logo

సందేశమా.. సహజమా..!

పోలీసుల్లో సాధారణంగా బదిలీలు తక్కువగా కనిపిస్తుంటాయి. కనీసం రెండేళ్ల ఉద్యోగకాలం పూర్తిచేసుకున్న అధికారులకు బదిలీలు సహజం. ఈ క్రమంలో ఎవరైనా రాజకీయంగానో, మరే రకంగానో పైరవీలు చేసుకుంటే ఈ గడువు ఇంకాస్త పెరుగుతుంటుంది.

Updated : 22 Jun 2024 06:12 IST

పోలీసు శాఖలో ఆకస్మిక స్థానచలనాలు

జిల్లా పోలీసు కార్యాలయం

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: పోలీసుల్లో సాధారణంగా బదిలీలు తక్కువగా కనిపిస్తుంటాయి. కనీసం రెండేళ్ల ఉద్యోగకాలం పూర్తిచేసుకున్న అధికారులకు బదిలీలు సహజం. ఈ క్రమంలో ఎవరైనా రాజకీయంగానో, మరే రకంగానో పైరవీలు చేసుకుంటే ఈ గడువు ఇంకాస్త పెరుగుతుంటుంది. అయితే.. జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆకస్మిక స్థానచలనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శాఖాపరంగా ఇది అంతర్లీన అంశమా, లేక పనితీరులో అలసత్వం వహిస్తున్న సిబ్బందికి ఓ   హెచ్చరిక సందేశమా అనే సంశయం స్థానికంగా రేకెత్తుతోంది. విషయం ఏదైనా.. గతంలో ఎన్నడూ లేనిరీతిలో పోలీసు ఉద్యోగుల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుండటం స్థానికుల్లోనూ ఓ రకంగా శాఖ పనితీరుపై భరోసా మరింత పెరిగేందుకు ఊతమిస్తోంది.

కొద్ది రోజుల క్రితం అన్ని విభాగాల్లోనూ..

జిల్లా పోలీసు అధికారిగా జి.జానకి షర్మిల బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే తమ పనితీరును అమల్లోకి తీసుకొచ్చారు. జిల్లా అంతటా అప్పటికే ఉన్న ఎస్సైలు, సీఐలు, ఏఎస్సై నుంచి హోంగార్డు వరకు.. అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారం, వారి పనితీరును కూలంకశంగా గమనించారు. స్థానికంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని వివిధ విభాగాల్లో పాతుకుపోయిన వారిని, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వచ్చేలా వ్యవహరిస్తున్న ఉద్యోగులను చాలామందిని మార్పుచేశారు. ఎంటీ విభాగం, స్పెషల్‌ బ్రాంచి, సీసీఎస్, పెట్రోకార్, కోర్టు డ్యూటీ, అధికారుల క్యాంపు కార్యాలయాలు, నివాసగృహాలు, ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది.. ఇలా వివిధ చోట్ల పనిచేస్తున్న వారిని అటూఇటూ మార్పు చేశారు. జిల్లాకేంద్రంలో ప్రత్యేకంగా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ లేకపోవడంతో ఆ విభాగంలో పనిచేస్తున్న వారిని వారి వారి పోస్టులకు పంపించేశారు. కొందరు తమకు అనుకూలంగా ఉన్న చోట పనిచేసేందుకు రాజకీయంగా, ఇతర మార్గాల్లో పైరవీలు చేసి తెచ్చుకున్న డిప్యూటేషన్లు దాదాపు అన్నీ రద్దయ్యాయి. ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ కల్పించారో అక్కడే విధులు నిర్వహించాలని సూచించారు. 

ఉన్నట్టుండి.. 

కొద్దిరోజుల క్రితం నిర్మల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో పనిచేసే పలువురు ఎస్సైలు ఉన్నపళంగా స్థానచలనం పొందారు. ఇందులో మహిళా ఉద్యోగులు సైతం ఉండటం గమనార్హం. బదిలీ విషయమై ముందస్తు సమాచారమివ్వలేదు. అలాగని ఉద్యోగుల్లో అంతర్గత ప్రచారమేమీ జరగలేదు. సంబంధిత ఉద్యోగులకు ఆదేశాలు జారీ అవడం, వారు వెళ్లి కేటాయించిన చోట్ల విధుల్లో చేరడం అంతా నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఉన్నట్లుండి ఎందుకీ బదిలీలు జరిగాయో ఎవరికీ అంతుపట్టలేదు. ఒకవేళ బదిలీలు, సర్దుబాట్లున్నా పూర్తిస్థాయిలో జిల్లా అంతటా జరగాల్సి ఉన్నా.. కేవలం కొన్ని చోట్లకే ఇది పరిమితమవడం అనుమానాలకు కారణమైంది.

వైఖరి మార్చుకోవాలంటూ..?

నిర్మల్‌ సబ్‌ డివిజన్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొద్దిరోజుల క్రితం ఓ సంఘటన చోటుచేసుకుంది. చట్టపరంగా ఈ విషయమై కేసు నమోదుచేయాల్సి ఉన్నా.. సదరు ఎస్సై తాత్సారం చేయడం ఉన్నతాధికారులను ఆగ్రహానికి గురిచేసింది. శాఖ పనితీరుపై ప్రజల్లో తప్పుడు సంకేతాలిచ్చే రీతిలో వ్యవహరించడం సరికాదనే భావనతో సదరు ఉద్యోగికి స్థానచలనం కలిగించారు. అదే రీతిలో దాదాపు మూడునెలల క్రితం మరో ఎస్సైని సైతం స్టేషన్‌ మార్చారు. పనితీరు బాగాలేకపోవడంతో ఉన్నతాధికారి హెచ్చరించారు. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. దీంతో మరో స్టేషన్‌కు మార్చారు. ఈ క్రమంలో జరిగిన విచారణ, జిల్లా పోలీసు అధికారి నివేదిక ఆధారంగా సదరు ఎస్సైని సస్పెండ్‌ చేయడం గమనార్హం. ఇలా ఒకరిద్దరు కాదు.. పలు సందర్భాల్లో ఉద్యోగులకు స్థానికంగా మారుస్తూ పనితీరు మెరుగుపర్చుకోవాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచిస్తున్నారు. విధి నిర్వహణకు కట్టుబడినవారికి సహకరిస్తూనే, అలసత్వం వహిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలకూ వెనుకాడటం లేదు.

ఉద్యోగుల్లో కలకలం..

గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నతాధికారి పర్యవేక్షణ పెరగడం, స్టేషన్ల తనిఖీలు విస్తృతమవుతుండటంతో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. విధి నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తున్న వారంతా ఈ పరిణామాలను ఆహ్వానిస్తుండగా, ఉద్యోగ బాధ్యతల్లో అలసత్వం వహిస్తున్న వారిలో ఆందోళన రేకెత్తుతోంది. పొరపాట్లు జరిగితే శాఖాపరంగా ఎప్పుడు ఎలాంటి చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని