logo

‘ఆదివాసులను అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్ర’

బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మన్యం ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని

Published : 30 Mar 2023 03:10 IST

చింతపల్లిలో  గిరిజన సంఘం నాయకుల ర్యాలీ

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మన్యం ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శేషాద్రి డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక గిరిజన ఉద్యోగ భవనంలో జేఏసీ, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఆదివాసుల హక్కులకు వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా తీర్మానం చేశారన్నారు. ఈనెల 31న తలపెట్టిన మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీ జిల్లా నాయకులు ఒంపురి గంగులయ్య మాట్లాడుతూ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు అరకులో వందలాది ఎకరాల మైనింగ్‌ భూములను, గిరిజన సంపదను కాజేశారని ఆరోపించారు. జేఏసీ నాయకులు బొర్రా నాగరాజు, కూడా కృష్ణారావు, జైతి ప్రభాకర్‌, ప్రసాద్‌రావు, ఉద్యోగ సంఘం నాయకులు లోచలి రామకృష్ణ పాల్గొన్నారు.
చింతపల్లి, న్యూస్‌టుడే: బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై గిరిజన ఎమ్మెల్యేలు తమ వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజై డిమాండ్‌ చేశారు. చింతపల్లిలో గిరిజన సంఘం నాయకులు ర్యాలీ చేపట్టారు.  
ఎటపాక, కూనవరం, న్యూస్‌టుడే: ఆదివాసీ సంక్షేమ పరిషత్తు జిల్లా కార్యదర్శి మధు ఆధ్వర్యంలో లక్ష్మీపురంలో బిక్షాటన చేశారు. ప్రభుత్వం ఈ తీర్మాణాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఎటపాకలో బంద్‌ గోడపత్రికలు గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్జున్‌ దొర ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మేడువాయిలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బందును జయప్రదం చేయాలని భాజపా సీనియర్‌ నాయకుడు పాయం వెంకయ్య కూనవరంలో కోరారు.

డుంబ్రిగుడలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల నిరాహార దీక్ష

రంపచోడవరం గ్రామీణం: తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు కంగల శ్రీనివాసు, బోండ్ల వరప్రసాదరావు, కత్తుల ఆదిరెడ్డి, ఆదివిష్ణు తదితరులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఆదివాసీ భవనంలో సమావేశమయ్యారు. జేఏసీ నాయకులు వంజం జోగారావు, కురసం వరలక్ష్మి, సోళ్ల బొజ్జిరెడ్డి, ఈకా బుల్లికొండలుదొô పాల్గొన్నారు.
జి.మాడుగుల, కొయ్యూరు, న్యూస్‌టుడే: బంద్‌కు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింహాచలం కోరారు. జి.మాడుగులలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెదేపా నాయకులు చిట్టిబాబు, జనసేన నాయకుడు భీమన్న పాల్గొన్నారు. తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూరిబాబు డిమాండ్‌ చేశారు.  మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేశారు.
డుంబ్రిగుడ, న్యూస్‌టుడే:  శుక్రవారం నిర్వహించనున్న మన్యం బంద్‌ను జయప్రదం చేయాలని కించుమండ సంతలో గిరిజన సంఘం నాయకులు కరపత్రాలను పంచుతూ ప్రచారం చేపట్టారు. గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, చట్టాలను తుంగలో తొక్కుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలన్నారు.

మేడువాయిలో ఏఎస్పీ నాయకులు, గిరిజనుల నిరసన

అరకులోయ పట్టణం:  మన్యం బంద్‌  ప్రచార గోడప్రతులు గిరిజన సంఘం నాయకులు అరకులోయలో విడుదల చేశారు.  శుక్రవారం జరిగే వారపుసంతకు వచ్చే గిరిజనులు బంద్‌కు సహకరించాలని కోరారు. గిరిజన సంఘం నాయకులు రామారావు, లలిత్‌, అర్జున్‌, లోకేష్‌, బలరాం పాల్గొన్నారు..  బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాడగడ పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వైకాపాకు చెందిన సర్పంచి పాడి జ్యోతి ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు సమావేశం నిర్వహించి ఎస్టీ జాబితాలో చేర్చవద్దంటూ తీర్మానాన్ని చేసి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే ఎస్టీ జాబితాలోకి బోయవాల్మీకులు
ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందకు అసెంబ్లీలో తీర్మానం చేసిందని మాజీ ఎమ్మెల్యే, బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త లకే రాజారావు ఆరోపించారు. బుధవారం ముంచంగిపుట్టులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ అయిదో షెడ్యూల్డ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన సూచనతో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం గిరిజన హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. వనుగుమ్మలోని గిరిజనులు విల్లంబులతో ఆందోళన చేపట్టారు. సీఐటీయూ నేతలు శంకరరావు, సుబ్బారావు, భీమన్న, రఘు, సుఖదేవ్‌ పాల్గొన్నారు.  
గూడెంకొత్తవీధి:  గిరిజన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జీకేవీధిలో నిరసన తెలిపారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోచెల రామకృష్ణ, జేఏసీ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ మొట్టడం రాజబాబు, కొర్ర బలరాం పాల్గొన్నారు.
హుకుంపేట, డుంబ్రిగుడ: బంద్‌ను విజయవంతం చేయాలని గిరిజన సంఘ నాయకులు కృష్ణరావు, కొండలరావు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో  గోడప్రతులు ఆవిష్కరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు ఆదివాసీలు గుణపాఠం చెప్పక తప్పదని కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసీ రాష్ట్ర ఛైర్‌పర్సన్‌ శాంతకుమారి హెచ్చరించారు. డుంబ్రిగుడలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని