logo

చరిత్ర ఘనం.. ఆగాలి గనుల వేలం

కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల చట్టం 2015లో మార్పులు చేసిన అనంతరం సింగరేణి మనుగడకు ఇబ్బందులు మొదలయ్యాయి. గతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తరించి ఉన్న బొగ్గు నిల్వల్ని వెలికితీయడానికి సింగరేణికి మాత్రమే హక్కు ఉండేది.

Published : 22 Jun 2024 02:29 IST

సింగరేణి భవితవ్యాన్ని కాపాడాలంటున్న కార్మికవర్గం   

శ్రావణపల్లి గ్రామం 

న్యూస్‌టుడే, మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల చట్టం 2015లో మార్పులు చేసిన అనంతరం సింగరేణి మనుగడకు ఇబ్బందులు మొదలయ్యాయి. గతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తరించి ఉన్న బొగ్గు నిల్వల్ని వెలికితీయడానికి సింగరేణికి మాత్రమే హక్కు ఉండేది. 1952 నాటి గనుల చట్టాన్ని సవరిస్తూ, గనులను వేలం ద్వారా ఎవరైనా దక్కించుకోవచ్చని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త చట్టం ప్రకారం సింగరేణి ఒడిశాలోని న్యూ పాత్రపద ప్రాజెక్టును వేలం ద్వారా దక్కించుకున్నప్పటికీ దాన్ని వద్దనుకుంది. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకుల వేలానికి వచ్చేసరికి సింగరేణికి స్వేచ్ఛ లేకుండా పోయింది. వేలంలో పాల్గొనాలని కొందరు, వద్దని మరికొందరు చెబుతుండటంతో సింగరేణి ప్రైవేటీకరణ, భవిష్యత్తుపై కార్మికవర్గంలో చర్చ జరుగుతోంది. గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని సంస్థ భవితవ్యాన్ని కాపాడాలని కార్మికవర్గం కోరుకుంటోంది.

రెండేళ్ల కింద ఖమ్మం జిల్లా పరిధిలోని కోయగూడెం-3 ప్రాజెక్టు కోసం కేంద్రం 2022 సెస్టెంబరులో వేలం వేస్తే, సింగరేణి పాల్గొనకపోవడంతో దాన్ని ఆరో కోల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. ఆ తర్వాత వేసిన మంచిర్యాల జిల్లా పరిధిలోని బొగ్గు బ్లాకులు వాణిజ్యపరంగా అనుకూలం కాదనే ఉద్దేశంతో ప్రైవేటు సంస్థలు పాల్గొనలేదు. కేంద్రంలో మూడోసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన జి.కిషన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో గనుల వేలం, ప్రైవేటీకరణ అంశాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు బ్లాకు గురించి 20 ఏళ్లుగా చర్చ జరుగుతోంది. సింగరేణి ఈ బొగ్గు బ్లాకును వదులుకోవాలని గతంలో నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సింగరేణి విధానాల్లోనూ మార్పులు వచ్చాయి. చట్ట ప్రకారం వేలంలో పాల్గొనకుండా ఉంటే, ఇతర ప్రైవేటు సంస్థలు బొగ్గు బ్లాకులు దక్కించుకుంటే, కోయగూడం తరహాలో ఉన్న బొగ్గు నిక్షేపాలు చేజారిపోతాయనే ఉద్దేశంతో యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన వేలంలో పాల్గొన్నట్లు సమాచారం. 

శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్‌లో ముంపునకు గురికానున్న మామిడి తోటలు  

వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు

సింగరేణిలోని ఐఎన్టీయూసీ, బీఎంఎస్‌ మినహా, ఇతర కార్మిక సంఘాలన్నీ వేలంలో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అనుభవం లేని ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాకులను కట్టబెట్టకుండా, సింగరేణికి ఉన్న అనుభవం, తెలంగాణలో ఉన్న బొగ్గు గనుల చరిత్రను పరిగణనలోకి తీసుకుని నేరుగా బొగ్గు బ్లాకులను కేటాయించాలని ఏఐటీయూసీ, తెబొగకాసం, హెచ్చెమ్మెస్‌ లాంటి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వేలంలో పాల్గొనకుంటే బొగ్గు గనులు ఒక్కటొక్కటీ ప్రైవేటుపరం అవుతుంటాయని కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్టీయూసీ అభిప్రాయపడుతోంది. గతంలో కేంద్రం గనుల ప్రైవేటీకరణ కోసం 2015లో చట్టాన్ని చేసినప్పుడు సమర్థించిన భారాస ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నిస్తోంది. తాడిచర్ల బొగ్గు బ్లాకు సింగరేణి కాకుండా ఏఎంఆర్‌ సంస్థ ఎలా బొగ్గు వెలికి తీస్తుందని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బి.జనక్‌ప్రసాద్‌ ప్రశ్నించారు. లాభాల్లో నడుస్తున్న కోల్‌ ఇండియా, సింగరేణిలకే బొగ్గు గనుల తవ్వకం హక్కులు కల్పించాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య కోరారు. వేలం విధానాన్ని కోల్‌ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో రద్దుచేసి నేరుగా కేటాయించిన దాఖలాలు ఉన్నాయని, అదే తరహాలో సింగరేణికి కేటాయించాలని ఏఐటీయూసీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

బొగ్గు చుట్టూ రాజకీయాలు 

గనుల చట్టం ప్రకారం కొత్త గనుల తవ్వకానికి బహిరంగంగా వేలం వేస్తూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించడంతో సింగరేణి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. విశిష్ట చరిత్ర కలిగిన సింగరేణి వారసత్వాన్ని కొనసాగించాలంటే, కేంద్రం తెలంగాణలోని బొగ్గు గనులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగనులు రాక సింగరేణిలో ఉన్న గనుల్లో నిక్షేపాలు మరింత లోతుల్లోకి వెళ్తుండటంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఉన్న నిల్వలు అంతరించి గనులు మూతపడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని