logo

మాధ్యమిక విద్య.. సౌకర్యాలు మిథ్య!

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మాధ్యమిక విద్య (ఇంటర్‌) అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం మండలాల వారీగా ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేసినప్పటికీ సౌకర్యాల కల్పనలో విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 22 Jun 2024 06:11 IST

చాలీచాలని వసతులు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, వాంకిడి: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మాధ్యమిక విద్య (ఇంటర్‌) అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం మండలాల వారీగా ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేసినప్పటికీ సౌకర్యాల కల్పనలో విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో చదివే విద్యార్థులు చాలీచాలని వసతులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి. దీంతో ప్రైవేటు విద్యార్థులతో పోటీపడలేకపోతున్నారు. 
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు దాదాపు 5వేల మందివరకు చదువుతున్నారు. కళాశాలలకు ప్రత్యేక భవనాలు ఉన్నప్పటికీ పెరుగుతున్న ప్రవేశాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పన జరగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా తరగతి గదులు, శౌచాలయాల కొరత, తాగునీటి వసతుల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, మూత్రశాలలు అంతమాత్రంగానే ఉండడంతో.. విద్యార్థినుల ఇబ్బందులు వర్ణణాతీతం.

గదుల కొరత

వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకుగాను ఎనిమిది తరగతి గదులు ఉన్నాయి. గదులు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని తరగతులను వరండాలో నిర్వహించాల్సి వస్తోంది. అదనంగా మరో ఆరు గదులు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆట స్థలం ఉన్నప్పటికీ ప్రహరీ లేకపోవడంతో పశువుల సంచారంతో అపరిశుభ్రంగా మారుతోంది. రెండు మరుగుదొడ్లు, రెండు మూత్రశాలలు మాత్రమే ఉండగా.. విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల అధ్యాపక బృందంతోపాటు, సిబ్బందికీ తిప్పలు తప్పడం లేదు.

కుంగిన గచ్చు..

రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది. కళాశాల గ్రామానికి దూరంగా ఉంది, ప్రహరీ నిర్మాణం లేదు. కళాశాలలోని వరండా గచ్చు కుంగిపోయి ప్రమాదకరంగా తయారైంది. విషపురుగులకు నిలయంగా మారింది. విద్యార్థులు భయం భయంగా చదువుతున్నారు. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులతోపాటు వొకేషనల్‌ కోర్సు ఉంది. గదుల కొరత తీవ్రంగా ఉండడంతో.. ఒక్కో గదిలో రెండు తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తొమ్మిది గదులు ఉండగా మరో 21 గదులు అవసరం ఉంది. శుద్ధ జలయంత్రం పనిచేయక పోవడంతో చేతిపంపును ఆశ్రయిస్తున్నారు.

శుద్ధజలయంత్రం నిరుపయోగం

బెజ్జూరు మండల కేంద్రంలోని కళాశాలలో శుద్ధ జలయంత్రం మూలకు చేరడంతో విద్యార్థులు చేతిపంపు నీటిని తాగుతున్నారు.  మరుగుదొడ్లకు నీటివసతి లేక అవి నిరుపయోగంగా తయారయ్యాయి. కళాశాల చుట్టూ ప్రహరీ లేకపోవడం, పశువుల సంచారంతో ఆవరణలో అపరిశుభ్రత నెలకొంటోంది. 

బెజ్జూరులో నీటివసతి లేక నిరుపయోగంగా మరుగుదొడ్లు

మరమ్మతులకు దూరం

దహెగాం మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిపడా ఉన్నప్పటికీ మరమ్మతులకు లేక నిరుపయోగంగా తయారయ్యాయి. మరుగుదొడ్లు, మూత్రశాల గదుల తలుపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తోంది. ప్రధానంగా విద్యార్థినులకు తిప్పలు తప్పడం లేదు. 

 

ప్రతిపాదనలు పంపాం

నైతం శంకర్, డీఐఈఓ

ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కాగజ్‌నగర్, కౌటాల, జైనూరు కళాశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు అవసరం ఉంది. ఇటీవల ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. క్రీడా స్థలాలు, ప్రహరీల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు