logo

Prasad Reddy: వైకాపా వీర విధేయుడిపై ‘వేటు’ పడనుందా..!

వైకాపా ప్రభుత్వ అండతో అయిదేళ్లపాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వర్సిటీకి వీసీననే సంగతి మరచిపోయి వైకాపాకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి.

Updated : 12 Jun 2024 08:56 IST

వీసీ ప్రసాదరెడ్డి హయాంలో వివాదాస్పద నిర్ణయాలెన్నో
విచారణ సాగితే వెలుగులోకి వాస్తవాలు

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వ అండతో అయిదేళ్లపాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వర్సిటీకి వీసీననే సంగతి మరచిపోయి వైకాపాకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అనేక నియామకాలు చేపట్టారనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో వైకాపా ఘోర పరాజయం పాలై.. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో వీసీపై విచారణ జరిపితే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యావేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఆయనపై చర్యలు తప్పవని వర్సిటీలో చర్చ జరుగుతోంది.

విచారణకు వచ్చే అవకాశం: ప్రసాదరెడ్డిపై లోకాయుక్త లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గతేడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అలుమ్ని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయా ఫిర్యాదులతో కూడిన నివేదికను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు కూడా పంపారు. కానీ వైకాపా పెద్దలు ఆ వ్యాజ్యాన్ని విచారణకు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారిన నేపథ్యంలో విచారణకు రావొచ్చని సంఘ ప్రతినిధులు భావిస్తున్నారు. ఆ ఫిర్యాదులో పొందుపరచిన పలు అంశాలపై ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విచారణ జరపాలని విద్యావేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. అందులో పేర్కొన్న అంశాలివే..

ప్రైవేటు కళాశాలలో పనిచేసిన ప్రసాదరెడ్డి శిష్యుడికి అర్హత లేకున్నా అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం ఛైర్‌ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలోకి తీసుకొచ్చారు. వర్సిటీలో కనీసం రెండేళ్ల ప్రొబేషన్‌ పూర్తికాకుండానే సీనియర్‌ ఆచార్యులను పక్కనపెట్టి గతేడాది సెప్టెంబరులో రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆచార్య వి.కృష్ణమోహన్‌ 2020 ఆగస్టు 31న విశ్వవిద్యాలయ సేవల నుంచి విరమణ పొందారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పలుమార్లు లేఖలు రాసి ఆయన పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించారు. మూడోసారి పొడిగించిన పదవీ కాలం గత సెప్టెంబరులో ముగియగా అక్టోబరులో ఓస్డీగా నియమించారు.

ఎలాంటి ప్రకటన లేకుండా: విద్యాసంస్థలు, పరిశ్రమలకు అనుబంధం ఏర్పరిచేందుకు అడ్జంక్ట్‌ ప్రొఫెసర్లు (అనుబంధ ఆచార్యులు)ను నియమించాలని యూజీసీ 2000లో సూచించింది. దీనిని ఆసరాగా తీసుకుని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన 45 మందిని ఏయూలో అనుబంధ ఆచార్యులుగా నియమించారు. ఇందుకు పత్రికా ప్రకటన, సర్య్కులర్‌ ఇవ్వకపోగా దరఖాస్తులు కూడా ఆహ్వానించలేదని సమాచారం. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఒప్పంద ప్రాతిపదికన 15 మంది సహాయ ఆచార్యులను నియమించారు. నిపుణులైన విశ్రాంత ఆచార్యులను వర్సిటీలో వివిధ విభాగాల్లో గౌరవ ఆచార్యులు (హానరరీ ప్రొఫెసర్లు)గా నియమించాలని 2018లో కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. కానీ ప్రసాదరెడ్డి ఆయనకు నచ్చిన 60 మందికిపైగా ఆచార్యులను గౌరవ ఆచార్యులుగా నియమించారనేది ప్రధాన ఆరోపణ. మరో వైపు 2021 నుంచి పలువురు ప్రిన్సిపాళ్లు  పదవీ విరమణ చేయగా... కొందరు ఇప్పటికీ ఆ హోదాలో కొనసాగుతుండటం గమనార్హం.

కోర్టు ఆదేశించినా: ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను విశ్వవిద్యాలయాలకు కేటాయించడంపై హైకోర్టు స్టే విధించింది. ప్రసాదరెడ్డి, అప్పటి రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ 113 మంది డిగ్రీ కళాశాలల అధ్యాపకులను వివిధ విభాగాల్లో నియమించారు. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు కాగా.. వారిని వెనక్కు పంపాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించారు. ప్రభుత్వం సైతం పాత ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది. 73 కళాశాలల అధ్యాపకులు వెనక్కి వెళ్లగా 40 కళాశాలలకు చెందిన లెక్చరర్లు ఇప్పటికీ వర్సిటీలో కొనసాగుతున్నారు. వారికి జీతాలు చెల్లించలేమని విద్యాశాఖ తేల్చిచెప్పగా వర్సిటీ నిధుల నుంచి నెలకు రూ.కోటికిపైగా చెల్లిస్తున్నారు. ప్రొఫెసర్ల నియామకానికి ప్రకటన రాగానే వారిని ఆచార్యులుగా తీసుకుంటామని, వెనక్కి వెళ్లవద్దని ప్రసాదరెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని