logo

కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న విభేదాలు

అసెంబ్లీ, లోక్‌సభ.. ఎన్నికేదైనా.. కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా కంచుకోటగా ఉంటుంది. ఇటీవల ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలో అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 27 వేల ఓట్లు ఆధిక్యం సాధించారు.

Updated : 22 Jun 2024 06:13 IST

మార్కెట్ కమిటీల ప్రతిపాదనలతో బయటపడుతున్న తీరు

ఈనాడు, ఆసిఫాబాద్‌ : అసెంబ్లీ, లోక్‌సభ.. ఎన్నికేదైనా.. కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా కంచుకోటగా ఉంటుంది. ఇటీవల ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలో అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 27 వేల ఓట్లు ఆధిక్యం సాధించారు. 2018 ఎన్నికల్లో సైతం రాష్ట్రవ్యాప్తంగా భారాస ధాటిని తట్టుకుని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇక్కడ గెలుపొందారు. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి టికెట్ విషయం అనేక మలుపులు తిరిగి చివరికి అజ్మీరా శ్యామ్‌నాయక్‌కు ఇచ్చారు. ప్రచారం సాగే సమయం నుంచే శ్యామ్‌నాయక్‌ వర్గం, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌ల మధ్య పొరపచ్చాలు వచ్చాయి. వీటిని అధిష్ఠానం ఎప్పటికప్పుడు సద్దుమణిగేలా చేసినా.. లోక్‌సభ ఎన్నికల అనంతరం తీవ్రరూపం దాల్చాయి. 

జిల్లాలో మూడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కాగజ్‌నగర్‌కు సంబంధించి ఛైర్మన్‌తోపాటు సభ్యుల ఎన్నిక పూర్తయింది. అయితే ఆసిఫాబాద్, జైనూర్‌ మార్కెట్ కమిటీ ఛైర్మన్, సభ్యుల ఎన్నిక పట్ల విశ్వప్రసాద్‌ వర్గం, అజ్మీరా శ్యామ్‌నాయక్‌ వర్గం ఎవరికి వారే ప్రతిపాదనలను వేర్వేరు పేర్లతో మంత్రి సీతక్కకు అందించడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఛైర్మన్‌లు ఎవరో తేలనుంది. అజ్మీరా వర్గం నుంచి ఆసిఫాబాద్‌కు ఇరుకుళ్ల మంగ ఛైర్మన్‌గా జైనూర్‌కు డేక్రే సుభాష్‌తోపాటు 17 మంది పేర్లు ప్రతిపాదించగా, విశ్వప్రసాద్‌ వర్గం నుంచి ఆసిఫాబాద్‌ మార్కెట్ అధ్యక్షులుగా జువ్వానీ జ్యోతి, జైనూర్‌కు మరో వ్యక్తిని ఇవ్వాలని మంత్రికి ప్రతిపాదించారు. 

కాగజ్‌నగర్‌ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప వర్గం, జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ మధ్య సఖ్యత ఉండటంతో  మార్కెట్ పదవుల కేటాయింపుల్లో ఎలాంటి వివాదం ఏర్పడలేదు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా మార్కెట్ కమిటీ అధ్యక్షులు, సభ్యుల పేర్లు అజ్మీరా వర్గం ప్రతిపాదనలు పంపిందని విశ్వప్రసాద్‌ మద్దతుదారులు అంటున్నారు. ఆయనకు చెప్పి సామాజిక వర్గాలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని అజ్మీరా సంబంధీకులు చెబుతున్నారు. మరోవైపు విశ్వప్రసాద్‌ మద్దతుదారులకే మార్కెట్ పదవులు దక్కుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

సామాజిక మాధ్యమాలే వేదికగా...

అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడు నెలల అనంతరం అజ్మీరా శ్యామ్‌నాయక్‌ ఓటమికి ఆ పార్టీలో కొంతమంది నేతలే కారణమనే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఓ మాజీ ఎమ్మెల్సీ సహకారంతో భారాస నేతను గెలిపించడానికి డబ్బుల ఆశతో అజ్మీరా ఓటమికి వీరంతా తెరవెనుక పనిచేశారనే సారాంశం ఈ పోస్టుల్లో కనిపిస్తోంది. కానీ అటువంటిది ఏం లేదని అప్పుడున్న సామాజిక సమీకరణాలతో ఓడిపోయారని, సదరు నేత ఒంటెద్దు పోకడలే పరాజయానికి దారి తీశాయని, ఇప్పటికీ అదే తీరున వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థివర్గం వారు వాదిస్తున్నారు. లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పార్టీ ఓటమికిగల కారణాలను ఎవరికివారు క్షుణ్నంగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని