logo

ఆఖరి సమావేశం.. అటవీ అడ్డంకులే లక్ష్యం

జిల్లా పరిషత్‌ పాలకవర్గం పదవీకాలం ముగియనుండడంతో శుక్రవారం చివరి సమావేశం అన్నట్లుగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉదయం హుషారుగా సాగగా.. మధ్యాహ్నం సభ్యులు రాకపోవడంతో మమ అనిపించారు.

Published : 22 Jun 2024 03:00 IST

ఉదయం హుషారు.. మధ్నాహ్నం మందకొడి జడ్పీభేటీ..

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్,
చిత్రంలో సీఈఓ రత్నమాల, కలెక్టర్‌ రాజర్షిషా, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్‌పాటిల్‌  

ఆదిలాబాద్‌ పట్టణం, ఆదిలాబాద్‌ అర్బన్, న్యూస్‌టుడే : జిల్లా పరిషత్‌ పాలకవర్గం పదవీకాలం ముగియనుండడంతో శుక్రవారం చివరి సమావేశం అన్నట్లుగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉదయం హుషారుగా సాగగా.. మధ్యాహ్నం సభ్యులు రాకపోవడంతో మమ అనిపించారు. సభ్యులంతా కలిసికట్టుగా తమ సమస్యలను వినిపించారు. కొన్ని శాఖల అధికారుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. కొందరు అధికారులను పొగడ్తలతో ముంచెత్తారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన సమావేశానికి సభ్యులు ఆరేడుగురు మాత్రమే హాజరవడంతో చేసేది లేక అధికారులు ధన్యవాదాలు తెలుపుతూ ముగించారు.

ఆదిలాబాద్‌ జడ్పీ సమావేశ హాలులో జడ్పీ ఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌ అధ్యక్షత శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, అనిల్‌ జాదవ్, కోవలక్ష్మి, కలెక్టర్‌ రాజర్షిషా, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్‌ పాటిల్, జడ్పీ సీఈఓ రత్నమాల హాజరయ్యారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగిన సమావేశంలో సభ్యులు సమస్యలు వినిపిస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ సంధ్యారాణి మాట్లాడుతూ బోథ్‌ ఎక్స్‌రోడ్డు నుంచి బోథ్‌ పట్టణం వరకు ఉన్న రహదారి మరమ్మతు పనులకు అటవీ అధికారులు అడ్డుచెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే విషయంలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ జోక్యం చేసుకొని బోథ్‌ రోడ్డులో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రఘునందన్‌పూర్‌ గ్రామంలో స్థానికులంతా కలిసి తాగడం కోసం బోరు వేసుకుంటే అటవీ అధికారులు ఎలా అడ్డుచెబుతారని ఎమ్మెల్యే మండిపడ్డారు. జిల్లాలో అటవీ అడ్డంకులు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే శంకర్‌ పేర్కొన్నారు. మొత్తం జాబితా ఇస్తూ కారణాలు తెలిపితే తాము హైదరాబాద్‌ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు. శాఖల వారీగా ఎక్కడెక్కడ రహదారులు అటవీ సమస్యతో ఆగాయో తెలపాలని ఎంపీ గోడం నగేష్‌ సూచించడంతో అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కందకాలు, ఇతర పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అటవీ సిబ్బందే గుత్తేదారులుగా మారారని జడ్పీటీసీలు రాజు, సుధాకర్‌లు మండిపడ్డారు. అటవీ పనులపై విచారణ చేయించాల్సిన అవసరం ఉందని ఎంపీ సూచించారు. రైతుబంధు గతంలో సక్రమంగా విడుదలయ్యేదని ఇప్పటికి ఏ రైతు ఖాతాలో రూ.15 వేలు జమకాలేదని బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. జడ్పీటీసీ గణేష్‌రెడ్డి మాట్లాడుతూ తలమడుగు మండలం సుంకిడిలో ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరి పిల్లలకు ప్రమాదకరంగా మారిందని అయిదేళ్లుగా చెబుతున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జైనథ్‌ మండలం గిమ్మలో పదో తరగతి పరీక్షల సమయంలో గది పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలయ్యాయని, శిథిలావస్థలో ఉన్న అన్ని పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించాలని ఎంపీపీ మార్‌శెట్టి గోవర్ధన్‌ కోరారు. గుడిహత్నూర్‌ పాఠశాలకు 14 మంది ఉపాధ్యాయులు కావాల్సి ఉండగా అయిదుగురినే ఇస్తే పిల్లల చదువులెలా సాగుతాయని జడ్పీటీసీ బ్రహ్మానంద్‌ ప్రశ్నించారు. ‘మన ఊరు మన బడి’ కింద మంజూరైన పనులను మధ్యలోనే వదిలిస్తే వాటిని ఎవరూ పూర్తి చేస్తారో చెప్పాలని జడ్పీటీసీ రాజు ప్రశ్నించారు. ఉట్నూరు జడ్పీటీసీ చారులత మాట్లాడుతూ.. ఉట్నూరు కేంద్రంగా గిరిజన విద్యార్థులకు డైట్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, కేబీ కాంప్లెక్స్‌లోని బీఈడీ కళాశాలలో పని చేస్తున్న వారికి పదోన్నతులు కల్పిస్తూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్, గాదిగూడ జడ్పీటీసీలు పుష్ప, మల్లెపూల నర్సయ్య, గంగుబాయిలు తమ మండల సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.

పాల్గొన్న ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు శంకర్, అనిల్‌ జాదవ్, సభ్యులు, అధికారులు

అధికారులు మనసులో ఏమీ ఉంచుకోకండి

భోజన విరామం అనంతరం ప్రారంభమైన సమావేశానికి ఆరేడుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇదే సమయంలో జిల్లా అధికారులు తమ మనసుల్లో ఏమీ ఉంచుకోవద్దని సభ్యులు సభాముఖంగా కోరారు. ప్రజల కోసమే అధికారులను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. అయిదేళ్లు తమకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జడ్పీ ఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌ ప్రకటించారు. రైతులకు సరిపడా విత్తనాలు అందేలా చేసినందుకు, ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించినందుకు, తపాలా శాఖ ద్వారా స్వాహా అయిన డబ్బులు రైతులకు తిరిగి ఇప్పించినందుకు కలెక్టర్‌ రాజర్షిషాకు ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, జడ్పీటీసీ గణేష్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

విమానాశ్రయ ఏర్పాటుకు భూసేకరణ 

గోడం నగేష్, ఎంపీ

జిల్లా కేంద్రంలో వాయుసేనకు చెందిన 369 ఎకరాల భూమి ఉంది. వైమానిక దళ శిక్షణ కేంద్రం కోసం అదనంగా మరో 1500 ఎకరాలు అవసరమని పదేళ్ల కిందటనే సర్వే చేశారు. ఇన్ని రోజులు రాష్ట్రంలోనే పెండింగ్‌ ఉంది. మళ్లీ ఆ ప్రతిపాదనలు తిరిగి పంపిస్తే ప్రక్రియను వేగవంతం చేస్తాం.

పీఆర్‌ రోడ్లను ఆర్‌అండ్‌బీకి మార్చండి 

పాయల్‌ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

జిల్లాలో అత్యవసరంగా నిర్మించాలనుకున్న పంచాయతీరాజ్‌ రహదారులను రోడ్లు భవనాల శాఖకు మార్చండి. తద్వారా కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించేందుకు ఆస్కారం ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఉన్న సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రిలో కార్పొరేట్‌ స్థాయి వసతులున్నా 80 శాతం మంది వైద్యులు లేరు. మెరుగైన వైద్యం కోసం ఆ పోస్టులు భర్తీ చేసేందుకు జడ్పీలో తీర్మానం చేయాలి. రైల్వే వంతెన బాధితులకు పరిహారం అందించాలి. 

ఐటీడీఏ పీఓ రాకుంటే ఎలా?

అనిల్‌ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్‌

జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలే అధికంగా. సమస్యలు వినిపించేందుకు వేదికైన జడ్పీ సమావేశానికి ఐటీడీఏ పీఓ రాకుంటే ఎలా? ఉట్నూరులో ఐటీడీఏ గవర్నింగ్‌ బాడీ సమావేశం నిర్వహించమంటే దానిపైనా నిర్లక్ష్యమే. మరి గిరిజనుల గోడు ఎవరికి చెప్పాలి. విద్యా శాఖకొస్తే ఆ శాఖ పనితీరు అధ్వానంగా ఉంది. అటవీ అధికారులు గిరిజనులను వేధించడం మానుకోవాలి. 

కెరమెరి రోడ్డు పూర్తయ్యేదెప్పుడో? 

కోవలక్ష్మి, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్‌

నేను 2014లో ఎమ్మెల్యేగా ఉన్నాను. ప్రస్తుత ఎంపీ ఆ సమయంలోనూ ఎంపీగా ఉన్నారు. ఇద్దరం కలిసి ఆదిలాబాద్‌ నుంచి కెరమెరి వయా అనార్‌పల్లి మీదుగా రెండు వరుసల రహదారి మంజూరు చేయించాం. ఇంకా పూర్తి కాలేదంటే అధికారులేం చేస్తున్నట్లు? మధ్యలోనే పని ఎందుకు ఆపేశారో స్పష్టత ఇవ్వాలి. నార్నూర్, గాదిగూడ మండలాల్లో లో లెవల్‌ వంతెనలు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం

రాజర్షిషా, కలెక్టర్‌ 

సభ్యుల పదవీకాలం ముగిసినా ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావొచ్చు. జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. మన ఊరు మన బడి కింద అసంపూర్తిగా ఉన్న పనులను స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌లోనూ కేటాయించవచ్చు. దీనికోసం సభ్యులు జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. అటవీ అనుమతులకోసం ఆగిన పనులపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు ముందుగానే నిర్ణయించాం. అందులో అన్నీ చర్చిస్తాం. రైతు బీమా చెల్లింపులు ఆలస్యమైతే ఏఈలను ఆదేశిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని