logo

ప్రజా రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుదాం

ప్రజా రక్షణే ధ్యేయంగా పోలీసులు ముందుండాలని ఎస్పీ డి.వి.శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. మల్కాజిగిరి జిల్లాలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ డీసీపీగా పనిచేసిన ఆయన గురువారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు

Published : 21 Jun 2024 02:58 IST

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డీ.వీ.శ్రీనివాస్‌రావు 

ఆసిఫాబాద్, న్యూస్‌టుడే  : ప్రజా రక్షణే ధ్యేయంగా పోలీసులు ముందుండాలని ఎస్పీ డి.వి.శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. మల్కాజిగిరి జిల్లాలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ డీసీపీగా పనిచేసిన ఆయన గురువారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. మొదట జిల్లాలోని పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, కట్టడిపై మాట్లాడారు. డయల్‌ 100 ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించేలా చూడాలన్నారు. సైబర్‌ నేరాల కట్టడిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణపై ఉక్కుపాదం మోపాలన్నారు. మావోయిస్టుల నియంత్రణకు జిల్లాలో ఎప్పటికప్పుడు ప్రత్యేక పార్టీల ద్వారా ఏరియా డ్యామినేషన్, కూంబింగ్‌లు నిర్వహించాలని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. ప్రజా రక్షణతో పాటు సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యేలా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వి.రమేశ్, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేలను మర్యాద పూర్వకంగా కలిశారు. 

గ్రూప్‌-1 స్థాయి నుంచి ఐపీఎస్‌ వరకు

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌రావుది సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ మండలంలోని ఇస్తలాపూర్‌ కుగ్రామం. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశారు. ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో, ఎంఎస్సీ మాథ్స్, ఎంఏ తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. 2007లో గ్రూప్‌-1 ద్వారా ఎంపికై కరీంనగర్‌ డీఎస్పీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం పదోన్నతుల ద్వారా వివిధ స్థాయిలో విధులు నిర్వహించారు. విజయనగరం ఆపరేషన్స్‌ ఓఎస్‌డీగా పనిచేశారు. 2013లో ఐపీఎస్‌ సాధించారు. హైదరాబాద్‌లో అదనపు ఎస్పీ సీఐ సెల్, మహబూబ్‌నగర్‌లో అదనపు ఎస్పీగా పని చేశారు. 2017-18లో నల్గొండ ఎస్పీగా, తరువాత హైదరాబాద్, వరంగల్‌లలో విజిలెన్స్‌ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతరం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ డీసీపీగా ఏడాదిన్నరపాటు విధులు నిర్వహించి బదిలీపై జిల్లా ఎస్పీగా వచ్చారు.  

శాంతి భద్రతల పరిరక్షణలో సమష్టిగా కృషి చేద్దాం

ఆసిఫాబాద్‌: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కొత్తగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి.వి.శ్రీనివాసరావు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు జిల్లా పరిస్థితులపై  చర్చించారు. ప్రజా రక్షణ, సంక్షేమానికి సమన్వయంతో ముందుకు సాగుదామని పేర్కొన్నారు.


ఇదీ నేపథ్యం..
పేరు : డీవీ శ్రీనివాస్‌రావు
పుట్టిన తేదీ : 23/09/1976
తల్లి : సునంద (గృహిణి)
తండ్రి : కొండల్‌రావు (దివంగత విశ్రాంత ఉపాధ్యాయుడు)
భార్య : రవళి (ఎంటెక్‌)
కూతురు : సహస్ర (8వ తరగతి)
కుమారుడు : అనురాగ్‌ (6వ తరగతి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని