logo

Ts News: అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళల ఆందోళన

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. కట్టెల కోసం అడవిలోకి వెళ్తే దాడి చేశారని నలుగురు మహిళలు

Updated : 21 Jan 2022 22:06 IST

భద్రాద్రి‌: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. కట్టెల కోసం అడవిలోకి వెళ్తే దాడి చేశారని నలుగురు మహిళలు ఆరోపిస్తున్నారు. ముల్కలపల్లి మండలం సాకివాగు గుత్తికోయ గ్రామంలో నిన్న మధ్యాహ్నం చోటుచేసుకున్నట్లు భావిస్తున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ‘‘నిన్న మధ్యాహ్నం గుత్తికోయ గ్రామానికి చెందిన నలుగురు మహిళలు కట్టెల కోసం అడవిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్‌ ఆఫీసర్‌ మహేశ్‌.. అడవిలోకి ఎందుకు వచ్చారంటూ వారిని అక్కడనుంచి తరిమేశారు. వారిలో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. దుర్భాషలాడారు. మహిళలు పారిపోయే క్రమంలో నలుగురు మహిళల్లో ఒకరు అక్కడే ఉన్న గోతిలో పడిపోవడంతో ఆమె వస్త్రాలను కూడా లాగాడంటూ’’ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై మహిళలు ఎవరికీ చెప్పుకోలేదు. శుక్రవారం గ్రామానికి వెళ్లిన ముల్కలపల్లి మండలానికి చెందిన నాయకులతో మహిళలు చెప్పడంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అటవీ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఆదివాసీ మహిళలపై జరిగిన దాడిని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఖండించారు.ఆదివాసీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఆదివాసీ, గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై ముల్కలపల్లి అటవీశాఖ అధికారి రవికిరణ్‌ను సంప్రదించగా.. సాకివాగు అటవీ ప్రాంతంలో ఎటువంటి సంఘటన జరగలేదన్నారు. బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చిన కొంతమందిని కట్టెలు కొట్టవద్దని మహేశ్ హెచ్చరించిన మాట వాస్తవమేనన్నారు. మహిళలపై ఎలాంటి దాడికి పాల్పడలేదని.. వారి ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని