logo

సృజనాత్మకత పెంపొందించేలా.. ఆహ్లాదం పంచేలా

పాఠ్య, రాతపుస్తకాల బ్యాగుల మోత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వెన్నెముకకు సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి.

Published : 22 Jun 2024 02:46 IST

నాలుగో శనివారం.. బడి సంచులకు విరామం

బోధనోపకరణాలతో విద్యార్థులు

నిర్మల్‌ అర్బన్, న్యూస్‌టుడే: పాఠ్య, రాతపుస్తకాల బ్యాగుల మోత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వెన్నెముకకు సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ విద్య అందించే దిశగా కొన్ని విద్యాలయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రత్యేక తరగతుల పేరిట విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. పిల్లలో దాగి ఉన్న కళ, సృజనాత్మకత వంటి పెంపుదలకు ఎలాంటి ప్రోత్సాహం కల్పించడం లేదు. ఫలితంగా బయటి ప్రపంచం వారికి దూరమవుతోంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

ప్రతి నెల నాలుగో శనివారం

విద్యార్థుల ప్రగతి, పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులు, పోషకుల భాగస్వామ్యం కోసం ప్రతి నెలా మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహిస్తున్నారు. దానిని కొనసాగిస్తూనే నాలుగో శనివారం పాఠ్య, రాత పుస్తకాల బ్యాగులకు విరామం కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు విద్యాసంవత్సరం కాలసూచీని ఇప్పటికే విడుదల చేశారు. బ్యాగుల మోత నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యం చదవడం, రాయడం, ప్రత్యేక తరగతులు వంటి వాటితో శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు గురవుతున్నారు. అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి నాలుగో శనివారం ‘నో బ్యాగ్‌ డే’గా అమలు చేస్తున్నారు.

వివిధ అంశాలపై..

బ్యాగుల విరామం కార్యక్రమాన్ని దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కారు, విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ‘నో బ్యాగ్‌ డే’ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఎస్‌సీఈఆర్టీ ప్రత్యేక బుక్‌లెట్‌ను రూపొందించింది. ఇందులో 28 అంశాలను పొందుపర్చింది. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను పెంపొందించేలా నాటికలు, నృత్యం, బాలసభ నిర్వహణ, ప్రయోగాత్మకంగా ఆలోచింపజేసేలా నూతన ఆవిష్కరణల దిశగా వారిని తీర్చిదిద్దాలి. క్షేత్రస్థాయి సందర్శనల్లో భాగంగా చారిత్రాత్మక ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, పురపాలికల పాలనాపరమైన వాటిపై వారికి అవగాహన పెంపొందించడం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, నమూనా ఎన్నికలు వంటివి  నిర్వహించాలని అందులో సూచించారు. మొత్తంగా ఆ రోజంతా విద్యార్థులు ఆహ్లాదకరంగా గడిపేలా మార్గనిర్దేశం చేశారు. 

పిల్లల వికాసం కోసం..: 

ఎ.రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి, నిర్మల్‌

విద్యాభ్యాసంతోపాటు బయటి ప్రపంచంతోనూ వారికి పరిచయం, వారిలోని మేధాసంపత్తి పెంపునకు ఈ కార్యక్రమం దోహదం చేయనుంది. పిల్లల్లో సృజనాత్మకత వికాసం కోసం తోడ్పడనుంది. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించిన అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేశాం. ఈ కార్యక్రమంతో పిల్లల్లో ఒత్తిడి తగ్గి, నూతన ఆవిష్కరణలు చేసేలా, వారిలోని ప్రతిభ వెలికితీయడానికి ఇది ఒక మంచి మార్గం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని