logo

కూత లేదు.. కోతలే..!

దక్షిణ మధ్య రైల్వేమార్గంలో ఏ గ్రేడ్‌గా మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సిర్పూర్‌ నుంచి కాజిపేట-వరంగల్, సికింద్రాబాద్, విజయవాడ మార్గంలో నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

Published : 21 Jun 2024 02:55 IST

మంచిర్యాల అర్బన్, కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : దక్షిణ మధ్య రైల్వేమార్గంలో ఏ గ్రేడ్‌గా మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సిర్పూర్‌ నుంచి కాజిపేట-వరంగల్, సికింద్రాబాద్, విజయవాడ మార్గంలో నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏళ్లుగా ఈ మార్గంలో ఒక్క కొత్తప్యాసింజర్‌ రైలును కూడా ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా.. రైల్వేకు ఆదాయం సమకూరుతున్నా.. ప్యాసింజర్‌ రైళ్ల ఏర్పాటులో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. దీనికితోడు మూడో రైల్వేలైను పనులతో తరచూ రైళ్లను రద్దు చేస్తున్నారు. కొత్త రైళ్ల కూతలు లేకపోగా కోతలుంటున్నాయి. ప్రస్తుతం ప్రధాన రైళ్లు రద్దు కావడంతో మంచిర్యాల, కుమురంభీం జిల్లాల ప్రజలు రైలు ప్రయాణానికి ప్రయాస పడుతున్నారు. 

రాజధానికి రైళ్లు కరవు

మంచిర్యాల రైల్వేస్టేషన్‌ నుంచి నిత్యం సుమారు 6 వేల మంది పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 4 వేల వరకు రాజధానికే వెళ్తుంటారు. నిత్యం 5 గంటలకు మంచిర్యాల నుంచి బయలుదేరే భాగ్యనగర్‌ రైలు ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. ప్రస్తుతం ఈ రైలు రద్దు కావడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటర్‌సిటీ, మధ్యాహ్నం 3.30 గంటలకు కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రెండు మాత్రమే ఉన్నాయి. వీటిలో కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో సీటు కావాలంటే ముందే రిజర్వేషన్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. కొత్తగూడెం వెళ్లే సింగరేణి, కరీంనగర్‌కు వెళ్లే పుష్పుల్, కాజిపేటకు వెళ్లే రామగిరి రైళ్లు రద్దు చేశారు. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, క్యాతన్‌పల్లి ప్రాంతాల నుంచి జమ్మికుంట, ఓదెల, కొలనూరు, కాజీపేట, వరంగల్‌కు నిత్యం చాలా మంది ప్రయాణిస్తుంటారు. సింగరేణి కార్మికులుగా పనిచేస్తున్న వారిలో చాలామంది పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు చెందినవారే. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో హైదరాబాద్‌కు తమ పిల్లలను తీసుకు వెళ్లాలంటే రైళ్లు లేకపోవడంతో జిల్లావాసులు ఇతర మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. రైలులో దూరభారంతోపాటు సమయం, డబ్బులు కూడా తక్కువే. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలంటే డబ్బులతోపాటు సమయం వృథా అవుతోంది.

మంచిర్యాల వరకు నడిపించాలి

ప్రస్తుతం కుమురంభీం జిల్లా రేచిని నుంచి కాగజ్‌నగర్‌ మార్గంలో మూడో రైల్వేలైన్‌ పనులు సాగుతున్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలో ఏదైనా ఒక స్టేషన్‌ వరకు సికింద్రాబాద్‌తోపాటు కాజీపేట నుంచి వచ్చే రైళ్లను నడిపించేందుకు ఎలాంటి సమస్యలు లేవు. భాగ్యనగర్‌తోపాటు సింగరేణి, రామగిరి ప్యాసింజర్‌ రైళ్లను నడిపించాలని రైల్వే అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని