకడ్బందీగా పావులు కదిపారు. ఆర్డీఓ స్థాయిలో ఆక్రమణలకు కళ్లెం వేయలేమని గ్రహించిన వినోద్‌ బెల్లంపల్లికి ఐఏఎస్‌ అధికారిని నియమించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. గతంలో దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనుచరులే ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ  అనుభవంతో ఎమ్మెల్యే వినోద్‌ ముందుజాగ్రత్తగా ఐఏఎస్‌ను నియమించేలా ప్రభుత్వంపై తీసుకొచ్చిన ఒత్తిడి ఫలించింది. గతంలో రాహుల్‌రాజ్‌ సబ్‌కలెక్టర్‌గా ఉన్న సమయంలో అతనే స్వయంగా వెళ్లి ఆక్రమణల స్థలాల్లో బోర్డులు పాతిన సందర్భాలు ఉన్నాయి. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని