logo

ఎన్‌ఎంఎంఎస్‌లో మస్కాపూర్‌ విద్యార్థుల ప్రతిభ

తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌)లను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

Updated : 22 Jun 2024 06:14 IST

నేడు టి-శాట్‌ నిపుణలో సక్సెస్‌ మీట్‌ ప్రత్యక్ష ప్రసారం 

మస్కాపూర్‌ ఉన్నత పాఠశాలలో ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ఖానాపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌)లను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోవడానికి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తద్వారా ఏటా సుమారు లక్ష మందికి ఉపకార వేతనాలను అందిస్తోంది. ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12వేల ఉపకార వేతనాలను అందిస్తారు. ఇలా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసేవరకు చెల్లిస్తారు.

సాధన చేస్తున్న విద్యార్థులు (పాతచిత్రం) 

ఉపాధ్యాయుల చొరవ

ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల చదువు, విజ్ఞానం, క్రీడలు, క్రమశిక్షణతో పాటు పోటీ పరీక్షలలో సైతం ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచి మన్ననలు పొందుతోంది. ఈ పాఠశాలలో 741 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఇర్రి నరేందర్‌రెడ్డి ప్రోత్సాహానికి ఉత్తమ ఉపాధ్యాయులు తోడయ్యారు. పాఠశాలకు పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఖాళీ సమయం వెచ్చించి ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేశారు. తల్లిదండ్రుల సహకారం, గ్రామస్థుల ప్రోత్సాహంతో ఉపాధ్యాయులు ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రణాళికాబద్ధంగా సిలబస్‌ పూర్తి చేసి పాఠశాలలోనే స్టడీ అవర్స్‌ నిర్వహించడం గమనార్హం. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ను  తొలుత ఉపాధ్యాయులే సమకూర్చారు. గమనించిన పోషకులు తాము సైతం అంటూ పరీక్షలు పూర్తయ్యే వరకూ అల్పాహారం సమకూర్చడం, తద్వారా విద్యార్థులు విజయం సాధించడంలో సఫలీకృతం అయ్యారు. పాఠశాల సమయానికంటే ముందు, తర్వాత.. సెలవు దినాలలో శ్రద్ధతో ప్రత్యేక తరగతులను నిర్వహించారు. పాఠాల వారీగా ఉపాధ్యాయులు స్వయంగా తయారు చేసిన ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించడంతో అద్భుతమైన ఫలితాలు సాధించి మస్కాపూర్‌ పాఠశాల పేరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర స్ధాయిలో సైతం మార్మోగించారు. 2018-19 నుంచి 2023-24 విద్యా సంవత్సరం వరకు వరుసగా ఆరు సార్లు జిల్లాలో మస్కాపూర్‌ ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం సంపాదించింది. 2020-21 సంవత్సరంలో 24 మంది ఎంపికతో రాష్ట్రంలోనే మొదటి స్థానం సంపాదించింది. 2023-24 విద్యా సంవత్సరంలో 19మంది ఎంపికతో నిర్మల్‌ జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది. ఈ ఒక్క పాఠశాల నుంచే ఇప్పటి వరకు 113 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపిక కావడం అభినందించాల్సిన విషయం. మస్కాపూర్‌ ఉన్నత పాఠశాలలో ఎన్‌ఎంఎంఎస్‌కు 19మంది విద్యార్థులు ఎంపికైన సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఇర్రి నరేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు కుర్ర శేఖర్, జాడి శ్రీనివాస్, తొంటి శంకర్, వెన్నం అంజయ్య, కందూరి శ్రీనివాస్‌లతో ఎన్‌ఎంఎంఎస్‌ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమం ‘టి-శాట్‌ నిపుణ’లో సీఈవో బోదనపెల్లి వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని