logo

నిత్య ‘యోగ’ం.. ఆరోగ్య భాగ్యం

వేల సంవత్సరాల కిందటే పతంజలి మహర్షి మన భారతీయులకు అందించిన ‘అష్టాంగ యోగం’ ప్రస్తుతం ప్రపంచానికి దిక్సూచిగా మారింది.

Published : 21 Jun 2024 03:18 IST

 నేడు అంతర్జాతీయ దినోత్సవం

దృష్టి సారిస్తున్న యువత

వేల సంవత్సరాల కిందటే పతంజలి మహర్షి మన భారతీయులకు అందించిన ‘అష్టాంగ యోగం’ ప్రస్తుతం ప్రపంచానికి దిక్సూచిగా మారింది. ప్రతి ఒక్కరిని యోగా వైపు మళ్లించడానికి దోహదమైంది. ఈ రెండక్షరాల యోగాలో ఎంతో మహత్తర శక్తి దాగుందని సాధకులు తమ దినచర్యలో ఒక భాగం చేసుకుంటున్నారు. నిత్యం సాధన చేసి ప్రయోజనం పొందుతున్నారు. ఆరోగ్యానికి యోగా ఒక భాగ్యంగా భావిస్తున్నారు. ఆరోగ్యం, క్రీడలు, విద్య, ఉపాధి ఇలా అనేక రంగాల్లో యోగాలో కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.
- న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం


ఆధునిక హంగులు..

కాలానుగుణంగా సంప్రదాయ యోగాకు అదనపు హంగులు జోడిస్తున్నారు. ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారు. రిథమిక్, ఆర్టిస్టిక్, పవర్, బిక్రం పేర్లతో యోగా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందుతోంది.

నేర్చుకున్నారు.. ఇతరులకు పంచుతున్నారు

ఈయన పేరు సత్యనారాయణ. ఆర్టీసీ ఉద్యోగి. వృత్తిలోని ఒత్తిడి నుంచి ఉపశమం పొందాలని కొన్నేళ్ల పాటు యోగాలో శిక్షణ పొందారు. ఆసనాలపై పట్టు సాధించారు. వాటితో కలిగే లబ్ధిని తెలుసుకున్నారు. నేర్చుకున్న విద్యను తన వరకే పరిమితం చేయకుండా పరిసరాల్లోని నివాసితులకు అవగాహన కల్పించడం ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈయన నిర్వహించే ఉచిత శిబిరానికి సుమారు 20 మంది నిత్యం వస్తూ సాధన చేస్తుంటారు. తన సంస్థలోని ఉద్యోగులకు కూడా యోగాపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు.  

అణువణువునా చైతన్యం.. 

పస్తుతం బిజీ ప్రపంచంలో అంతా యోగా ప్రాధాన్యం గురించి తెలుసుకుంటున్నారు. ఇతరులను భాగస్వామ్యం చేసి వారిని చైతన్యపరుస్తున్నారు. చిన్నారుల్లో చురుకుదనం, ఉద్యోగుల్లో వృత్తి సామర్థ్యం, యువతలో సాధించే తత్వం, ఇలా దేనికైనా ఆశ్రయించే దివ్య ఔషధం ఒక్క యోగా సాధన ద్వారానే సాధ్యం. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యం కోసం యోగా కేంద్రాల్లో చేరుతున్నారు. సామూహికంగా సాధన చేసి లబ్ధి పొందుతున్నారు. మూడు దశాబ్దాల కింద ఆదిలాబాద్‌లో యోగాను గురువు పోతారపు తిరుపతిరెడ్డి పరిచయం చేసి ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న మరికొంత మంది యోగా శిక్షకులు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి సాధన చేయిస్తున్నారు.  

విద్యారంగంలోనూ స్థానం..

కేంద్ర క్రీడా మంత్రిత్వ ఆయూష్‌ శాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, యాజమాన్య విద్యాసంస్థల్లో యోగాను భాగస్వామ్యం చేసింది. యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించింది. నర్సింగ్‌ కళాశాల విద్యార్థులకు, ఎంబీబీఎస్‌ చదువుతున్న మెడికోలకు, పాఠశాల విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ప్రతి వెల్‌నెస్‌ సెంటర్‌లో ఒక యోగా ఇన్‌స్ట్రక్టర్‌ను అందుబాటులో ఉంచి రోగులను యోగా గురించి అవగాహన కల్పిస్తోంది. 

కోర్సు, ఉపాధి అవకాశాలు..

బెంగళూరులోని స్వామి వివేకానంద అనుసంధాన సంస్థాన్‌ ఆధ్వర్యంలో అనేక యోగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆరు నెలల పాటు యోగా ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సు(వైఐసీ) పూర్తి చేసి సర్టిఫికెట్‌ అందుకున్న వారు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగానికి అర్హులు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పలువురు ఈ కోర్సును పూర్తి చేసి విద్యార్థులకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. జాతీయస్థాయి యోగా పోటీల్లో రెఫరీలుగా, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

రిథమిక్‌ యోగా

నచ్చిన సంగీతం వింటూనే లయబద్ధంగా నృత్యం చేస్తూ వేసే ఆసనాలు, భంగిమలే రిథమిక్‌ యోగా. ఇప్పుడిది ప్రపంచ వ్యాప్తంగా జనాదరణ పొందింది. ఒకరు లేదా ఇద్దరు కలిసి మూడు నిమిషాల పాటు ఒకేలా ఆసనాలు వేయడమే రిథమిక్‌ యోగా. ఇది మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. బరువును తగ్గిస్తుంది. 2022లో ఆదిలాబాద్‌ కుర్రాడు ప్రజ్యోత్‌సింగ్‌ చౌహాన్‌ దిల్లీలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో తెలంగాణ జట్టుతో కలిసి ఎర్రకోట వద్ద రిథమిక్‌ యోగాలో ప్రదర్శన ఇచ్చారు. 

సాధన చేసి.. శిక్షణ ఇస్తూ..

మంచిర్యాలకు చెందిన సంధ్య.. స్థానిక రెడ్డికాలనీ వేదికగా మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవాన్ని నిర్వహించిన మొదటి సంవత్సరం నుంచే ఈమె గురువు శ్రీనివాసరెడ్డి దగ్గర శిక్షణ తీసుకున్నారు. యోగా ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సు పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. యోగా సాధన, శిక్షణలో పదేళ్ల అనుభవం సాధించారు. ప్రస్తుతం కాలనీలోని మహిళలకు ఉదయం శిబిరం ఏర్పాటు చేసి ఆసనాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం 20 మందికి పైగా ఈమె నిర్వహించే శిబిరానికి హాజరై సాధన చేస్తున్నారు.  - మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్‌టుడే

ఆర్టిస్టిక్‌..  

వేగంగా యోగా చేయాలనుకున్న వారు ఇష్టపడేది ఈ ఆర్టిస్టిక్‌ యోగా. క్రీడలు, వ్యాయామం జోడించి చేసేది ఆసనాలు, ప్రాణాయామం, జంధాస్, క్రియ, ముద్ర తదితర ప్రక్రియలు చేస్తారు. ఆదరణ పొందుతున్న ఆధునిక యోగాల్లో ఇదొకటి. త్వరగా బరువు తగ్గే అవకాశం, మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారు.

అన్నదమ్ములిద్దరూ..  

వాంకిడి : యోగా గురువు బాబా రాందేవ్‌ కార్యక్రమాలు టీవీలో వీక్షించి యోగా సాధన చేస్తూ ప్రావీణ్యాన్ని సంపాదించారు.. వాంకిడి మండలం నార్లాపూర్‌ గ్రామానికి చెందిన పుండలిక్, డొడ్డాజీ సోదరులు. వృత్తి రీత్యా వ్యవసాయం కాగా దొరికిన సమయాల్లో యోగా సాధనచేస్తూ ఇతరులకు శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.  2014 నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పతంజలి శిక్షణాతరగతులకు వెళ్లారు. వీరి ప్రతిభను గుర్తించి జిల్లా ప్రచారక్‌లుగా ఎంపిక చేశారు. 

క్రీడగా గుర్తింపు.. 

కేంద్ర ప్రభుత్వం యోగాను 2020 డిసెంబరులో పూర్తిస్థాయి క్రీడగా గుర్తించి నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు క్రీడా కోటా కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎస్‌జీఎఫ్, అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాలతో పాటు విశ్వవిద్యాలయాల్లోనూ యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రజ్యోత్, భార్గవ్‌ గుజరాత్, గోవా ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయస్థాయి యోగా పోటీల్లో తెలంగాణ నుంచి రిథమిక్‌ యోగా క్రీడాంశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లా జట్టు ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించింది.

‘దైవాంశమైన ఆత్మను క్రమబద్ధంగా నియంత్రించటం ద్వారా బంధ విముక్తి పొంది  సమున్నత స్థితిఅష్టాంగ యోగాలు ఇవే.. 
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ ఎనిమిదింటిని రోజూ శాస్త్రీయ పద్ధతిలో చేస్తే ఆరోగ్యంగా ఉంటామని పతంజలి మహర్షి తాను రచించిన గ్రంథంలో పేర్కొన్నారు.
 - అరబిందో మహర్షి 


 ఒత్తిడి దూరం..

యోగాతోనే ఆరోగ్యం.. ఆనందం అంటుంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, శారీరక, మానసిక ఒత్తిడి దూరం చేస్తుందని చెబుతుంటారు యోగా నిపుణులు. ఆయా అంశాలపై ‘న్యూస్‌టుడే’ వంద మందితో సర్వే చేసింది. ఆ వివరాలు ఇలా.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని