logo

ఉద్యోగమే లక్ష్యం.. చదువే ఉద్యమం

పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ.. ప్రతి రోజు ఓ తపస్సులా సాధనలో నిమగ్నమైతే తప్ప ప్రభుత్వ కొలువులు సాధించలేని పరిస్థితి. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తేనే అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు అవకాశముంది.

Updated : 22 Jun 2024 06:05 IST

ఉచిత శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌ : పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ.. ప్రతి రోజు ఓ తపస్సులా సాధనలో నిమగ్నమైతే తప్ప ప్రభుత్వ కొలువులు సాధించలేని పరిస్థితి. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తేనే అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనల నేపథ్యంలో నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాల బాట పట్టారు. పట్టణం నుంచే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, జిల్లా కేంద్ర గ్రంథాలయాలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో కళకళలాడుతున్నాయి. 

హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలో రూ.వేలు ఖర్చు చేసే బదులు ఆ స్థాయిలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం, మంచి వసతులుండటం, స్టడీ మెటీరియల్‌ను సైతం ఇస్తుండటంతో స్థానిక స్టడీ సర్కిళ్లలో అందుతున్న సేవలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం కొన్ని పోటీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్‌-1 మెయిన్స్‌తో పాటు గ్రూప్‌-2, గ్రూప్‌-3, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసు అయిన స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌కు సంబంధించిన ఉద్యోగాలు, ఈఏపీసెట్, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు సైతం పలువురు ముందస్తుగా సన్నద్ధమవుతున్నారు. ఎలాగైనా లక్ష్యం చేరాలన్న కసితో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

ప్రశాంత వాతావరణంలో..  

డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పట్టుదలతో చదువుతున్నారు ఆదిలాబాద్‌ పట్టణం టీచర్స్‌ కాలనీకి చెందిన సుమలత. ప్రశాంత వాతావరణం ఉండటంతో రోజూ బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలోని గ్రంథాలయానికి వచ్చి చదువుకోవడం ఒక దినచర్యగా మార్చుకున్నారు.

సాధనలో అందరూ స్నేహితులే

దూరప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగ యువకులు ఉదయం లంచ్‌ బాక్సు పట్టుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయనికి వస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే కావడం, రోజూ గ్రంథాలయానికి రావడంతో కొన్ని పరిచయాలు స్నేహాలుగా మారుతున్నాయి. మధ్యాహ్నం పూట ఇలా అందరూ ఒకచోట కూర్చుని ఉద్యోగ సాధనకు సంబంధించిన వివరాలను ఒకరికొకరు చర్చించుకుంటూ సంతోషంగా భోజనం చేసి మళ్లీ సాధనలో నిమగ్నమవుతారు. రాత్రి గ్రంథాలయం మూసేదాకా చదువుకుని ఇంటి బాట పడుతున్నారు.

మూడు నెలలుగా..  

నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలానికి చెందిన ఈయన పేరు ఎం.కిశోర్‌ కుమార్‌. ఈయనకు ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఇంటి వద్దనే డీఎస్సీకి సన్నద్ధమవుతుండగా ఈయన మూడు నెలలుగా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్‌ ఉద్యోగాలకు సంబంధించిన పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

బీసీ స్టడీ సర్కిల్‌లో

ఆదిలాబాద్‌ పట్టణంలో బీసీ స్టడీ సర్కిల్‌కు విశాలమైన భవన సముదాయం ఉండటం నిరుద్యోగ యువతకు వరంగా మారింది. రూ.3.06 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో అన్ని వసతులు ఉన్నాయి. ఇందులో ఉచిత శిక్షణ పొందిన 325 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం 250 మంది వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరో 250 మంది చదువుకునేందుకు వసతులున్నాయని, ఆసక్తి ఉన్న వారెవరైనా వచ్చి చదువుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ జి.ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

ఎస్సీ స్టడీ.. 

పట్టణంలోని రాంనగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఎస్సీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో సుమారు వంద మంది వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. డీఎస్సీ, గ్రూప్స్, ఫౌండేషన్‌ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు అభ్యసన సామగ్రిని అందజేస్తున్నారు. ఇప్పటిదాకా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన వారిలో ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, ఎఫ్‌బీఓ, ఎఫ్‌ఎస్‌ఓ, జేపీఎస్, విద్యుత్తు, గ్రూప్‌-4, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 180 మంది కొలువులు సాధించినట్లు ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రమేష్‌ తెలిపారు. 

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో..

జిల్లాకేంద్రం గ్రంథాలయం నిరుద్యోగుల రాకపోకలతో నిత్యం సందడిగా మారింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. నిత్యం నిరుద్యోగులు వస్తుండటంతో రెండేళ్లుగా గ్రంథాలయానికి సెలవు సైతం ఇవ్వడం లేదని సిబ్బంది పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఉండటంతో ముందుగా వచ్చి చదువుకునేందుకు పోటీపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు లంచ్‌ బాక్సులు తెచ్చుకుని అక్కడే తిని మళ్లీ సాధనలో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం భవనం సరిపోవడం లేదని నిర్మాణ పనులను విస్తరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

కొలువు సాధించడం ధ్యేయం

ఈయన పేరు వాఘ్మారే కపిల్‌. నిర్మల్‌ జిల్లా తానూరు మండలవాసి. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ధ్యేయంగా నిర్మల్‌ జిల్లా నుంచి వచ్చి ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ పొందుతున్నారు. గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాల్లో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఏడాదిగా అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నారు.

పిల్లలను తల్లి వద్దే ఉంచి.. 

మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట నుంచి వచ్చి ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ తీసుకుంటున్న ఈమె పేరు యు.రవళి. ఇద్దరు పిల్లలున్నా తల్లివద్ద ఉంచి భర్త, కుటుంబీకుల సహకారంతో రెండు నెలలుగా గ్రూప్‌-2 ఉద్యోగ సాధనలో  నిమగ్నమయ్యారు.

వసతులు బాగున్నాయి..

ఈమె పేరు పల్లవి. గుడిహత్నూర్‌ నుంచి జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయానికి వచ్చి గ్రూప్స్‌ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా చదువుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రశాంత వాతావరణం, మంచి వసతులు ఉండటంతో సాధన బాగా జరుగుతోందని పేర్కొన్నారు.

సాధనలో నిమగ్నం..  

ఆదిలాబాద్‌ పట్టణంలోని సుభాష్‌నగర్‌ కాలనీకి చెందిన ఈయన పేరు సృజన్‌ కుమార్‌. కేంద్ర సర్వీసు అయిన స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌లో కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి(సీజీఎల్‌) ఉద్యోగాన్ని సాధించేందుకు కొంతకాలంగా బీసీ స్టడీ సర్కిల్‌కు వచ్చి సాధనలో నిమగ్నమయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని