logo

పట్టుపట్టారు.. ఆర్జీయూకేటీ మెట్టెక్కారు

చదువుల తల్లి బాసర శ్రీసరస్వతి మాత సన్నిధిలోని ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఓ వరం. పదిలో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇక్కడ ఇంటర్మీడియట్‌తోపాటు ఇంజినీరింగ్‌ (ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌) చదువు అందిస్తుంది

Updated : 11 Jul 2024 06:22 IST

‘ఆదర్శ’ పాఠశాల నుంచి 15 మంది విద్యార్థుల ఎంపిక

కుంటాల, న్యూస్‌టుడే: చదువుల తల్లి బాసర శ్రీసరస్వతి మాత సన్నిధిలోని ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఓ వరం. పదిలో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇక్కడ ఇంటర్మీడియట్‌తోపాటు ఇంజినీరింగ్‌ (ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌) చదువు అందిస్తుంది. ప్రతిభ ఆధారంగా ఉమ్మడి జిల్లాకు చెందిన 131 విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. అందులో నిర్మల్‌ జిల్లా నుంచి 72 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఒకే పాఠశాల నుంచి 15 మంది కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం విశేషం.   

శాస్త్రవేత్తగా దేశ సేవ: మనిజశ్రీ, అంబకంటి

కుంటాల మండలం అంబకంటి చెందిన ఎ.మనిజశ్రీ పది వార్షిక పరీక్షల్లో 9.8 జీపీఏ సాధించింది. ఆర్‌జీయూకేటీ ప్రకటించిన మొదటి విడత జాబితాలో చోటు దక్కింది. ప్రాథమిక స్థాయి నుంచే ఉన్నత లక్ష్యంతో చదివింది. మొదటి నుంచి ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ కష్టపడింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా దేశానికి సేవ చేయాలని ఉందని గర్వంగా చెబుతోంది. 

సాంకేతిక రంగంలో..: నందిని, కుంటాల

కుంటాలకు చెందిన వై.నందిని 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 9.7 జీపీఏ సాధించింది. బాసర ఆర్‌జీయూకేటీలో మొదటి విడత జాబితాలో స్థానం దక్కింది. పట్టుదలతో చదివితే విజయం వరిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో మంచి బోధన ఉంటుందనేది మేము సాధించిన ఫలితాలే నిదర్శనమని ఆనందంగా చెబుతోంది. భవిష్యత్తులో సాంకేతిక రంగంలో రాణించేందుకు కృషి చేస్తానంటోంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవుతా: భువనేశ్వరి, బూర్గుపల్లి

నర్సాపూర్‌(జి) మండలం బూర్గుపల్లికి చెందిన పి.భువనేశ్వరి పదో తరగతి పరీక్షల్లో 9.8 జీపీఏతో ప్రతిభ కనబరిచింది. కుటుంబ సభ్యుల ఆశయంతో ముందు నుంచి చదువుపై దృష్టి సారించింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కావాలన్న పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివి సఫలమయ్యింది. స్థానికంగానే మాధ్యమిక, ఇంజినీరింగ్‌ కోర్సు చదివేందుకు అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తోంది. 

భవిష్యత్తుకు భరోసా..: కదం ధనశ్రీ, పెంచికల్‌పాడ్‌ 

కుంటాల మండలం పెంచికల్‌పాడ్‌ గ్రామానికి చెందిన ధనశ్రీ పదో తరగతిలో 9.8 జీపీఏతో ప్రతిభ కనబరిచింది. ఉపాధ్యాయులు, కుటుంబీకుల సహకారంతో సాధ్యమయ్యింది. బాసర విశ్వవిద్యాలయంలో సీటు రావడంతో భవిష్యత్తుకు భరోసా కలిగింది. ఆర్జీయూకేటీ వేదికగా ప్రయోగాలు, వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేస్తా. ఆచార్యుల సలహాలు, సూచనలతో ముందుకెళ్తానని చెబుతోంది. 

నూతన ఆవిష్కరణలకు..: అక్షిత్, గొల్లమాడ

నర్సాపూర్‌(జి) మండలం గొల్లమాడ వాసి డి.అక్షిత్‌ పది పరీక్షల్లో 9.8 జీపీఏ సాధించాడు. ప్రతి రోజు ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను ఇంటి వద్ద సాధన చేసేవాడు. బాసర విశ్వవిద్యాలయంలో సీటు సాధించడంతో భవిష్యత్తు లక్ష్యంపై దృష్టి సారిస్తానని, సాంకేతిక విద్య పూర్తి చేసి నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేస్తానంటున్నాడు.


క్రమశిక్షణతోనే చక్కటి ఫలితాలు: శ్రీనివాస్‌ప్రసాద్, ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కుంటాల 

విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే క్రమశిక్షణతో చదివితే చక్కటి ఫలితాలు సాధించవచ్చు. భవిష్యత్తు ప్రణాళిక ఉంటే ఆశయంతో ముందుకెళ్లేందుకు సులువుగా ఉంటుంది. ప్రతి అంశంపై పట్టుసాధిస్తే పరీక్షల్లో నెగ్గడం తేలికే. ఉమ్మడి జిల్లాలోనే మా పాఠశాలకు అత్యధికంగా 15 సీట్లు వచ్చాయి. నిరంతర పర్యవేక్షణతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల సమన్వయమే సత్ఫలితానికి దోహదపడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని