logo

Indian Railway: జన్మభూమి లేదు.. రత్నాచల్‌ రాదు.. రైల్వే నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం

ఒకటి.. రెండు రోజులు కాదు.. ఏకంగా 47 రోజులపాటు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Updated : 24 Jun 2024 09:12 IST

47 రోజులపాటు ఇంటర్‌ సిటీ రైళ్ల రద్దు
పేద, మధ్యతరగతికి అవే ఆధారం
విశాఖపట్నం, న్యూస్‌టుడే

రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వద్ద ప్రయాణికుల రద్దీ (పాతచిత్రం)

ఒకటి.. రెండు రోజులు కాదు.. ఏకంగా 47 రోజులపాటు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ ఇన్ని రోజులు ఆ మూడు రైళ్లను రద్దు చేయలేదు.

గత ఏడాదిగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలో భద్రతా పరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంతో తరచుగా సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. అయితే ప్రత్యామ్నాయంగా జన్మభూమి, రత్నాచల్‌ రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బందులు పడలేదు.

ఒక్కటైనా నడపకపోతే కష్టమే..:

విశాఖ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికుల్లో అధిక శాతం జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను ఎక్కుతారు. ఛార్జీలు తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఒక్కో రైలులో రోజుకు 2వేల మంది ప్రయాణం చేస్తారని అంచనా. మూడు రైళ్లు సుమారు 6వేల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను కూడా తీసుకుంటే ఈ సంఖ్య 10వేల వరకు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే స్థాయిలో జనాలు ఆయా రైళ్లను ఆశ్రయిస్తారు. ఈ లెక్కన రోజుకు 20వేల మంది ఆయా రైళ్లపై ఆధాపడుతున్నారు. అంతటి కీలకమైన రైళ్లను ఈనెల 24వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అంటే 47రోజులపాటు రద్దు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. కనీసం మూడింటిలో ఒక్క రైలైనా నడపాలని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడతారని వాపోతున్నారు.

ఈ రైళ్లే ఎందుకు..?

విశాఖ స్టేషన్‌ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిల్లో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌లు, పాసింజర్‌లు ఉన్నాయి. దూర ప్రాంతాలైన హావ్‌డా, బెంగళూరు, చెన్నై, న్యూదిల్లీ, ముంబయి ప్రాంతాలకు వెళ్లే రైళ్లను యథావిధిగా నడుపుతున్నారు. కేవలం విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, గుంటూరు వెళ్లే రైళ్లనే లక్ష్యంగా చేసుకోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. వాటిని పూర్తిగా రద్దు చేయకుండా కనీసం రాజమహేంద్రవరం వరకు నడిపినా బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖ నుంచి విజయవాడకు జన్మభూమి, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లలో సెకండ్‌ సిటింగ్‌ సీటు ఛార్జీ కేవలం రూ.150మాత్రమే.. అదే ఆర్టీసీ బస్సులో అయితే రూ.600పైమాటే.. అంటే నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే పేద, మధ్య తరగతి ప్రజలు ఆయా రైళ్లను ఆశ్రయిస్తుంటారు. అంతటి కీలకమైన రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయం తీసుకోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే వాల్తేరు డివిజన్‌ అధికారులకు నిరసన సెగ మొదలైంది.

‘ప్రయాణికుల ఇబ్బందులను దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, ఇప్పటికే పనులు ఆలస్యమయ్యాయని, తప్పని సరి పరిస్థితుల్లో రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించార’ని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. పనులు జరిగే కొద్దీ 10 రోజుల్లో రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని తిరిగి పట్టాలపైకి ఎక్కించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని