logo

మమ్మేలు.. మాతల్లి మోదకొండమ్మ!

కోర్కెలు తీర్చే కల్పవల్లి.. మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. సతకంపట్టు వద్ద మోదకొండమ్మ కొలువుదీరడంతో ఈనెల 9న వేడుకలు ప్రారంభమై, మూడు రోజులపాటు జరిగాయి.

Updated : 12 Jun 2024 02:50 IST

ఘనంగా అనుపోత్సవం
పట్టువస్త్రాలు సమర్పించిన పీఓ

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: కోర్కెలు తీర్చే కల్పవల్లి.. మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. సతకంపట్టు వద్ద మోదకొండమ్మ కొలువుదీరడంతో ఈనెల 9న వేడుకలు ప్రారంభమై, మూడు రోజులపాటు జరిగాయి. మంగళవారం అనుపోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో పట్టణమంతా మోదకొండమ్మ నామస్మరణతో మార్మోగింది. ఈ పండగ రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందడంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

ముగింపు వేడుకల్లో భాగంగా మంగళవారం వేకువజాము నుంచే మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు అమ్మవారి గుడి వద్ద పోటెత్తారు. కలెక్టర్‌ విజయ సునీత, ఐడీఏ ప్రాజెక్ట్‌ అధికారి అభిషేక్‌ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. పీఓ చేతులమీదుగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఊరేగింపుగా వచ్చిన భక్తులు ఘటాలను, కలశాలను ఒకచోట పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల తాకిడితో గుడి ప్రాంగణం కిక్కిరిసింది. వీఐపీ పాస్‌ జారీ చేయకపోవడంతో కొంత మంది ముఖ్యులు సైతం క్యూలైన్‌లోనే వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్పీ తుహిన్‌సిన్హా, ఏఎస్పీ ధీరజ్‌ ఆధ్వర్యంలో శాంతిభద్రతలు పర్యవేక్షించారు.

పోటెత్తిన భక్తజనం

సతకంపట్టు వద్ద మంగళవారం సాయంత్రం డప్పు వాయిద్యాలతో ఊరేగింపు ఆరంభమైంది. కలెక్టర్‌ విజయసునీత, పీఓ అభిషేక్, సంయుక్త కలెక్టర్‌ భావన, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, భాగ్యలక్ష్మి ఉత్సవ విగ్రహాలను, ఘటాలను తలపై ఎత్తుకుని ఊరేగింపును ప్రారంభించారు. ఊరేగింపు ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి, అంబేడ్కర్‌ కూడలి మీదుగా అమ్మవారి దేవాలయం వరకూ సాగింది. దేవాలయ సన్నిధిలో బాణసంచా పేలుళ్లతో ఉత్సవాలకు ముగింపు పలికారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాల ద్వారా భక్తులకు సేవలందించారు. పంచాయతీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో ప్రత్యేక వాహనాల ద్వారా తాగునీటిని అందించారు. ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యులు కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రామారావు, యాదగిరి, ప్రసాదరావు పర్యవేక్షించారు.

అనుపోత్సవంలో ఘటాలను తలపై ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్న కలెక్టర్‌ విజయ సునీత, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్,
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆలయ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు

మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తెచ్చిన ఘటాలు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని